
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నవారైనా.. వారు కోరుకున్నచోట ప్లాట్ తీసుకోవచ్చు. గతంలో ఉద్యోగులు పనిచేస్తున్న ప్రాంతంలో ఉన్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల్లో మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుండేది. ఉద్యోగుల విజ్ఞప్తుల మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఈ నిబంధనలను సడలించి జీవో నంబరు 38 జారీచేసింది.
ఈ కొత్త జీవో ద్వారా ప్లాట్‌ను రాష్ట్రంలో ఎక్కడైనా ఎంపిక చేసుకునే అవకాశం లభించింది. రాష్ట్రంలోని 22 నగరాలు, పట్టణాల్లో అన్ని అనుమతులు, ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసింది. వీటిని మార్కెట్ ధర కంటే తక్కువకే అందుబాటులో ఉంచింది. ప్రజలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
అన్ని లేఅవుట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 ప్లాట్లు రిజర్వ్ చేయడంతోపాటు ధరలో 20 శాతం రిబేట్ సౌకర్యం కూడా కల్పించింది. కొత్త నిబంధనలతో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు మొత్తం 22 జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేఅవుట్స్ వివరాలను https:// migapdtcp. ap. gov. in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
చదవండి: సముద్రంలో ‘పవన విద్యుత్’
Comments
Please login to add a commentAdd a comment