AP CM YS Jagan Launches Jagananna Smart Township Website Today, Check Details - Sakshi
Sakshi News home page

ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేదే మా సంకల్పం: సీఎం జగన్‌

Published Tue, Jan 11 2022 11:35 AM | Last Updated on Tue, Jan 11 2022 1:59 PM

CM Jagan Launches Jagananna Smart Town Website In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు(ఎంఐజీ)’లకు ప్రభత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు.

మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తొలిదశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి,  కందుకూరు, కావలి, ఏలూరులో ప్లాట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటు సిద్ధం కానున్నాయని సీఎం తెలిపారు. తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లు సిద్ధం చేశారు.

అన్ని అనుమతులు, వసతులతో డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లను సిద్ధం చేశారు. రూ.18 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని సీఎం జగన్‌ తెలిపారు. https://migapdtcp.ap.gov.in/  వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అన్ని చోట్లా పట్టణ ప్రణాళికా విభాగం నియమాల మేరకు లేఅవుట్లు సిద్ధం చేశామని సీఎం అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, ధరలో 20 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు.

వెబ్‌సైట్‌ ద్వారా నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని సీఎం జగన్‌ తెలిపారు. అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ప్లాట్ల ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఉంటాయని సీఎం చెప్పారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులకు స్థలాల కేటాయింపు ఉంటుందని సీఎం జగన్‌ చెప్పారు. 

తక్కువ ధరకే అన్ని వసతులతో ప్లాట్లు..
మొదటి విడతలో 3,894 ప్లాట్లను అన్ని వసతులతో సిద్ధం చేశారు. మార్కెట్‌ ధరకంటే ఈ ప్లాట్ల ధరలు తక్కువగానే నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. వీటికి మంగళవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మొత్తం ప్లాట్లు, చదరపు గజం ధర ఇలా..

లే అవుట్ల ప్రత్యేకతలు..
న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్‌ డీడ్‌తో ప్రభుత్వమే వేస్తున్న ఈ లే అవుట్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తి పర్యావరణ హితంగా మొత్తం లే అవుట్‌లో 50 శాతం స్థలాన్ని మౌలిక వసతులు, సామాజిక అవసరాలకు కేటాయించారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్‌ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్, తాగునీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ వ్యవస్థ, వరద నీటి డ్రెయిన్లు, పూర్తి విద్యుదీకరణ, వీధి దీపాలు వంటి వసతులు కల్పిస్తున్నారు.

పార్కులు, ఆట స్థలాలు, సామాజిక భవనాలు, ఆరోగ్య కేంద్రం, వాణిజ్య సముదాయం, బ్యాంకుతో పాటు ఇతర సామాజిక అవసరాల మేరకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తున్నారు. లేఅవుట్‌ నిర్వహణకు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్, పట్టణాభివృద్ధి సంస్థల సంయుక్త నిర్వహణలో అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసే ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ఎలాంటి వసతులు, అవసరాల కోసమైనా ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ నిధులు వెచ్చించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement