
సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద అమరావతి ప్రాంతంలో 48,218 మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. మే నెల మొదటి వారం నాటికి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఇళ్లులేని పేదల చిరకాల వాంఛ నెరవేర్చే ఈ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ జీవో జారీ చేసిన నేపథ్యంలో సీఎం జగన్ అధ్యక్షతన సోమవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఆర్‌డీఏ 33వ సమావేశంలో ఈమేరకు ఆమోద ముద్ర వేశారు.
20 లేఅవుట్లు..
అమరావతి ప్రాంతంలో మొత్తం 20 లేఅవుట్లలో 1,134.58 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మంది పేదలు ఉచితంగా ఇళ్ల పట్టాలు పొందనున్నారు. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 41(3), (4) ప్రకారం ఆర్–5 జోన్ ఏర్పాటు చేసి భూములను ఆ పరిధిలోకి తెచ్చింది. గత ఏడాది అక్టోబరులో అభ్యంతరాలు, సలహాలను స్వీకరించి సీఆర్డీఏ బహిరంగ విచారణ నిర్వహించింది. అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి పేదలకు ఇళ్ల పట్టాలు అందించేలా ప్రభుత్వం సన్నద్ధమైంది. సీఎం సమీక్షలో పురపాలక శాఖ మంత్రి సురేష్, సీఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment