హైదరాబాద్: హైదరాబాద్ మహానగరానికి తూర్పు వైపున మరో భారీ లే అవుట్‌కు హెచ్‌ఎండీఏ కసరత్తు చేపట్టింది. అన్ని వైపులా నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఇటీవల కోకాపేట్, మోకిలా, బుద్వేల్, తదితర ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ సొంత స్థలాల్లో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. గతంలో ఉప్పల్ భగాయత్‌లోనూ కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో పోటీపడ్డారు. ఇక్కడ మూడు దఫాలుగా బిడ్డింగ్ నిర్వహించి ప్లాట్‌లను విక్రయించారు. తాజాగా ఉప్పల్ భగాయత్ తరహాలోనే ప్రతాప సింగారంలో భారీ లే అవుట్‌ను వేసేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది.
ఇందుకోసం రైతుల నుంచి భూసేకరణ చేపట్టింది. ఇప్పటి వరకు సుమారు 250 ఎకరాల భూములను సేకరించినట్లు అధికారులు తెలిపారు. రైతులకు, హెచ్‌ఎండీఏకు మధ్య ఒప్పందం కుదిరితే త్వరలోనే ఇక్కడ లే అవుట్ ఏర్పాటు చేయనున్నారు. రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేసి వెంచర్ చేసిన తరువాత రైతులకు 60 శాతం చొప్పున తిరిగి ఇస్తారు. 40 శాతం భూములను హెచ్‌ఎండీఏ తీసుకుంటుంది.
ఈ లెక్కన ప్రతాపసింగారంలో 250 ఎకరాలను ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. అలాగే కీసర సమీపంలోని బోగారంలోనూ మరో 170 ఎకరాల వరకు లే అవుట్‌కు సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. రైతులతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే రెండు చోట్ల ప్లాట్‌లను అమ్మకానికి సిద్ధం చేయనున్నట్లు ఒక అధికారి వివరించారు.
తూర్పు వైపు విస్తరణపై దృష్టి...
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నగరానికి అన్ని వైపులా సొంత భూములతోపాటు రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేసి విక్రయిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో పడమటి వైపున రియల్టర్లు, బిల్డర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఐటీ సంస్థలు, పలు అంతర్జాతీయ సంస్థలు సైతంపడమటి వైపే విస్తరించుకొని ఉండడం, హైరైజ్ భవనాల నిర్మాణానికి అనుమతులు లభించడంతో కొనుగోలుదారులు సైతం ఇటు వైపు ఆసక్తి చూపుతున్నారు. కోకాపేట్ చుట్టుపక్కల ప్రాంతాల తరువాత బుద్వేల్ హాట్‌కేక్‌గా మారింది.
ప్రస్తుతం ఈ రెండు చోట్ల విక్రయాలు పూర్తి కావడంతో హెచ్‌ఎండీఏ తూర్పు వైపున దృష్టి సారించింది. గతంలో మేడిపల్లి, బోడుప్పల్, తొర్రూరు తదితర చోట్ల స్థలాలను విక్రయించారు. సొంత ఇళ్ల నిర్మాణానికి ఈ లే అవుట్‌లు అనుకూలంగా ఉండడంతో మధ్యగతరగతి వర్గాలు,ఎన్నారైలు ఎక్కువగా కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనూ మరోసారి తూర్పు వైపున కొనుగోలుదారులను ఆకట్టుకొనేందుకు ఈ భారీ లే అవుట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు.
ప్రతాప సింగారం వద్ద 250 ఎకరాల్లో, బోగారంలోని 170 ఎకరాల్లోనూ సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేందుకు అనుగుణంగా బహుళ ప్రయోజనకరంగా ప్లాట్‌లను ఏర్పాటు చేయనున్నారు. కనిష్టంగా 250 గజాల నుంచి గరిష్టంగా వెయ్యి గజాల వరకు ప్లాట్లు ఉంటాయి. రైతుల నుంచి భూ సేకరణ ప్రక్రియ తాజాగా తుది దశకు వచ్చిన దృష్ట్యా దస రా నాటికి లే అవుట్‌లను అభివృద్ధి చేసి విక్రయానికి సిద్ధం చేయనున్నట్లు ఒక అధికారి వివరించారు.
వెయ్యి ఎకరాల అభివృద్ధికి ప్రణాళికలు...
ప్రతాపసింగారం, బోగారంలతో పాటు కుర్మల్‌గూడ, దండుమల్కాపురం, లేమూరు, ఇన్ముల్‌నెర్వ, కొర్రెములు, నాదర్‌గుల్ తదితర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న సుమారు వెయ్యి ఎకరాల భూములను గుర్తించారు. ఇప్పటికే ఇన్ముల్‌నెర్వలోని 96 ఎకరాలు, లేమూరులో మరో 83 ఎకరాల భూములలో రోడ్లు, తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టారు.మిగతా చోట్ల కుర్మల్‌గూడలో 92 ఎకరాలు, దండుమల్కాపురంలో మరో 355 ఎకరాల చొప్పున భూమి అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 924 ఎకరాలకు పైగా భూములను గుర్తించగా, ఈ భూముల సేకరణ పూర్తయ్యేనాటికి మరి కొంతమంది రైతులు ముందుకు వచ్చే వచ్చే అవకాశం ఉంది.
దీంతో సుమారు వెయ్యి ఎకరాల వరకు సేకరించి అభివృద్ధి చేయనున్నారు. హెచ్‌ఎండీఏ వెంచర్‌లలో ప్లాట్‌లు హాట్‌కేకుల్లా అమ్ముడు కావడం వల్లనే అటు కొనుగోలుదారులతో పాటు, ఇటు రైతులు కూడా హెచ్‌ఎండీఏ పట్ల ఆసక్తి చూపుతున్నారు. లే అవుట్‌ల అభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏ అన్ని ఖర్చులను భరించి అభివృద్ధి చేసి ఇవ్వడంతో రైతులు స్వచ్చందంగా ముందుకు రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment