లే అవుట్లు.. స్థానికంగా చిన్న డెవలపర్లు అభివృద్ధి చేసే వెంచర్లు! కానీ, వీటికి విపరీతమైన మార్కెట్ ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాతైతే మరీనూ!! దీంతో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు లే అవుట్ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇన్నాళ్లూ శివారు, సుదూర ప్రాంతాలకే పరిమితమైన లే అవుట్లు.. ఇప్పుడు అభివృద్ధి చెందే ప్రాంతంలో.. అదీ అందుబాటు ధరల్లో అన్ని రకాల ఆధునిక వసతులతో కస్టమర్లను రా..రమ్మంటున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే అపార్ట్‌మెంట్లలో నివసిస్తూ విసిగిపోయిన చాలా మంది.. కాస్త దూరం వెళ్లి ప్రశాంతంగా ఓ ఇల్లు కట్టుకుని నివసించాలనే నిర్ణయానికి వస్తున్నారు. ఇప్పుడే కాకపోయినా మూడు నాలుగేళ్లలో సొంతిల్లు కట్టుకోవాలని భావించేవారు శివారు ప్రాంతాల్లో ప్లాట్లను కొంటున్నారు. కాకపోతే రవాణా సదుపాయాలుండాలని కోరుకుంటున్నారు.
భవిష్యత్తు అభివృద్ధికి ఆస్కారముండే ప్రాంతాలనే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో స్థల యజమానులకు కూడా లే అవుట్ల మీద అవగాహన వచ్చేసింది. తన భూమిని మంచి పేరున్న డెవలపర్‌కు ఇచ్చి లే అవుట్ చేసి విక్రయిస్తే ఆయా చుట్టుపక్కల ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని నిర్ణయానికి వస్తున్నారు. దీంతో పేరున్న డెవలపర్లు భారీ స్థాయిలో వెంచర్లు చేస్తున్నారు.
పేరున్న నిర్మాణ సంస్థలెన్నో..
అపర్ణా, సుచిరిండియా, ఏవీ కన్‌స్ట్రక్షన్స్, ఏఆర్కే వంటి సంస్థలు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వెంచర్లకు శ్రీకారం చుట్టాయి. ఇటీవలే 26 ఎకరాల్లో కీసర్ మెడోస్ వెంచర్‌ను పూర్తి చేశామని.. తాజాగా బోగారంలో దేవకీ మెడోస్ పేరిట 47 ఎకరాలను అభివృద్ధి చేయనున్నామని ఏవీ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ వెంకట్ రెడ్డి తెలిపారు.
వచ్చే ఏడాది కాలంలో మరో 50 ఎకరాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అలాగే సుచిరిండియా బోగారంలోని హోలీమేరీ కళాశాలను ఆనుకొని ఓయ్‌స్టర్ బ్లూ పేరిట 60 ఎకరాలను, హకీంపేట్ రోడ్‌లోని తూంకుంటలో ఆర్యవర్తనగరి పేరిట 86 ఎకరాలను అభివృద్ధి చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు లే అవుట్లను అభివృద్ధి చేస్తే మార్కెట్లో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని నిపుణులు చెబుతున్నారు.
అభివృద్ధి చెందే ప్రాంతాల్లోనే..
ఆర్గనైజ్ డెవలపర్లు లే అవుట్లు చేస్తే కొనుగోలుదారులకూ మంచిదే. ఎందుకంటే హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి ప్రభుత్వ విభాగాల అనుమతులతోనే అది కూడా అభివృద్ధి చెందే ప్రాంతాల్లోనే వెంచర్లకు శ్రీకారం చుడతారు. దీంతో త్వరితకాలంలోనే కస్టమర్లు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. పైగా డెవలపర్లకు సొంత మార్కెటింగ్ బృందం ఉంటుంది కాబట్టి.. మధ్యవర్తుల బెడద ఉండదు.దీంతో ధర కూడా తక్కువగా ఉంటుంది. నాలా కన్వర్షన్ చేసి.. రెసిడెన్షియల్ జోన్‌లోనే లే అవుట్‌ను వేస్తారు కాబట్టి నిర్మాణ అనుమతులకూ ఇబ్బందులుండవు.
రీసేల్ విలువ పెరుగుతుంది..
అనుమతి ఉన్న వెంచర్లలో ప్లాట్లు కొంటే బ్యాంక్ లోన్‌ను కూడా సులువుగా అందిస్తుంది. 20 ఏళ్ల తర్వాత జరగబోయే అభివృద్ధిని, జనాభాను ముందుగానే ఊహించి అప్పటి అవసరాలకు తగ్గట్టుగా విశాలమైన రోడ్లు అంటే 80 అడుగుల వెడల్పు రోడ్లు, పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఇంకుడు గుంతలు వంటి ఏర్పాట్లన్నీ ఉంటాయి.
పైగా ఐదేళ్ల పాటు వీటి నిర్వహణ బాధ్యతలను కూడా డెవలపర్లే నిర్వహిస్తారు. దీంతో ఆయా ప్లాట్లకు రీసేల్ విలువ పెరుగుతుంది. ఉదాహరణకు.. రెండేళ్ల క్రితం ఘట్‌కేసర్‌లో గజం రూ.6,500. ఉప్పల్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ అక్కడ లే అవుట్ చేశాక ఇప్పుడక్కడ గజం ధర రూ.12 వేలకు చేరింది. అలాగే ఏడాది క్రితం గజం రూ.8 వేలున్న చెంగిచెర్లలో ఓ నిర్మాణ సంస్థ వెంచర్‌ను అభివృద్ధి చేశాక ఇప్పుడక్కడ గజం ధర రూ.12,500కు చేరింది.
లే అవుట్లలో ఆధునిక వసతులు..
గతంలో లే అవుట్లలో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక వసతులు కల్పించేసి.. ప్లాట్లను విక్రయించేవాళ్లు. కానీ, ఇప్పుడు అపార్ట్‌మెంట్లలో ఉండే వసతులు అంటే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, బాంక్వెట్ హాల్, ఫంక్షన్ ఏరియా, పార్క్, ప్లే ఏరియా వంటి అన్ని రకాల ఏర్పాట్లు ఉంటున్నాయి. దీంతో కొనుగోలుదారులు వీకెండ్ టూర్‌గా ఎంజాయ్‌గా చేస్తున్నారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారు. పైగా లింక్ డాక్యుమెంట్లు, టైటిల్ పక్కాగా ఉంటాయి. న్యాయపరమైన సమస్యలేవీ ఉండవు గనక ప్రాపర్టీ కస్టమర్లు నిశ్చింతంగా ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment