కడియపులంక వద్ద అనధికార లే అవుట్‌లో గుడా హెచ్చరిక బోర్డు, కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద అనధికార లే అవుట్ తొలగింపు
కాకినాడ రూరల్: అద్దె ఇళ్లల్లో.. చాలీచాలని ఇరుకు కొంపల్లో ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నవారు.. అప్పోసప్పో చేసి సొంతిల్లు కట్టుకోవాలని కలలు కంటారు. దీనిని సొమ్ము చేసుకొనే లక్ష్యంతో పట్టణాలు, నగరాలను ఆనుకొని ఉన్న పల్లెల్లో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తగిన అనుమతులు లేకుండానే ఇష్టానుసారం లే అవుట్లు వేసేస్తున్నారు. తక్కువ ధరల పేరుతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలపై వల విసురుతున్నారు. ఆ వలలో చిక్కుకున్న వారికి చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు గుడా అధికారులు. నిబంధనలు పాటించకుండా వేసిన లే అవుట్లలోని స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులు రావని స్పష్టం చేస్తున్నారు. అటువంటి అనధికార లే అవుట్లలోని ప్లాట్లను వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల ఒత్తిళ్లతో జిల్లాలోని పలు వ్యవసాయ భూములు వ్యవసాయేతరంగా మారిపోయాయి. ఆ పార్టీ నేతల కనుసన్నల్లో రియల్ ఎస్టేట్ నిబంధనలను తుంగలో తొక్కి.. అనేకమంది యథేచ్ఛగా అనధికార లే అవుట్లు (నాన్ లే అవుట్లు) వేసేశారు. సామాజిక అవసరాలకు స్థలాలను మినహాయించకుండానే ప్లాట్లు వేసి అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారు. తగిన అనుమతులు లేని ఇటువంటి లే అవుట్లలో భవిష్యత్తులో భవన నిర్మాణాలకు అవకాశం ఉండదు. అంతేకాదు.. వీటిని అమ్ముకునే వీలు కూడా ఉండదని గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ (గుడా) అధికారులు స్పష్టం చేస్తున్నారు.
23 మండలాల పరిధిలో..
జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలతో పాటు తుని, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం, మండపేట మున్సిపాలిటీలు, గొల్లప్రోలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీలు, 43 మండలాల్లోని 598 రెవెన్యూ గ్రామాలు గుడా పరిధిలో ఉన్నాయి. మొత్తం 4396.84 చదరపు కిలోమీటర్ల మేర గుడా పరిధి విస్తరించి ఉంది. మొత్తం 23 మండలాల్లో విస్తరించి ఉన్న గుడా పరిధిలో 1,338 అనధికార లే అవుట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో అత్యధికంగా 370 ఉండగా, కడియం మండలంలో అత్యల్పంగా 6 ఉన్నాయి. వీటిని ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని నిషేధిత భూముల రిజిస్టర్‌లో నమోదు చేయించారు. తద్వారా వాటి కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు. ఇటువంటి లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారు ముందే మేల్కోవాలని, ఏప్రిల్ ఆరో తేదీలోగా వాటిని క్రమబదీ్ధకరించుకోవాలని సూచిస్తున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌తో ప్రయోజనాలు
లే అవుట్ రెగ్యులరైజేషన్ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా అనధికార లే అవుట్లను క్రమబదీ్ధకరించుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8న జీఓఎంఎస్ 10 ద్వారా అనుమతి ఇచ్చింది. దీని ద్వారా గత ఏడాది ఆగస్టు 31కి ముందు వేసిన అనధికార లే అవుట్లలోని ప్లాట్లను క్రమబదీ్ధకరించుకొనేందుకు అవకాశం ఇచ్చింది. జిల్లాలోని సంబంధిత యజమానులు తమ ప్లాట్లను ఏప్రిల్ ఆరో తేదీలోగా క్రమబద్దీకరించుకుంటే 14 శాతం ఓపెన్ స్పేస్ ఖరీదులో 50 శాతం మినహాయింపు లభిస్తుంది. పూర్తి వివరాలకు కాకినాడ ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డులో ఉన్న తమ కార్యాలయాన్ని సంప్రదించాలని గుడా అధికారులు సూచిస్తున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌ను వినియోగించుకోండి..
రాష్ట్ర ప్రభుత్వం అనధికార లే అవుట్ల క్రమబదీ్ధకరణకు ఎల్‌ఆర్‌ఎస్–2020కి జనవరిలో అనుమతి ఇచ్చింది. ఈ పథకాన్ని గుడా పరిధిలోని నాన్ లే అవుట్ల ప్లాట్ల యజమానులు వినియోగించుకోవచ్చు. ఇప్పటికే 1,338 నాన్ లే అవుట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిషేధిత భూముల రిజిస్టర్లలో నమోదు చేశాం. దీనివల్ల భవిష్యత్తులో అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం ఉండదు. అందువల్ల ఎల్‌ఆర్‌ఎస్ మంచి అవకాశం.
– ఆర్.అమరేంద్రకుమార్, వైస్ చైర్మన్, గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ
Comments
Please login to add a commentAdd a comment