గ్రాట్యుటీ.. ఎవరికొస్తుంది.. ఎంతొస్తుంది? | What is Gratuity? Eligibility, Calculation and all you need to know | Sakshi
Sakshi News home page

గ్రాట్యుటీ.. ఎవరికొస్తుంది.. ఎంతొస్తుంది?

Published Mon, Jun 24 2024 9:16 AM | Last Updated on Mon, Jun 24 2024 10:15 AM

What is Gratuity? Eligibility, Calculation and all you need to know

ప్రైవేటు రంగంలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత ఉంటుందని చెప్పలేం. అదే సమయంలో ఉద్యోగి తన వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల దృష్ట్యా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారిపోవడం సహజంగా చూస్తుంటాం. కారణాలు ఏవైనా కానీ ఉద్యోగం వీడితే వచ్చే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ఉద్యోగం నుంచి వైదొలగినప్పుడు వచ్చే ప్రయోజనాల్లో గ్రాట్యుటీ కీలకమైనది. ఉద్యోగి పనిచేసిన కాలంపై ఇది ఆధారపడి ఉంటుంది. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ఇందుకు ప్రామాణికం. చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించే కథనమే ఇది.

గ్రాట్యుటీ అంటే..? 
ఉద్యోగి సేవలను గుర్తిస్తూ సంస్థ అందించే ఆర్థిక ప్రయోజనమే గ్యాట్యుటీ. ఎన్నో ఏళ్లుగా సంస్థ అభ్యున్నతి కోసం సేవలు అందించే ఉద్యోగుల పట్ల చూపించే కృతజ్ఞత. ఇది వేతనంలో భాగం కాదు. ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. కానీ, ఇందుకు అర్హత సాధించాలంటే గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం, 1972లో నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగి సేవలు ఉండాలి. కనీసం ఐదేళ్ల సర్వీస్‌ (పని చేసిన 
కాలం) పూర్తి చేసుకున్న వారికే దీన్ని పొందే అర్హత లభిస్తుంది. ఎన్నో రంగాలకు ఈ చట్టం అమలవుతోంది. ప్రభుత్వ విభాగాలు, డిఫెన్స్, స్థానిక సంస్థల ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు దీని పరిధిలోకి వస్తారు.  

ఎన్నేళ్లు పనిచేయాలి?
గడిచిన ఏడాది కాలం పాటు కనీసం 10 మంది ఉద్యోగులు కలిగిన సంస్థలకు గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం వర్తిస్తుంది. ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు నిబంధనలకు అనుగుణంగా గ్రాట్యుటీని అందించాల్సి ఉంటుంది. మైనింగ్‌ విధుల్లో ఉన్న ఉద్యోగులకు కనీసం 190 పని దినాలు, నాన్‌ మైనింగ్‌ విధుల్లోని వారికి 240 పనిదినాలు ఏడాది కింద పరిగణిస్తారు. కనీసం ఐదేళ్ల పాటు అంతరాయం లేకుండా సేవలు అందించిన ఉద్యోగులు అందరూ గ్రాట్యుటీకి అర్హులు. సమ్మెలు, లాకౌట్‌లు, ప్రమాదాలు, సెలవులు, తాత్కాలిక తొలగింపు వల్ల గైర్హాజరుకు మినహాయింపులు ఉంటాయి. ఐదేళ్ల సర్వీస్‌ పూర్తి కాకముందే సంస్థ తొలగించిన సందర్భంలోనూ ఉద్యోగికి గ్రాట్యుటీ చెల్లించాల్సిందే. 

వారంలో ఆరు పనిదినాలు అమలు చేసే కంపెనీల్లో 4 ఏళ్ల 240 రోజులు పనిచేసినా గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది. వారంలో ఐదు రోజుల పనిదినాలున్న కంపెనీల్లోని వారు 4 ఏళ్ల 190 రోజులు పనిచేస్తే అర్హులు. కొన్ని రంగాల్లోని వారికి ఈ కనీస పదవీ కాలం భిన్నంగా ఉంటుంది. న్యూస్‌ పేపర్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ మిస్‌లేనియస్‌ ప్రొవిజన్స్‌ యాక్ట్‌ కింద పనిచేసే వర్కింగ్‌ జరల్నిస్టులకు పదేళ్ల సర్వీస్‌ ఉంటేనే గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది. ఉద్యోగి మరణించినా లేదా వైకల్యం కారణంగా విధుల నుంచి తొలగించినప్పుడు పనిచేసిన కాలంతో సంబంధం లేకుండా గ్రాట్యుటీ చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. గ్రాట్యుటీ అనేది కేవలం పదవీ విరమణ వయసుకు వచ్చినప్పుడే కాకుండా.. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నప్పుడు, ఉద్యోగి తప్పిదం లేకుండా తొలగించినప్పుడు, రాజీనామా చేసినప్పుడు ఇవ్వాల్సి ఉంటుందని లెక్స్‌లెవర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ హర్షిత అగర్వాల్‌ శర్మ తెలిపారు.

పరిమితి 
గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ.20 లక్షలు. నిబంధనల ప్రకారం సంస్థలు గరిష్టంగా ఇంతకు మించి ఇవ్వక్కర్లేదు. రూ.20లక్షలు మించితే అది ఎక్స్‌గ్రేషియా కిందకు వస్తుంది. ఎక్స్‌గ్రేషియా ఎంత ఇవ్వాలన్నది సంస్థల అభీష్టమే. ఇంత మేర ఇవ్వాలని నిబంధనలు చెప్పడం లేదు.  

గ్రాట్యుటీ లెక్కింపు 
చివరి నెల వేతనంలో మూల వేతనం, డీఏ ఎంతో తెలుసుకోవాలి. ఇలా ఒక ఏడాదికి 15 రోజుల వేతనం గ్రాట్యుటీ కింద వస్తుంది. మొత్తం పనిచేసిన సంవత్సరాలు ఇంటూ 15 రోజులు ఇంటూ చివరిగా అందుకున్న మూల వేతనం, డీఏ డివైడ్‌ 26(నెలలో పనిచేసిన రోజులు) సూత్రం అమలవుతుంది. ఆరు నెలలు దాటిన కాలాన్ని పూర్తి ఏడాదిగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఎక్స్‌ అనే వ్యక్తి 12 సంవత్సరాల పాటు ఒక కంపెనీలో పనిచేసినట్టు అనుకుందాం. చివరిగా అందుకున్న మూల వేతనం, డీఏ కలిపి రూ.75,000. దీంతో ఎక్స్‌కు వచ్చే మొత్తం గ్రాట్యుటీ రూ.5,19,230. 

గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి రాని వారికి ఇచ్చే గ్రాట్యుటీ ఫార్ములా కొంత భిన్నం. ఏడాదిలో 15 రోజులు ఇంటూ చివరి నెలలో మూల వేతనం, డీఏ ఇంటూ పనిచేసిన సంవత్సరాలు డివైడ్‌ 30(నెలలో పనిచేసిన రోజులు). పూర్తి ఏడాది పాటు పనిచేసిన కాలాన్నే వీరికి ఏడాది కింద పరిగణిస్తారు. దీని ప్రకారం ఎక్స్‌ అనే వ్యక్తి ఒక సంస్థలో 12 ఏళ్లు పనిచేసి, చివరి నెలలో మూలవేతనం, డీఏ కింద రూ.75,000 తీసుకున్నారని అనుకుంటే.. వచ్చే గ్రాట్యుటీ రూ.4,50,000.  

ఆలస్యం అయితే 
విధుల నుంచి వైదొలగిన 30 రోజుల్లోపు గ్రాట్యుటీ చెల్లించాలి. ఇంతకుమించి జాప్యం చేస్తే ఆ మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగికి గ్రాట్యుటీ ప్రయోజనం అన్నది పనిచేసిన కాలం ఆధారంగానే అర్హత ఉండాలి కానీ, రిటైర్మెంట్‌ వయసు ఆధారం కాకూడదని ఇటీవలే అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. ‘‘60 ఏళ్లకు రిటైర్మెంట్‌ తీసుకుంటేనే గ్రాట్యుటీ, లేకపోతే అర్హత లేదన్నది సరైనది కాదు. ఒక ఉద్యోగి ఎన్ని సంవత్సరాల పాటు పనిచేశాడన్న దాని ఆధారంగా గ్రాట్యుటీ హక్కు లభిస్తుంది’’అని అలహాబాద్‌ సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఓ కేసులో భాగంగా తీర్పు జారీ చేసింది.

పన్ను బాధ్యత 
గ్రాట్యుటీపై పన్ను విషయంలో ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగ ఉద్యోగులకు నిబంధనల్లో వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరికైనా (కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల) సరే గ్రాట్యుటీ ఎంత అందుకున్నా పన్ను లేదు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారికి రూ.20 లక్షలు లేదా, చివరి 15 రోజుల వేతనాన్ని పనిచేసిన సంతవ్సరాలతో హెచ్చించినప్పుడు వచ్చే మొత్తం, వాస్తవంగా అందుకున్న గ్రాట్యుటీ.. వీటిల్లో ఏది తక్కువ అయితే ఆ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 10(10) కిందకు గ్రాట్యుటీ వస్తుంది. గతంలో రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను ఉండేది కాదు. ఈ పరిమితిని మోదీ సర్కారు రూ.20 లక్షలకు పెంచింది.

ఇవి తెలుసుకోవాలి.. 
» పనిచేసిన కాలం ఆరు నెలలు దాటి ఒక్క రోజు ఉన్నా దాన్ని పూర్తి సంవత్సరం కింద గ్రాట్యుటీ చెల్లింపులకు పరిగణనలోకి తీసుకుంటారు.  
» ఉద్యోగి దుష్ప్రవర్తన కారణంగా సంస్థ తొలగించినప్పుడు గ్రాట్యుటీ ఇవ్వక్కర్లేదు.  
» ఉద్యోగి మరణించిన సందర్భాల్లో నామినీ లేదా వారసులకు గ్రాట్యుటీ చెల్లిస్తారు. 
» సంస్థలు దివాలా తీసినప్పటికీ గ్రాట్యుటీ చెల్లించాల్సిన బాధ్యత వాటిపై ఉంటుంది.  
» నోటీస్‌ పీరియడ్‌ కూడా గ్రాట్యుటీ లెక్కింపు పరిధిలోకి వస్తుంది. 
» మూడేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకుంటే గ్రాట్యుటీకి అర్హత కల్పించాలన్న డిమాండ్‌ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement