మేమింతే..!
♦ భెల్ యాజమాన్యం వింత పోకడ
♦ కంగుతింటున్న టౌన్‌షిప్ వాసులు
♦ కాలనీ మధ్య డెబ్రీస్ డంప్
♦ ఆందోళన చెందుతున్న జనం
♦ బీహెచ్‌ఈఎల్ యాజమాన్యం
టౌన్‌షిప్ వాసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన యాజమాన్యం పట్టనట్టు వ్యవహరిస్తోంది. అంతటితో ఆగకుండా కాలనీ వాసులకు తలనొప్పులు సృష్టిస్తోంది. ఇదేమిటని అడిగితే.... ‘మేం ఇలాగే ఉంటాం... ఎక్కువ మాట్లాడితే మా తడాఖా చూపిస్తాం’ అంటూ బెదిరింపులకు దిగుతోంది. - భెల్
అధికారమో.. అహంకారమో తెలియదు కానీ భెల్ అధికారుల తీరుతో ఎంఐజీ కాలనీవాసులు సతమతమవుతున్నారు. భెల్ కాలనీలో సామాజిక సేవలో ముందున్నామంటూ పెద్ద పెద్ద బోర్డులతో జోరుగా ప్రచారం చేసుకునే బీహెచ్‌ఈఎల్ యాజమాన్యం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. దిగజారుడు వ్యవహారంతో ప్రజలకు తలనొప్పిగా మారింది. భెల్ పరిశ్రమ పరిధిలో వందలాది ఎకరాల ఖాళీ స్థలం ఉంది. గతంలో భెల్ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు పాత ఎంఐజీలో నివాసాలు కేటాయించారు. కాలనీ ప్రారంభంలో ఈ ఖాళీ స్థలాల్లో
రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు భవన శిథిలాలు, చెత్తను డంప్ చేసేవారు. వీటిని తొలగించేందుకు కొన్ని నెలల క్రితం యాజమాన్యం లక్షలాది రూపాయలు వెచ్చించింది. అయితే ఇటీవలి కాలంలో యాజమాన్యం తీరులో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. భవనాల వ్యర్థాలను (డెబ్రీస్) వేయవద్దని చెప్పాల్సిన యాజమాన్యం.. దగ్గరుండి కాలనీ సమీపంలో వేయిస్తోంది.
శిథిలాల మధ్య చెత్తకూడా ఉండటంతో దాని నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు నరకయాతన అనుభవస్తున్నారు. ఇదేమని అడిగితే ‘మా జాగా.. మా ఇష్టం’ అంటూ పరిశ్రమ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ‘మీ ప్రహరి వరకు మా స్థలమేనని.. అవసరమైతే రోడ్డు మూసి గోడ కడతాం’ అంటూ హెచ్చరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపకమిషనర్ విజయకుమార్‌కు కూడాపరిశ్రమ అధికారులు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ప్రజారోగ్యాలను కాపాడాల్సిన అధికారులు ఇలా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి తమ ఇళ్ల సమీపంలో డెబ్రీస్, చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.