సాక్షి, అమరావతి: మధ్య ఆదాయ వర్గాలకు అనువుగా మంగళగిరిలో అభివృద్ధి చేసిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లోని ప్లాట్లను ఈ–వేలం వేయనున్నట్టు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సులభ వాయిదాల్లో నగదు చెల్లించే సౌలభ్యం కల్పించినట్టు పేర్కొన్నారు. ఎంఐజీ లే అవుట్–2లో మొత్తం 267 ప్లాట్లు ఉన్నాయని, వీటిలో 200 చదరపు గజాల్లో 68, 240 చదరపు గజాల్లో 199 ఉన్నాయన్నారు. చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు లే–అవుట్‌లోని 10 శాతం ప్లాట్లు రిజర్వు చేయడంతో పాటు 20 శాతం రాయితీ కల్పించామని, విశ్రాంత ఉద్యోగులకు 5 శాతం ప్లాట్లను రిజర్వు చేసినట్టు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ప్లాట్ ధరలో 10 శాతం మొత్తం చెల్లించి ప్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. అందిన దరఖాస్తులకు ఈ–లాటరీ నిర్వహిస్తామని, అందులో ఎంపికైనవారు ప్లాట్ కేటాయించిన నెలలోపు ఒప్పందం చేసుకుని ధరలో 30 శాతం సొమ్ము చెల్లించాలన్నారు. అనంతరం 6 నెలల్లో మరో 30 శాతం మొత్తం, ఏడాదిలోపు మిగిలిన 30 శాతం మొత్తం ధర చెల్లించవచ్చన్నారు. ప్లాట్‌కు మొత్తం ధర చెల్లించిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు ప్రకటించారు.
40 శాతం మినహాయింపు
ఎంఐజీలో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం నికర అమ్మకపు ధరలో 60 శాతం మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయని, మిగిలిన 40 శాతంపై రిజి స్ట్రేషన్ చార్జీలను మినహాయింపు ఇచ్చిందని వివేక్‌యాదవ్ తెలిపారు. ప్లాట్ పొందిన వారు ధర మొత్తం ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తున్నట్టు వివరించారు. అన్నిరకాల ప్రభుత్వ అనుమతులు ఉన్న ఈ ప్లాట్లకు సమీపంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్లాట్లు పొందాలనుకునే వారు పది శాతం ప్రారంభ ధర చెల్లించి నవంబర్ 19వ తేదీ లోగా https://migapdtcp.ap.gov.in లేదా https://crda.ap.gov.in వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 0866–2527124 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
చదవండి: ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి!
Comments
Please login to add a commentAdd a comment