Township
-
విశాఖ విమల విద్యాలయం మూసివేత
ఉక్కునగరం/గాజువాక: స్టీల్‌ప్లాంట్ టౌన్షిప్లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఉచిత తెలుగు మీడియం పాఠశాల.. ‘విశాఖ విమల విద్యాలయం’ హఠాత్తుగా మూతపడింది. పాఠశాలలు తెరుచుకునే ముందు రోజు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు, ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చింది. దీంతో సుమారు రెండు వేల మంది విద్యార్థులతో పాటు 70 మంది బోధన, బోధనేతర సిబ్బంది రోడ్డున పడ్డారు. స్టీల్‌ప్లాంట్ టౌన్షిప్లో తెలుగు విద్యార్థులు, నిర్వాసిత ప్రజల పిల్లల సౌకర్యార్థం స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం అభ్యర్థన మేరకు విశాఖకు చెందిన ఆర్సీఎం డయాసిస్ మిషన్ సంస్థ ఈ విద్యాలయాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి బిల్డింగ్‌తో పాటు విద్యుత్, మంచినీటి సరఫరా, ఫీజులు, సిబ్బంది జీతాలను ఉక్కు యాజమాన్యమే చెల్లిస్తోంది. ఇందులో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన నిర్వాసితులు, నిత్యం కూలి పనులు చేసుకునే వారి పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఐదేళ్లకు ఎంవోయూను రెన్యువల్ చేస్తారు. యాజమాన్యం ఏడాదికి సుమారు రూ.6 నుంచి 7 కోట్లు జీతాల రూపేణా చెల్లిస్తోంది. ఈ ఏడాది మే 31తో ఎంవోయూ గడువు ముగియనున్న నేపథ్యంలో గతేడాది అక్టోబర్ నుంచి మిషన్ ప్రతినిధులు ఎంవోయూ రెన్యువల్ కోసం అభ్యర్థన పంపారు. యాజమాన్యం ఎంవోయూ కొనసాగిస్తుందన్న ధీమాతో పాఠశాల యాజమాన్యం ఈ ఏడాది అడ్మిషన్లు పూర్తి చేయడంతో పాటు పుస్తకాలు, యూనిఫాంల అమ్మకాలు చేసింది. ఈ నెల 11న ఉక్కు యాజమాన్యం నుంచి పిడుగు లాంటి వార్త అందింది. పాఠశాల నిర్వహణకు బిల్డింగ్ ఇస్తామని సొంత ఫీజులతో పాఠశాల నిర్వహణకు సంబంధించి కొత్త ఎంవోయూ చేసుకుందామని తెలిపింది. దీంతో పాఠశాల యాజమాన్యం హడావుడిగా ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు 13 నుంచి పాఠశాలకు రావొద్దని సమాచారం ఇచ్చింది. ఈ విషయం తెలిసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకున్నారు. తమ పిల్లల భవిష్యత్తేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, పల్లా పెంటారావు తదితరులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నచ్చజెప్పారు.సొంతంగా నిర్వహించలేం గత 40 ఏళ్లుగా స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో పాఠశాల నడుస్తోంది. రెన్యువల్ కోసం అభ్యర్థించగా కొత్త ఎంవోయూకు సిద్ధమవమంటున్నారు. ఫీజులు వసూలు చేసుకుని జీతాలు చెల్లించుకోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలతో సమానంగా చెల్లించే మాకు సొంత ఫీజులతో పాఠశాల నిర్వహించే పరిస్థితి లేదు. – ఫాదర్ రత్నకుమార్, కరస్పాండెంట్ ఆర్సీఎం మిషన్ సీఎండీ బంగ్లా ముట్టడిస్తాం స్టీల్‌ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితుల పిల్లల కోసం నిర్వహిస్తున్న పాఠశాలను మూసివేయడం అన్యాయం. పాఠశాలను వెంటనే తెరిపించకపోతే సీఎండీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. రెండు వేల మంది పిల్లల అంశంపై అడ్మిన్, సీఎండీ బంగ్లాను ముట్టడిస్తాం. – బి.గంగారావు, 78వ వార్డు కార్పొరేటర్ పాఠశాల తెరిపిస్తాం హఠాత్తుగా పాఠశాలను మూసివేస్తే ఉపా«ధ్యాయులు, విద్యార్థులు రోడ్డున పడాల్సి వస్తుంది. ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల సహకారంతో ఉక్కు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తాం. పాఠశాలను తెరిపించే వరకూ వదిలే ప్రసక్తే లేదు. – పల్లా పెంటారావు, కార్మిక నాయకుడు మా పిల్లల పరిస్థితేంటి? కూలీ, నాలీ చేసుకుని బతుకులు సాగిస్తున్నాం. నా భర్త చనిపోతే నేను కూలి పనిచేసుకుంటూ నా కొడుకుని ఈ పాఠశాలలో చదివిస్తున్నాను. ఇప్పుడు పాఠశాల మూసేస్తామంటే ఎక్కడ చదవాలి? ఎవరు చేర్చుకుంటారు మాలాంటి పేదోళ్లను. – కృష్ణమ్మ, విద్యార్థి తల్లి మా చదువులు ఎలా? నేను పదో తరగతికి వచ్చాను. మేము చాలా పేదోళ్లం. మా తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలల్లో చదివించే స్తోమత లేదు. ఇప్పుడు మా పరిస్థితేంటి? మా చదువులు మధ్యలో ఆగిపోవాల్సిందేనా? – 10వ తరగతి విద్యార్థిని ఆందోళన వద్దు ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయం పునఃప్రారంభం విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని గాజువాక ఎంఈవోలు ఎం.సునీత, బి.విశ్వనాథం గురువారం ఓ ప్రకటనలో కోరారు. పాఠశాల మూసివేత వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లామని, విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా జిల్లా విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. -
తూర్పులో టౌన్షిప్!
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరానికి తూర్పు వైపున మరో భారీ లే అవుట్‌కు హెచ్ఎండీఏ కసరత్తు చేపట్టింది. అన్ని వైపులా నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఇటీవల కోకాపేట్, మోకిలా, బుద్వేల్, తదితర ప్రాంతాల్లో హెచ్ఎండీఏ సొంత స్థలాల్లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. గతంలో ఉప్పల్ భగాయత్‌లోనూ కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో పోటీపడ్డారు. ఇక్కడ మూడు దఫాలుగా బిడ్డింగ్ నిర్వహించి ప్లాట్లను విక్రయించారు. తాజాగా ఉప్పల్ భగాయత్ తరహాలోనే ప్రతాప సింగారంలో భారీ లే అవుట్‌ను వేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇందుకోసం రైతుల నుంచి భూసేకరణ చేపట్టింది. ఇప్పటి వరకు సుమారు 250 ఎకరాల భూములను సేకరించినట్లు అధికారులు తెలిపారు. రైతులకు, హెచ్ఎండీఏకు మధ్య ఒప్పందం కుదిరితే త్వరలోనే ఇక్కడ లే అవుట్ ఏర్పాటు చేయనున్నారు. రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేసి వెంచర్ చేసిన తరువాత రైతులకు 60 శాతం చొప్పున తిరిగి ఇస్తారు. 40 శాతం భూములను హెచ్ఎండీఏ తీసుకుంటుంది. ఈ లెక్కన ప్రతాపసింగారంలో 250 ఎకరాలను ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. అలాగే కీసర సమీపంలోని బోగారంలోనూ మరో 170 ఎకరాల వరకు లే అవుట్‌కు సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. రైతులతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే రెండు చోట్ల ప్లాట్లను అమ్మకానికి సిద్ధం చేయనున్నట్లు ఒక అధికారి వివరించారు. తూర్పు వైపు విస్తరణపై దృష్టి... హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నగరానికి అన్ని వైపులా సొంత భూములతోపాటు రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేసి విక్రయిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో పడమటి వైపున రియల్టర్లు, బిల్డర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఐటీ సంస్థలు, పలు అంతర్జాతీయ సంస్థలు సైతంపడమటి వైపే విస్తరించుకొని ఉండడం, హైరైజ్ భవనాల నిర్మాణానికి అనుమతులు లభించడంతో కొనుగోలుదారులు సైతం ఇటు వైపు ఆసక్తి చూపుతున్నారు. కోకాపేట్ చుట్టుపక్కల ప్రాంతాల తరువాత బుద్వేల్ హాట్‌కేక్‌గా మారింది. ప్రస్తుతం ఈ రెండు చోట్ల విక్రయాలు పూర్తి కావడంతో హెచ్ఎండీఏ తూర్పు వైపున దృష్టి సారించింది. గతంలో మేడిపల్లి, బోడుప్పల్, తొర్రూరు తదితర చోట్ల స్థలాలను విక్రయించారు. సొంత ఇళ్ల నిర్మాణానికి ఈ లే అవుట్లు అనుకూలంగా ఉండడంతో మధ్యగతరగతి వర్గాలు,ఎన్నారైలు ఎక్కువగా కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనూ మరోసారి తూర్పు వైపున కొనుగోలుదారులను ఆకట్టుకొనేందుకు ఈ భారీ లే అవుట్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రతాప సింగారం వద్ద 250 ఎకరాల్లో, బోగారంలోని 170 ఎకరాల్లోనూ సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేందుకు అనుగుణంగా బహుళ ప్రయోజనకరంగా ప్లాట్లను ఏర్పాటు చేయనున్నారు. కనిష్టంగా 250 గజాల నుంచి గరిష్టంగా వెయ్యి గజాల వరకు ప్లాట్లు ఉంటాయి. రైతుల నుంచి భూ సేకరణ ప్రక్రియ తాజాగా తుది దశకు వచ్చిన దృష్ట్యా దస రా నాటికి లే అవుట్లను అభివృద్ధి చేసి విక్రయానికి సిద్ధం చేయనున్నట్లు ఒక అధికారి వివరించారు. వెయ్యి ఎకరాల అభివృద్ధికి ప్రణాళికలు... ప్రతాపసింగారం, బోగారంలతో పాటు కుర్మల్‌గూడ, దండుమల్కాపురం, లేమూరు, ఇన్ముల్నెర్వ, కొర్రెములు, నాదర్గుల్ తదితర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న సుమారు వెయ్యి ఎకరాల భూములను గుర్తించారు. ఇప్పటికే ఇన్ముల్నెర్వలోని 96 ఎకరాలు, లేమూరులో మరో 83 ఎకరాల భూములలో రోడ్లు, తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టారు.మిగతా చోట్ల కుర్మల్‌గూడలో 92 ఎకరాలు, దండుమల్కాపురంలో మరో 355 ఎకరాల చొప్పున భూమి అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 924 ఎకరాలకు పైగా భూములను గుర్తించగా, ఈ భూముల సేకరణ పూర్తయ్యేనాటికి మరి కొంతమంది రైతులు ముందుకు వచ్చే వచ్చే అవకాశం ఉంది. దీంతో సుమారు వెయ్యి ఎకరాల వరకు సేకరించి అభివృద్ధి చేయనున్నారు. హెచ్ఎండీఏ వెంచర్లలో ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడు కావడం వల్లనే అటు కొనుగోలుదారులతో పాటు, ఇటు రైతులు కూడా హెచ్ఎండీఏ పట్ల ఆసక్తి చూపుతున్నారు. లే అవుట్ల అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ అన్ని ఖర్చులను భరించి అభివృద్ధి చేసి ఇవ్వడంతో రైతులు స్వచ్చందంగా ముందుకు రావడం గమనార్హం. -
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నవారైనా.. వారు కోరుకున్నచోట ప్లాట్ తీసుకోవచ్చు. గతంలో ఉద్యోగులు పనిచేస్తున్న ప్రాంతంలో ఉన్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల్లో మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుండేది. ఉద్యోగుల విజ్ఞప్తుల మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఈ నిబంధనలను సడలించి జీవో నంబరు 38 జారీచేసింది. ఈ కొత్త జీవో ద్వారా ప్లాట్‌ను రాష్ట్రంలో ఎక్కడైనా ఎంపిక చేసుకునే అవకాశం లభించింది. రాష్ట్రంలోని 22 నగరాలు, పట్టణాల్లో అన్ని అనుమతులు, ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసింది. వీటిని మార్కెట్ ధర కంటే తక్కువకే అందుబాటులో ఉంచింది. ప్రజలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అన్ని లేఅవుట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 ప్లాట్లు రిజర్వ్ చేయడంతోపాటు ధరలో 20 శాతం రిబేట్ సౌకర్యం కూడా కల్పించింది. కొత్త నిబంధనలతో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు మొత్తం 22 జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేఅవుట్స్ వివరాలను https:// migapdtcp. ap. gov. in/ వెబ్సైట్లో చూడవచ్చు. చదవండి: సముద్రంలో ‘పవన విద్యుత్’ -
గజం రూ.6 వేలు.. ఈ సారైనా అమ్ముడుపోయేనా..!
నల్లగొండ: రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్షిప్లో ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు అధికారులు మూడు విడత వేలం నిర్వహిస్తున్నారు. గతంలో గజం ధర రూ.7 వేలు ఉండగా.. ఈ సారి ధర రూ.6 వేలకు తగ్గించారు. ఇప్పటికే ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు. అయితే గత రెండు విడతల్లో ప్లాట్లు పెద్దగా అమ్ముడుపోకపోవడంతో.. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. తొలి విడతలో మెరుగు నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎదురుగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ఏర్పాటు చేసింది. ఇందులో కొన్ని ఇండ్లు నిర్మించింది. కొన్ని ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం వాటిని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తోంది. మార్చి 14 నుంచి 4 రోజులçపాటు మొదటి విడతలో 340 ప్లాట్లను వేలానికి పెట్టింది. అప్పట్లో ఓపెన్ ప్లాట్ ధర గజం రూ.10 వేలుగా నిర్ణయించడం, చుట్టుపక్కల వెంచర్లో రూ.5 వేలకు గజం దొరుకుతుండడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ‘రాజీవ్ స్వగృహ పాట్ల కొనుగోలుకు స్పందన కరువు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ధర తగ్గించాలని కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపారు. దీంతో గజం ధరను రూ.7 వేలకు కుదించారు. మొదటి విడతలో 165 ప్లాట్లు అమ్ముడుపోగా.. రూ.31.79 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అధికారులపై ఒత్తిడి.. జూన్‌లో 2వ విడత వేలం నిర్వహించారు. ప్లాట్లు అమ్మించేందుకు జిల్లా స్థాయి అధికారులపై రాష్ట్రస్థాయి అధికారుల ఒత్తిడి తెచ్చారు. దీంతో జిల్లాస్థాయిలో పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీలు, మిల్లర్లు, ఇతర ట్రాన్స్‌పోర్టుకు సంబంధించిన యజమానులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టులు చేసే వారితో అధికారులు సమావేశం నిర్వహించి ప్లాట్లు కొనాలని సూచించారు. ఒకొక్కరు 5, 6 ప్లాట్లను కొనుగోలు చేయాలని ఒత్తిడి కూడా తెచ్చారు. ఈలోపు కలెక్టర్ బదిలీ కావడంతో పెద్దగా స్పందన రాలేదు. కేవలం 20 వరకు ప్లాట్లు కొన్ని గృహాలను మాత్రమే అమ్మగలిగారు. తగ్గిన కనీస ధర శ్రీవల్లీ టౌన్‌షిప్‌కు ప్లాట్ల విక్రయానికి ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు మూడో విడత వేలం నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం ప్రీ బిడ్ సమావేశం కూడా నిర్వహించారు. ఓపెన్‌ప్లాట్లకు గజం రూ.6 వేలు, పాక్షికంగా నిర్మాణ గృహాల్లో.. నిర్మాణ దశను బట్టి రూ.6 వేల నుంచి రూ.10,500 వరకు ధర నిర్ణయించారు. వేలం పాల్గొన్నవారు రూ.10 వేల డీడీ చెల్లించి దరఖాస్తుతో ఒక్కరోజు ముందు కార్యాలయంలో సమర్పించి టోకెన్ తీసుకొని వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ధర తగ్గించిన నేపథ్యంలో ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు చర్చించుకుంటున్నారు. -
AP: మంగళగిరి టౌన్షిప్లో ప్లాట్లకు ఈ–వేలం.. వారికి 20 శాతం రాయితీ
సాక్షి, అమరావతి: మధ్య ఆదాయ వర్గాలకు అనువుగా మంగళగిరిలో అభివృద్ధి చేసిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లోని ప్లాట్లను ఈ–వేలం వేయనున్నట్టు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సులభ వాయిదాల్లో నగదు చెల్లించే సౌలభ్యం కల్పించినట్టు పేర్కొన్నారు. ఎంఐజీ లే అవుట్–2లో మొత్తం 267 ప్లాట్లు ఉన్నాయని, వీటిలో 200 చదరపు గజాల్లో 68, 240 చదరపు గజాల్లో 199 ఉన్నాయన్నారు. చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు లే–అవుట్‌లోని 10 శాతం ప్లాట్లు రిజర్వు చేయడంతో పాటు 20 శాతం రాయితీ కల్పించామని, విశ్రాంత ఉద్యోగులకు 5 శాతం ప్లాట్లను రిజర్వు చేసినట్టు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ప్లాట్ ధరలో 10 శాతం మొత్తం చెల్లించి ప్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. అందిన దరఖాస్తులకు ఈ–లాటరీ నిర్వహిస్తామని, అందులో ఎంపికైనవారు ప్లాట్ కేటాయించిన నెలలోపు ఒప్పందం చేసుకుని ధరలో 30 శాతం సొమ్ము చెల్లించాలన్నారు. అనంతరం 6 నెలల్లో మరో 30 శాతం మొత్తం, ఏడాదిలోపు మిగిలిన 30 శాతం మొత్తం ధర చెల్లించవచ్చన్నారు. ప్లాట్‌కు మొత్తం ధర చెల్లించిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు ప్రకటించారు. 40 శాతం మినహాయింపు ఎంఐజీలో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం నికర అమ్మకపు ధరలో 60 శాతం మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయని, మిగిలిన 40 శాతంపై రిజి స్ట్రేషన్ చార్జీలను మినహాయింపు ఇచ్చిందని వివేక్‌యాదవ్ తెలిపారు. ప్లాట్ పొందిన వారు ధర మొత్తం ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తున్నట్టు వివరించారు. అన్నిరకాల ప్రభుత్వ అనుమతులు ఉన్న ఈ ప్లాట్లకు సమీపంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్లాట్లు పొందాలనుకునే వారు పది శాతం ప్రారంభ ధర చెల్లించి నవంబర్ 19వ తేదీ లోగా https://migapdtcp.ap.gov.in లేదా https://crda.ap.gov.in వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 0866–2527124 నంబర్లో సంప్రదించాలని సూచించారు. చదవండి: ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి! -
సకల సౌకర్యాలతో లేఅవుట్లు.. తక్కువ ధరకే ఉద్యోగులు, మధ్యతరగతి వారికి ప్లాట్లు
సొంతిల్లు...ప్రతి ఒక్కరి కల. నిరుపేదలకు ప్రభుత్వమే ఉచితంగా ఇంటిస్థలం ఇస్తోంది. అర్హత ఆధారంగా ఇల్లు కూడా కట్టిస్తోంది. కానీ ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు ఆ అవకాశం లేదు. వీరంతా దాదాపు పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. సమీపంలో స్థలం కొందామంటే..ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పైగా అనుమతుల తిరకాసులెన్నో...ఇలాంటి వారికీ ప్రభుత్వం అండగా నిలిచింది. ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’ పేరుతో సకల సౌకర్యాలు, అన్ని అనుమతులతో కూడిన స్థలాన్ని అతితక్కువ ధరకే అందిస్తోంది. హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా): మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (ఎంఐజీ) పేరుతో లేఅవుట్ల రూపొందించి తక్కువ మొత్తానికే పట్టణ పరిధిలో ఇంటి స్థలాలను అందిస్తోంది. న్యాయపర సమస్యలు లేకుండా క్లియర్ టైటిల్‌తో లాభాపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటోంది. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్’ పేరిట పట్టణ సమీప ప్రాంతాల్లోనే వందల ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో లేఅవుట్లు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో రెండు ప్రాంతాల్లో.. జిల్లాలోని ధర్మవరం, హిందూపురం నియోజకవర్గాల్లో ఎంఐజీ లేఅవుట్లు సిద్ధం చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గం కుణుతూరులో ఇప్పటికే ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయ. మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరమయ్యాయి. సదుపాయాలు ఇలా.. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్లన్నీ ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా రిజిష్టర్ అయి ఉంటాయి. లేఅవుట్లో 60 అడుగుల బీటీ రోడ్డు, 40 అడుగుల సిమెంట్ కాంక్రీట్ రోడ్డు, ఫుట్‌పాత్‌లు, ఈఎల్‌ఎస్‌ఆర్‌లతో నీటి సరఫరా, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, భూగర్భ మురుగు కాల్వలు, వీధి దీపాలు ఉంటాయి. అలాగే వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలతో పాటు ఆహ్లాదం పంచేలా పార్కులు అభివృద్ధి చేస్తారు. ఇతర అన్ని రకాల సదుపాయలూ కల్పిస్తారు. అర్హతలు ఇలా.. ఎంఐజీ లేఅవుట్లలో ఒక కుటుంబానికి ఒక ప్లాటు మాత్రమే కేటాయిస్తారు. సంవత్సర ఆదాయం రూ. 18 లక్షల్లోపు ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఆధార్ కార్డు ద్వారా మాత్రమే దరఖాస్తు నమోదు సాధ్యమవుతుంది. ఆసక్తి కలిగిన వారు migapdtcp.ap.gov.in వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసి ప్లాటు కేటగిరీ మొత్తం విలువలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లేఅవుట్లలో విక్రయాల అనంతరం పారదర్శకంగా లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారులకు ప్లాటు నంబర్లు కేటాయిస్తారు. ఆ తర్వాత నిర్ణీత సమయంలో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్లాటు కేటాయింపు రద్దు చేసి, అర్హత కలిగిన ఇతరులకు కేటాయిస్తారు. అగ్రిమెంట్ చేసుకున్న తేదీ నుంచి దరఖాస్తుదారులు నెలలోపు ప్లాటు మొత్తంలో 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. వందశాతం చెల్లిస్తే 5 శాతం రాయితీ కూడా ఇస్తారు. ఉద్యోగులకు 20 శాతం రాయితీ.. ప్రభుత్వ ఉద్యోగులకు మరికొంత లబ్ధి చేకూరే విధంగా లేవుట్ మొత్తం ప్లాట్లలో పదిశాతం రిజర్వు చేశారు. అంతేకాకుండా లేఅవుట్ ఏర్పాటు చేసిన నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. ఇంటి స్థలం కావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఫాం–16 సమర్పించాల్సి ఉంటుంది. ► హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం కోడూరు గ్రామ సమీపంలో బెంగళూరు 44 జాతీయ రహదారి పక్కనే 774, 775 సర్వే నంబర్లలో 7 ఎకరాల్లో 98 ప్లాట్లతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ లేఅవుట్లో సెంటు రూ.3.63 లక్షలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ లేవుట్‌లో వివిధ అభివృద్ధి పనుల కోసం పబ్లిక్ హెల్త్ ఎస్ఈ టెండర్లు ఆహ్వానించారు. ► ధర్మవరం నియోజకవర్గంలో కుణుతూరు సర్వే నంబర్లు 498,499, 628 నుంచి 642 వరకు 120 ఎకరాల్లో 1,272 ప్లాట్లతో అతిపెద్ద జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఏర్పాటు చేశారు. 2021 నవంబర్ 21న రూ.106.00 కోట్లతో పనులు ప్రారంభించారు. ఈ లేఅవుట్లో సెంటు ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే ప్లాట్లు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని అనుమతులతో లేఅవుట్లు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్ల పథకం వల్ల మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కొంత రాయితీ కూడా ఉంటుంది. అన్ని మౌలిక వసతులతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా, వివాదాలు లేని లేఅవుట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 150/200/240 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు రూ. 3 లక్షల నుంచి రూ.18 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారందరూ అర్హులు. ఆసక్తి గల వారు సచివాలయం, లేదా మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సంప్రదించవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తుచేసుకోవచ్చు. – డాక్టర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, హిందూపురం అన్ని సదుపాయాలతో అభివృద్ధి ఎంఐజీ లేఅవుట్లలో అన్ని సదుపాయాలు కల్పించి ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుంది. నిజంగా ఇది మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు మంచి అవకాశం. కొడికొండ వద్ద, హైవే పక్కనే లేఅవుట్ సిద్ధం అవుతోంది. హిందూపురం ప్రాంత ప్రజలకు చక్కటి అవకాశం. త్వరలోనే మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభమవుతున్నాయి. ధర్మవరం కుణుతూరు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలోనే అది పూర్తవుతుంది. – ఈశ్వరయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అహుడా.అనంతపురం. -
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్
-
రోడ్డెందుకు సన్నబడింది!
ఇది ఓ లింకు రోడ్డు కథ. తలాతోక లేకుండా అర్ధంతరంగా నిలిచిపోయిన రహదారి కథ. అధికారుల అవినీతికి, తలతిక్క వ్యవహారాలకు పరాకాష్ట. నార్సింగ్ నుంచి అల్కాపురి టౌన్షిప్ మీదుగా పుప్పాలగూడ వరకు 3.5 కిలోమీటర్ల లింకు రోడ్డును మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. 100 ఫీట్ల వెడల్పుతో దీన్ని నిర్మించడానికి 2015లో హెచ్ఎండీఏ భూసేకరణ చేసింది. ఇదే హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలోని ఓ అవినీతి అనకొండ అన్నీ తెలిసి... రోడ్డు కోసం సేకరించిన భూమిలో ఏకంగా ఓ అపార్ట్మెంట్ కట్టడానికి 2017లో అనుమతులిచ్చేశాడు. నిర్మాణం జరిగిపోయింది. జనం నివాసముంటున్నారు కూడా. ఇవేవీ పట్టించుకోకుండానే గత ఏడాది ఆరు కోట్ల రూపాయలతో గుడ్డిగా రోడ్డు నిర్మాణం మొదలుపెట్టేశారు. 2.5 కిలోమీటర్లు రోడ్డు వేసేశాక... రహదారికి అడ్డంగా అపార్ట్మెంట్ కనపడటంతో నోరెళ్లబెట్టారు. పనులు నిలిపివేశారు. సరైన కనెక్టివిటీ లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఎప్పటికి తేలాలి ఇది? రహదారికి ఎవరైనా ఏదైనా అడ్డంగా పెడితే... ‘తేరా బాప్ కా జాగీర్ హై క్యా?‘అని నిలదీస్తాం. అలాంటిది ఏకంగా రోడ్డునే ఆక్రమించేసి బిల్డింగ్ కడితే? ఎవడబ్బ సొత్తనుకున్నట్లు? అపార్ట్మెంట్ కట్టినోడిదా? అనుమతులిచ్చినోడిదా? -వాంకే శ్రీనివాస్ / ఆలేటి రాజేందర్‌రెడ్డి కంచె చేను మేసింది. మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించిన అధికారులే దానికి తూట్లు పొడిచారు. అందినకాడికి దండుకొని ప్రతిపాదిత రోడ్డు స్థలంలోనే బహుళ అంతస్తుల భవనానికి అనుమతి ఇచ్చేశారు. ఈ భవనం సంగతి పట్టని యంత్రాంగం అద్భుతమైన రోడ్డేసేందుకు ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లో.. నార్సింగ్ నుంచి అల్కాపురి టౌన్షిప్ మీదుగా పుప్పాలగూడ వరకు 3.5 కిలోమీటర్ల లింకు రోడ్డును ఆరుకోట్ల రూపాయలతో గత ఏడాది చేపట్టింది. చకచకా రోడ్డు వేసుకొని వెళుతున్న క్రమంలో మధ్యలో భవనం ఉన్న సంగతి తెలిసి నిర్మాణ సంస్థ నోరెళ్లబెట్టింది. ఏం చేయాలో తెలియక రోడ్డు పనులు నిలిపివేసింది. అర కిలోమీటర్ మేర ఆగిపోయిన ఈ పనులతో రేడియల్ రోడ్డు 4 నుంచి 5కు ‘లింక్’కుదరలేదు. దీంతో స్థానికులు అర కిలోమీటరు దూరంలోని గమ్యాన్ని చేరడానికి 3 కి.మీ మేర ప్రయాణించాల్సి వస్తోంది. ఇదిలావుంటే.. ఇదే అలైన్మెంట్లో మరోవైపు ఆర్మీ స్థలం ఉండటంతో అటువైపు కూడా ఈ రోడ్డు పనులు నిలిచిపోయాయి. అర్ధంతరంగా నిలిచిపోయిన ఈ రోడ్డును పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించడం కొసమెరుపు. అసలేం జరిగింది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగర ప్రణాళికను తయారు చేసిన హెచ్ఎండీఏ... 2031 మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించింది. దీంట్లో భూ అవసరాలను పేర్కొంటూ జోన్లను పొందుపరిచింది. దీనికి అనుగుణంగా నివాస, పారిశ్రామిక, కన్జర్వేషన్ తదితర జోన్లను ప్రకటించింది. ఇవేగాకుండా భవిష్యత్తులో రద్దీని దృష్టిలో ఉంచుకొని రోడ్లను కూడా ప్రతిపాదించింది. ప్రతి భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతిలోనూ ఈ మాస్టర్‌ప్లాన్‌ను దిక్సూచిగా ప్రణాళిక విభాగం పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే ఈ మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో కీలకభూమిక పోషించిన అధికారే దాన్ని తుంగలో తొక్కాడు. అధికార యంత్రాంగం అవినీతి పుణ్యామాని ఆ మార్గంలో ఆకాశహార్మ్యం వెలిసింది. ఆ తర్వాత తాపీగా రోడ్డేసుకుంటూ వచ్చిన ఇంజనీరింగ్ విభాగం అక్కడ వెలిసిన బహుళ అంతస్తు భవనాన్ని చూసి నివ్వెరపోయింది. చేసేదిలేక పనులు పక్కనపెట్టేసింది. నార్సింగ్ నుంచి అల్కాపురి టౌన్షిప్ మీదుగా పుప్పాలగూడలోని రేడియల్ రోడ్డు నం.5 (షేక్‌పేట నుంచి కోకాపేట ఔటర్‌కు వెళ్లే దారి)ను కలిపేలా ఏడేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ లింకు రోడ్డు పనులను గతేడాది మొదలుపెట్టారు. పక్కా ప్రణాళికతో.. అల్కాపురి టౌన్షిప్లో 2017లో బహుళ అంతస్తుల భవనానికి హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చింది. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే క్రమంలో మాస్టర్‌ప్లాన్‌ను నిశితంగా పరిశీలించాల్సిన ప్లానింగ్ విభాగం.. ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో భారీగా ముట్టజెప్పడంతో మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదిత రహదారి మార్గంలోనే అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. అసలు విషయమేమింటే 2015లోనే ఇదే హెచ్ఎండీఏ రోడ్డు కోసం భూసేకరణ కూడా చేసింది. రూ. 22.66 కోట్లు పరిహారంగా చెల్లించింది. ఈ విషయాలను మరుగున పెట్టిన ప్లానింగ్ విభాగం.. అపార్ట్మెంటుకు అనుమతులిచ్చేసింది. దీంతో పుప్పాలగూడ ప్రాంతంలో నడిరోడ్డుపై బహుళ అంతస్తుల భవనం పుట్టుకొచ్చింది. ఈ అవినీతి బాగోతంలో గతంలో సస్పెండయిన ప్లానింగ్ విభాగాధిపతి కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. లింకు కుదరక.. దిక్కుతోచక ఏదేనీ రోడ్డు నిర్మాణం చేపట్టేటప్పుడు ఇంజనీరింగ్ అధికారులు సదరు రోడ్డు అలైన్‌మెంట్‌ను నిశితంగా పరిశీలించాల్సి వుంటుంది. క్షేత్రస్థాయిలో సర్వే చేయడం ద్వారా ఏయే ప్రాంతంలో ఎలా నిర్మించాలనే దానిపై స్పష్టత వస్తుంది. ఈ రోడ్డు విషయానికి వస్తే కనీసం రోడ్డు విస్తీర్ణమెంత? మార్గమధ్యంలో వంతెనలు ఏమైనా నిర్మించాలా? కట్టడాలేవైనా ఎదురొస్తున్నాయా? అనేది గమనించకుండానే గుడ్డిగా పనులు మొదలుపెట్టారు. అలైన్‌మెంట్‌ను చూడకుండా నిర్మాణవ్యయం కూడా ఎలా ప్రతిపాదించారనే దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు నడిబొడ్డున బహుళ అంతస్తుల భవనం అడ్డు వస్తుండగా... మరోవైపు రక్షణ స్థలం ఉండటంతో పనులు నిలిచిపోయాయి. అటు అర కి.మీ... ఇటు అర కి.మీ వదిలి పూర్తి చేసిన 2.5 కి.మీ రోడ్డు కూడా నిరుపయోగంగా మారింది. 100 ఫీట్ల ఈ లింకు రోడ్డుకు అడ్డంకులను ఎలా అధిగమిస్తారనే దానిపై హెచ్ఆర్డీసీఎల్ ఉన్నతాధికారి జియావుద్దీన్‌ను ఫోన్లో సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు. ఏ ప్రాంతవాసులకు ఉపయోగమంటే ఈ లింకు రోడ్డు పూర్తయితే మణికొండ, అల్కపూర్, పుప్పాలగూడ, నార్సింగి, సెక్రటరీ కాలనీ, నెక్నాంపూర్‌తో పాటు చుట్టూ ప్రక్కల ప్రాంతాల వారికి... ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు వెళ్లేందుకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగం కానుంది. ఈ రోడ్డు మైహోం అవతార్ దగ్గర ఉన్న ఓఆర్ఆర్ సర్వీసురోడ్డుకు కూడా అనుసంధానం అవుతుండటంతో వాహనచోదకుల సాఫీ ప్రయాణానికి వీలవుతుంది. హెచ్ఆర్డీసీఎల్ వారే లింక్ రోడ్డు వేస్తున్నారు హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) రేడియల్ రోడ్డు నంబర్ –4 (నార్సింగి) నుంచి రేడియల్ రోడ్డు నంబర్ 5(పుప్పలగూడ)ని అనుసంధానించే... 3.5 కిలోమీటర్ల 100 ఫీట్ల లింక్ రోడ్డును నిర్మిస్తోంది. మేం 2015లోనే రూ.22.66 కోట్లు పరిహారం చెల్లించి భారీ రహదారి కోసం భూమి సేకరించాం. అయితే గతేడాది ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం హెచ్ఆర్డీసీఎల్ వారే టెండర్లు పిలిచి కరోనా సమయంలో కాంట్రాక్టర్‌తో రోడ్డు నిర్మించారు.అయితే నార్సింగ్ వైపున 500 మీటర్ల మేర ఆర్మీ స్థలం ఉండటంతో వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే పరిష్కరిస్తాం. – బీఎల్ఎన్ రెడ్డి, హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగాధిపతి లింక్ రోడ్డు లేక నరకం రేడియల్ రోడ్ల మధ్య లింక్ రోడ్డు పనులు పూర్తి కాకపోవటంతో మణికొండ, నార్సింగి, నెక్నాంపూర్, పుప్పాలగూడ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఐటీ సంస్థలకు వెళ్లేందుకు ఇరుకు రోడ్ల వెంట ట్రాఫిక్‌లో దుమ్ము,ధూళితో ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. – శ్రీనివాస్, ఐటీ ఉద్యోగి, అల్కాపురి టౌన్షిప్ ఏమర్జెన్సీ వస్తే... అంతే సంగతులు! మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి టౌన్‌షిప్‌తో పాటు చుట్టు పక్కల ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఇక అంతే సంగతులు. రోడ్ల కనెక్టివిటీ సరిగా లేకపోవటం, ఉన్న రోడ్లు సైతం మిలట్రీ అధికారులు ఓ వైపు, భవన నిర్మాణంతో మరోవైపు మూసి వేయటంతో అంబులెన్స్ రావాలన్నా బాగా సమయం పడుతోంది. – అనురాగ్, అల్కాపురి టౌన్షిప్ -
సకల హంగుల పట్టణాలు!
సాక్షి, హైదరాబాద్ : ఆధునిక వసతులు.. సకల హంగులతో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని చుట్టు పక్కల 10 చోట్ల వీటిని అభివృద్ధి చేసే దిశగా పురపాలక శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామం ఈ కాలనీలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించింది. తాజాగా శాసనసభ ఆమోదించిన పురపాలక చట్టంలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీని ప్రకటించింది. విస్తృత మౌలిక సదుపాయాల కల్పనతో సమీకృత భవన సముదాయా లను అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్ చారిత్రక ఉనికిని కాపాడుకుంటూనే.. ఈ కొత్త టౌన్షిప్లకు డిజైన్ చేస్తోంది. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని భాగ్యనగరంపై జనాభా తాకిడిని తగ్గించుకునేందుకు ఇవి దోహదపడతాయని భావిస్తోంది. జన, వాహన విస్పోటనం... ప్రస్తుతం నగర జనాభా ప్రతి చదరపు కిలోమీటరుకు 11,000 ఉండగా.. త్వరలోనే ఇది రెట్టింపయ్యే అవకాశముందని అం చనా. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న సిటీ, వాహనాల రద్దీతో కాలుష్య నగరాల జాబితాలో చేరే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళనలు చెందుతోంది. దేశంలో అత్యధికంగా కాలుష్యం వెదజల్లే నగరాల్లో ఢిల్లీ, కాన్పూర్, వార ణాసి, చెన్నై, లక్నో, బెంగుళూరు ఉండగా, తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉంది. వీటి సరసన భాగ్యనగరం చేరకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. కాంక్రీట్ జంగిల్‌గా మార కుండా.. సిటీకి దూరంగా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి పరచాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలోనే కాలుష్యరహిత నగరంగా చేయడమే కాకుండా, పెట్టుబడులను ఆకర్షించేందుకు విస్తృతంగా మౌలిక సదు పాయాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా రోడ్లు, టౌన్‌షిప్‌లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రపంచ శ్రేణి నగరాల సరసన నిలపాలని భావిస్తోంది. సకల సౌకర్యాలు.. డెవలపర్లకు ప్రోత్సాహకాలు.. ప్రపంచ ఉత్తమ నగరాల్లో హైదరాబాద్‌కున్న ఇమేజ్ను కాపాడుకుంటూ రాజధానిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రీజినల్ రింగ్‌రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతానికి ఈ రోడ్డుపై ఒకింత స్తబ్ధత నెలకొన్నా.. టౌన్‌షిప్‌లపై మాత్రం ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు వెంట 10 చోట్ల ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లను వాక్ టు వర్క్ పద్ధతిలో నిర్మించేందుకు డిజైన్లను తయారు చేస్తోంది. దీంతోపాటు కరీంనగర్ సమీపంలో మరొకటి ఏర్పాటు చేయనున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో 100 ఎకరాలు, హెచ్ఎండీఏ పరిధి బయట 50 ఎకరాల్లో వీటిని నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ టౌన్ షిప్‌లలో రెసిడెన్షియల్, కమర్షియల్, ఆఫీస్, వినోద ఇతర్రతా అన్ని హంగులు ఉండేలా డిజైన్ చేయనుంది. ఈ ప్రాజెక్టులను నిర్మించడానికి ముందుకొచ్చే డెవలపర్లకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు వచ్చేది ఇక్కడే..(ప్రాథమిక అంచనా) 1). జాతీయ రహదారి 65, సదాశివపేట్ సమీపంలో 2). జాతీయ రహదారి 161, ఆందోల్ రోడ్డులో 3). రాష్ట్ర రహదారి 765(డి), మెదక్ రోడ్డు నర్సాపూర్ పరిసరాల్లో 4). జాతీయ రహదారి 44, తూప్రాన్ పరిసరాల్లో 5). రాష్ట్ర రహదారి 1, కరీంనగర్ రోడ్డు అహ్మదీపురం పరిసరాల్లో 6). జాతీయ రహదారి 163, యాదగిరిగుట్ట సమీపంలో 7). జాతీయ రహదారి 65, చౌటుప్పల్ దగ్గరలో 8). రాష్ట్ర రహదారి 9, నాగార్జునసాగర్ రోడ్డు నాగిళ్ల దగ్గర 9). రాష్ట్ర రహదారి 765, వెల్డండ సమీపంలో 10). జాతీయ రహదారి 44, బెంగళూరు బాలానగర్ పరిసరాల్లో 11). జాతీయ రహదారి 163, బీజాపూర్ హైవే, చెన్గొముల్ సమీపంలో -
పేదలకూ టౌన్షిప్
సాక్షి, తిరుపతి : ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి అభివృద్ధిపై వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. తిరుపతి నగరాన్ని విస్తరించడంతో పాటు మంచినీరు, ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలు లేకుండా పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పొట్టచేతబట్టుకుని వలస వచ్చిన వారందరికీ టౌన్‌షిప్‌లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సహకారంతో తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వీసీ గిరీషా రంగంలోకి దిగారు. అందులో భాగంగా తుడా కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. జేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐతో పాటు ఇతర పార్టీల నాయకులు హాజరయ్యారు. వారి నుంచి తిరుపతి, తుడా అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకున్నారు. త్వరలోనే ఎమ్మెల్యేలు, తుడా మాజీ చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా నగరంలో మంచినీటి సమ స్య పరిష్కారానికి శాశ్వత ప్రణాళికలు రూపొందించనున్నారు. కపిలతీర్థం నుంచి వృథాగా వెళ్లే నీటిని ఒడిసి పట్టాలని నిర్ణయించారు. భూ గర్భ జలాలు మెరుగుపరిచేందుకు ఆక్రమణలకు గురైన చెరువులను అభివృద్ధి చేయనున్నారు. తుడా పరిధిలో విస్తారంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. నగరంలో ట్రాఫిక్, డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. మరిన్ని ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శెట్టిపల్లి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు శెట్టిపల్లివాసులు కొన్నేళ్లుగా భూ సమస్య పరిష్కారం కోసం పోరాటాలు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అక్కడున్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అక్రమార్కులు కొందరు ఒకే ప్లాటును ముగ్గురు, నలుగురుకి అమ్మి సొమ్ము చేసుకున్నారు. దీంతో సమస్యలు తీవ్రమయ్యాయి. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని పోలీస్స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక తుడా ఆధ్వర్యంలో శెట్టిపల్లివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. దేశంలోనే అత్యాధునికి టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆరు నెలల్లో శెట్టిపల్లివాసుల సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్టీఓ కార్యాలయం నుంచి పద్మావతి ఫ్లోర్మిల్లుకు వెళ్లే మార్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చెయ్యనున్నారు. రైల్వేగేటు వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మించాలని, అది పూర్తయితేనే రింగ్‌రోడ్డు సంపూర్ణమవుతుందని తుడా చైర్మన్ వెల్లడించారు. అత్యాధునికమైన టౌన్‌షిప్‌లు సూరప్పకశం, కరకంబాడి వద్ద ఉన్న తుడా భూముల్లో టౌన్షిప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని వసతులతో ఈ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చెయ్యనున్నారు. బస్‌స్టేషన్, కళాశాల, పాఠశాలలు, సినిమా థియేటర్లు, పార్క్‌లు వంటి సకల సౌకర్యాలతో టౌన్‌షిప్‌లు నిర్మించనున్నారు. తిరుపతి–శ్రీకాళహస్తి, చంద్రగిరి–తిరుపతి మధ్యలో కూడా టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాజకీయ నాయకులు సూచించారు. అందుకు ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. తిరుపతికి వలస వచ్చిన వేలాది మంది నివాసాలు లేక అద్దె ఇళ్లల్లో ఉన్న విషయాన్ని తుడా చైర్మన్ ప్రస్తావించారు. అర్హులైన వారికి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నివాస స్థలాలు మంజూరు చేయడం లేదా ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి గృహ సముదాయాన్ని నిర్మించి ఇవ్వాలని భావిస్తున్నారు. రుయాలో మరో అత్యవసర విభాగం రుయాకు రాయలసీమ జిల్లాల నుంచి వేలాది మంది రోగులు, క్షతగాత్రులు వస్తుంటారు. రుయాలో ఒక్కటే అత్యవసర విభాగం ఉండటంతో ఆస్పత్రికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని రుయాలో మరో అత్యవసర విభాగాన్ని నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. అందుకు తుడా పూర్తి సహకారం అందిస్తుందని చైర్మన్ చెవిరెడ్డి తెలిపారు. పోలీస్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదుదారులు చెట్ల కింద వేచి ఉండేపని లేకుండా ప్రత్యేకంగా రిసెప్షన్ కేంద్రాలను నిర్మించనున్నారు. అక్కడ వారికి మంచినీరు, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. ఇలా తుడా పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అభివృద్ధి చేసేందుకు అందరి సహకారం, సూచనలు తీసుకునేందుకు తుడా ఆధ్వర్యం లో మూడు నెలలకోసారి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ నాయకుడు, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్, బీజేపీ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నవీన్‌కుమార్‌రెడ్డి, సీపీఎం, సీపీఐ నాయకులు కందారపు మురళి, వందవాసి నాగరాజ, రామానాయుడు, పెంచలయ్య పాల్గొన్నారు. -
మేమింతే..!
♦ భెల్ యాజమాన్యం వింత పోకడ ♦ కంగుతింటున్న టౌన్షిప్ వాసులు ♦ కాలనీ మధ్య డెబ్రీస్ డంప్ ♦ ఆందోళన చెందుతున్న జనం ♦ బీహెచ్ఈఎల్ యాజమాన్యం టౌన్షిప్ వాసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన యాజమాన్యం పట్టనట్టు వ్యవహరిస్తోంది. అంతటితో ఆగకుండా కాలనీ వాసులకు తలనొప్పులు సృష్టిస్తోంది. ఇదేమిటని అడిగితే.... ‘మేం ఇలాగే ఉంటాం... ఎక్కువ మాట్లాడితే మా తడాఖా చూపిస్తాం’ అంటూ బెదిరింపులకు దిగుతోంది. - భెల్ అధికారమో.. అహంకారమో తెలియదు కానీ భెల్ అధికారుల తీరుతో ఎంఐజీ కాలనీవాసులు సతమతమవుతున్నారు. భెల్ కాలనీలో సామాజిక సేవలో ముందున్నామంటూ పెద్ద పెద్ద బోర్డులతో జోరుగా ప్రచారం చేసుకునే బీహెచ్ఈఎల్ యాజమాన్యం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. దిగజారుడు వ్యవహారంతో ప్రజలకు తలనొప్పిగా మారింది. భెల్ పరిశ్రమ పరిధిలో వందలాది ఎకరాల ఖాళీ స్థలం ఉంది. గతంలో భెల్ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు పాత ఎంఐజీలో నివాసాలు కేటాయించారు. కాలనీ ప్రారంభంలో ఈ ఖాళీ స్థలాల్లో రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు భవన శిథిలాలు, చెత్తను డంప్ చేసేవారు. వీటిని తొలగించేందుకు కొన్ని నెలల క్రితం యాజమాన్యం లక్షలాది రూపాయలు వెచ్చించింది. అయితే ఇటీవలి కాలంలో యాజమాన్యం తీరులో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. భవనాల వ్యర్థాలను (డెబ్రీస్) వేయవద్దని చెప్పాల్సిన యాజమాన్యం.. దగ్గరుండి కాలనీ సమీపంలో వేయిస్తోంది. శిథిలాల మధ్య చెత్తకూడా ఉండటంతో దాని నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు నరకయాతన అనుభవస్తున్నారు. ఇదేమని అడిగితే ‘మా జాగా.. మా ఇష్టం’ అంటూ పరిశ్రమ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ‘మీ ప్రహరి వరకు మా స్థలమేనని.. అవసరమైతే రోడ్డు మూసి గోడ కడతాం’ అంటూ హెచ్చరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపకమిషనర్ విజయకుమార్‌కు కూడాపరిశ్రమ అధికారులు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ప్రజారోగ్యాలను కాపాడాల్సిన అధికారులు ఇలా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి తమ ఇళ్ల సమీపంలో డెబ్రీస్, చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
హైదరాబాద్‌లో జర్నలిస్టు టౌన్షిప్
వంద ఎకరాల్లో సకల సౌకర్యాలతో ప్రభుత్వ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం పేదల డబుల్ బెడ్రూం ఇళ్లకన్నా అదనంగా నిధులు హైదరాబాద్, వరంగల్ తరువాత అన్ని జిల్లా కేంద్రాల్లో టౌన్‌షిప్‌లు వచ్చే బడ్జెట్లో నిధుల కేటాయింపు జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ హామీ హౌసింగ్ సొసైటీల రద్దుకు జర్నలిస్టు సంఘాల అంగీకారం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జర్నలిస్టులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. వంద శాతం ప్రభుత్వ ఖర్చుతో ప్రతి జర్నలిస్టుకు సొంత ఇల్లు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సమాజహితం కోసం పనిచేసే ప్రతి జర్నలిస్టు కుటుంబానికి, పిల్లలకు ఇల్లు రూపంలో ఒక ఆస్తి మిగలాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు. బ్యూరో, డెస్క్, ఫొటో, వీడియో తదితర విభాగాలన్నింటికి సంబంధించిన జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. జర్నలిస్టులందరికీ ఒకేచోట ఇళ్లు నిర్మించడానికి దాదాపు వంద ఎకరాల స్థలం కేటాయిస్తామని, పేదల కోసం కట్టే డబుల్ బెడ్రూం ఇళ్లకిచ్చే దానికి అదనంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీలో రెసిడెన్షియల్ టవర్లు, క్లబ్‌హౌజ్, మార్కెట్, స్కూల్, ప్లేగ్రౌండ్, పార్కు, మల్టీప్లెక్స్ ఉండేలా అద్భుతమైన టౌన్షిప్ నిర్మిస్తామని వెల్లడించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమ ర్, క్రాంతికిరణ్, రవి, శైలేష్‌రెడ్డి తదితరులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు సీఎం సంసిద్ధత వ్యక్తం చేశారు. జర్నలిస్టు టౌన్షిప్ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు రఘునందన్, రోనాల్డ్ రాస్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డిని సీఎం ఆదేశించారు. అధికారులు, జర్నలిస్టు నాయకులు శని వారం నగరంలో పర్యటించి అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు. స్థలం ఎంపిక చేసుకున్న వెంటనే మంచి లే అవుట్ రూపొందించి మార్చిలోనే శంకుస్థాపన చేసి, ఏడాదిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనేది తన ఆలోచనగా సీఎం చెప్పారు. సీఎం స్వయంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పడంతో.. గతంలో ఏర్పాటైన హౌసింగ్ సొసైటీలను రద్దు చేసుకునేందుకు జర్నలిస్టు సంఘాల నాయకులు అంగీకరించారు. సొసైటీల ద్వారా జర్నలిస్టులు గతంలో ప్రభుత్వానికి డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో మొదటివిడత టౌన్‌షిప్‌లు నిర్మిస్తామని, దశల వారీగా అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల కోసం రెసిడెన్షియల్ టవర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వచ్చే బడ్జెట్లోనే జర్నలిస్టుల ఇళ్ల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. -
బడా టౌన్షిప్
ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు ఉడా ప్రతిపాదన అటవీ భూముల్లో భారీ హౌసింగ్ వెంచర్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేత ఉడా చరిత్రలో ఇదే భారీ ప్రాజెక్టు సాక్షి, విజయవాడ : విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వీజీటీఎం ఉడా) మరో భారీ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈసారి సుమారు 1,400 ఎకరాల్లో ఇంటిగ్రేటెట్ టౌన్షిప్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రూ.700 కోట్ల అంచనాతో ఈ మెగా హౌసింగ్ వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును తమకు అనుకూలంగా ఉన్న అటవీ భూమిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ఆ భూములను అటవీ శాఖ చట్టం 1980 సెక్షన్(2) కింద కన్వర్షన్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలు ఇవీ.. మొత్తం 1,400 ఎకరాల భూమిలో 700 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. 350 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం, మిగిలిన 350 ఎకరాల్లో పార్కు, బ్యాంకులు, పోలీసుస్టేషన్ తదితర అన్ని కార్యాలయాలకు అనువుగా భవనాలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు ఉడా సిద్ధం చేసిన ప్రతిపాదనల్లో ఇదే అత్యంత పెద్దది కావడం విశేషం. రాజధానితో లింకు..! ఉడా అధికారులు ప్రతి ప్రతిపాదనకు రాష్ట్ర రాజధానితో ముడిపెడుతున్నారు. ఇప్పటికే విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన క్రమంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. శాశ్వత రాజధాని కూడా ఇక్కడే ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కూడా ఉడా ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఉడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రాన్ని కూడా కోరుతున్నారు. ఏక కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఎక్కడి నుంచి నిధులు వచ్చినా తక్షణమే ప్రతిపాదనలను అచరణలోకి పెట్టాలని భావిస్తున్నారు. ల్యాండ్ బ్యాంక్ కొరత ఉడాకు మొదటి నుంచి ల్యాండ్ బ్యాంకు కొరత అధికంగా ఉంది. గతంలోనూ అనేక ప్రాజెక్టులు సిద్ధం చేయడంతోపాటు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా రూపొందించినా భూమి కొరత వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూములు కేటాయించాలని ఉడా విస్తరించి ఉన్న రెండు జిల్లాల కలెక్టర్లకు అధికారులు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. -
ఉడా మెగా హౌసింగ్ ప్రాజెక్టు!
అమరావతి టౌన్షిప్లో... 45 ఎకరాల విస్తీర్ణంలో గృహల నిర్మాణానికి కసరత్తు రాజధాని హడావిడి నేపథ్యంలో కసరత్తు మరో నెలలో మొదలుపెట్టే యోచన? సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా సుదీర్ఘకాలం తర్వాత మెగా హౌసింగ్ ప్రాజెక్టుకు తెరతీసింది. ఉడా పరిధిలో భూముల ధరలు భారీగా పెరగటంతో ఉడాకు భూసేకరణ సమస్యాత్మకంగా మారింది. ఈ క్రమంలో ఉడా వద్ద నిల్వ ఉన్న మిగులు భూమిపై దృష్టిసారించింది. దీంతో అమరావతి టౌన్షిప్లో ఉన్న మిగులు భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం జరుగుతుందన్న విసృత ప్రచారం నేపథ్యంలో హౌసింగ్ ప్రాజెక్టు మొదలుపడితే భారీగా డిమాండ్ వస్తుందని... తద్వారా ఉడాకు భారీగా ఆర్థికవనరులు సమకూరతాయని చైర్మన్ భావించారు. దీంతో ప్రాజెక్టును పట్టాలు ఎక్కించేందుకు కసరత్తు సాగిస్తున్నారు. అధికారులతో చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నెలరోజుల వ్యవధిలో టెండర్లు ఆహ్వనించి ఎడాదిన్నర కాలవ్యవధిలో ప్రాజెక్టు పూర్తిచేయించాలని భావిస్తున్నారు. ఉడా పరిధిలో ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నవులూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉడా 1988-1991 మధ్య 390.38 ఎకరాల భూసేకరణ చేసింది. తదనంతరం 390 ఎకరాల్లో 285.17 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్‌వేసి 1327 ప్లాటు వేశారు. సుధీర్ఘకాలంపాటు విక్రయించారు. ఈ క్రమంలో తొలుత కొంత నగదు చెల్లించి నిర్ణీత కాలంలో రిజిష్టర్ చేయించుకుని పలుప్లాట్లను రద్దు చేశారు. 390 ఎకరాల భూమిలో ఖాళీ ఉన్న 105 ఎకరాల భూమిలో 24 ఎకరాలు ఇంటర్నేషనల్ కిక్రెట్ స్టేడియానికి, మరో 22.72 ఎకరాలు అరిహంత్ఇండోఅఫ్రికన్ ఇన్ఫ్రా డెవలపర్స్‌కు కేటాయించారు. దానిలో సదరు సంస్థ సింగ్‌పూర్ టౌన్షిప్ నిర్మించాలని కసరత్తు చేసింది. అలాగే 40 ఎకరాలను ఐటీ సెజ్‌గా గుర్తించి ఐటీసంస్థలకు కేటాయించడం కోసం ఉంచారు. దీంతో ఐటీ సంస్థలు రాకపోవటంతో సెజ్‌ను రద్దుచేసి కేటాయించిన భూమిని ఉడా తిరిగి వెనక్కి తీసుకుంది. దీంతో ఉడాకు ఆ భూమి నిల్వ భూమిగా ఉంది. మరోవైపు కేటాయింపులు జరిపిన భూముల్లో క్రికెట్స్టేడియం పనులు వేగంగా సాగుతున్నాయి. అలాగే సింగపూర్ టౌన్‌సిప్ 2007లో పనులు మొదలుకావల్సి ఉన్నప్పటికీ అన్ని అనుమతులు లేకపోవటంతో వాయిదా పడింది. ప్రస్తుతం అన్ని అనుమతులు పొందింది. కేటాయింపులు పోను, పార్కులు, ఇతర సౌకర్యాలకు కేటాయించినది పోనూ సుమారు 45 ఎకరాలు భూమి ఉడాకు మిగిలింది. వాస్తవానికి వీజీటీఎం ఉడా రెండేళ్ల కిత్రమే హౌసింగ్ ప్రాజెక్టు మొదలుపెట్టాలని భావించింది. అయితే ఉడాకు ల్యాండ్ బ్యాంకు లేకపోవడంతో ప్రాజెక్టు సాధ్యపడలేదు. దీంతో అప్పట్లో ఉడా వైస్చైర్మన్లు గుంటూరు, కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ భూములు కొన్నింటిని ఉడాకు కేటాయించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు.అయినప్పటికీ స్పందన లేకపోవటంతో పూర్తిగా హౌసింగ్ ప్రాజెక్టును వదిలేశారు.అయితే ప్రసుత్తం ఉడాలో 385 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 1000 చదరపు గజాలు మొదలుకుని 200 గజాల వరకు ఉన్న పాట్లున్నాయి. వీటిల్లో 1000 గజాల ప్లాట్లు 107, 200 గజాల ప్లాట్లు 106 అధికంగా ఉన్నాయి. వెంచర్లో ప్లాట్లు కావడంతో వాటిని విక్రయించే పనిలో ఉడా అధికారులు నిమగ్నమైయ్యారు. 45 ఎకరాల్లో... 45 ఎకరాల్లో మెగా హౌసింగ్ వెంచర్ నిర్మించాలని సన్నాహలు చేస్తున్నారు. వీటిలో ఇండిపెండెంట్ హౌస్‌లతోపాటు, అపార్ట్మెంట్లు, పార్కులు, ఇండోర్ స్టేడియం, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. 250 చదరపు గజాల విస్తీర్ణంలో ఇండిపెండెంట్ హౌస్ నిర్మాణం, అపార్ట్మెంట్లో సుమారు రెండువేల ప్లాట్ల నిర్మాణం చేసి మధ్యతరగతివర్గాలకు కేటాయింపు జరిపేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో జరగనున్న ఉడా పాలకవర్గ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.