విద్యార్థినికి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది
వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన అడ్డా మీది డ్రైవర్
నర్సింగ్ విద్యార్థిని తలకు గాయం,
స్పృహ తప్పి పడిపోయిన మరో విద్యార్థిని
సిద్దిపేటకమాన్: తన ఆటోలో ఎక్కకుండా వేరే ఆటోలో ఎక్కారని కోపంతో ఓ ఆటో డ్రైవర్ విద్యార్థినులు వెళ్తున్న ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కొంత మంది విద్యార్థులు పొన్నాలలోని వెంకటసాయి నర్సింగ్ కళాశాలలో చదువుతున్నారు. రోజు మాదిరిగానే కళాశాలకు వెళ్లడానికి నవ్య, ఇద్దరు స్నేహితులతో కలిసి బుధవారం ఉదయం గ్రామం నుంచి సిద్దిపేట పట్టణానికి వచ్చింది.
కళాశాలకు వెళ్లడానికి ముగ్గురూ సిద్దిపేట బస్టాండ్ వద్ద దాసరి శ్రీనివాస్ ఆటోలో ఎక్కారు. అక్కడే ఉన్న ఆటోల అడ్డా వారు విద్యా ర్థినులను ఎందుకు ఎక్కించుకున్నావ్.. చార్జీలు తక్కువ ఎందుకు తీసుకుంటున్నావ్ అని శ్రీనివాస్‌తో గొడవ పడ్డారు. శ్రీనివాస్ వెళ్తున్న క్రమంలో పట్టణానికి చెందిన మరో ఆటో డ్రైవర్ బర్రెంకల నవీన్ తన ఆటోతో విద్యార్థినులు వెళ్తున్న ఆటోను ఢీకొట్టాడు.
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నవ్య రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. మరో విద్యార్థిని మౌనిక స్పృహ తప్పి కిందపడిపోయింది. వెంటనే వారిని సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ఆటో డ్రైవర్ నవీన్‌పై చర్యలు తీసుకోవాలని గాయపడిన విద్యార్థిని తండ్రి నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment