రోడ్డెందుకు సన్నబడింది! | Hyderabad: Apartments‌ Construction Up To 100 Feet Road Middle | Sakshi
Sakshi News home page

రోడ్డెందుకు సన్నబడింది!

Published Thu, Mar 25 2021 1:45 AM | Last Updated on Fri, Mar 26 2021 3:07 AM

Hyderabad: Apartments‌ Construction Up To 100 Feet Road Middle - Sakshi

ఇది ఓ లింకు రోడ్డు కథ. తలాతోక లేకుండా అర్ధంతరంగా నిలిచిపోయిన రహదారి కథ. అధికారుల అవినీతికి, తలతిక్క వ్యవహారాలకు పరాకాష్ట. నార్సింగ్‌ నుంచి అల్కాపురి టౌన్‌షిప్‌ మీదుగా పుప్పాలగూడ వరకు 3.5 కిలోమీటర్ల లింకు రోడ్డును మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించారు. 100 ఫీట్ల వెడల్పుతో దీన్ని నిర్మించడానికి 2015లో హెచ్‌ఎండీఏ భూసేకరణ చేసింది. ఇదే హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగంలోని ఓ అవినీతి అనకొండ అన్నీ తెలిసి... రోడ్డు కోసం సేకరించిన భూమిలో ఏకంగా ఓ అపార్ట్‌మెంట్‌ కట్టడానికి 2017లో అనుమతులిచ్చేశాడు. నిర్మాణం జరిగిపోయింది. జనం నివాసముంటున్నారు కూడా. ఇవేవీ పట్టించుకోకుండానే గత ఏడాది ఆరు కోట్ల రూపాయలతో గుడ్డిగా రోడ్డు నిర్మాణం మొదలుపెట్టేశారు. 2.5 కిలోమీటర్లు రోడ్డు వేసేశాక... రహదారికి అడ్డంగా అపార్ట్‌మెంట్‌ కనపడటంతో నోరెళ్లబెట్టారు. పనులు నిలిపివేశారు. సరైన కనెక్టివిటీ లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఎప్పటికి తేలాలి ఇది? రహదారికి ఎవరైనా ఏదైనా అడ్డంగా పెడితే... ‘తేరా బాప్‌ కా జాగీర్‌ హై క్యా?‘అని నిలదీస్తాం. అలాంటిది ఏకంగా రోడ్డునే ఆక్రమించేసి బిల్డింగ్‌ కడితే? ఎవడబ్బ సొత్తనుకున్నట్లు? అపార్ట్‌మెంట్‌ కట్టినోడిదా? అనుమతులిచ్చినోడిదా?  -వాంకే శ్రీనివాస్‌ / ఆలేటి రాజేందర్‌రెడ్డి    

కంచె చేను మేసింది. మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించిన అధికారులే దానికి తూట్లు పొడిచారు. అందినకాడికి దండుకొని ప్రతిపాదిత రోడ్డు స్థలంలోనే బహుళ అంతస్తుల భవనానికి అనుమతి ఇచ్చేశారు. ఈ భవనం సంగతి పట్టని యంత్రాంగం అద్భుతమైన రోడ్డేసేందుకు ప్లాన్‌ చేసింది. హైదరాబాద్‌లో.. నార్సింగ్‌ నుంచి అల్కాపురి టౌన్‌షిప్‌ మీదుగా పుప్పాలగూడ వరకు 3.5 కిలోమీటర్ల లింకు రోడ్డును ఆరుకోట్ల రూపాయలతో గత ఏడాది చేపట్టింది. చకచకా రోడ్డు వేసుకొని వెళుతున్న క్రమంలో మధ్యలో భవనం ఉన్న సంగతి తెలిసి నిర్మాణ సంస్థ నోరెళ్లబెట్టింది.  

ఏం చేయాలో తెలియక రోడ్డు పనులు నిలిపివేసింది. అర కిలోమీటర్‌ మేర ఆగిపోయిన ఈ పనులతో రేడియల్‌ రోడ్డు 4 నుంచి 5కు ‘లింక్‌’కుదరలేదు. దీంతో స్థానికులు అర కిలోమీటరు దూరంలోని గమ్యాన్ని చేరడానికి 3 కి.మీ మేర ప్రయాణించాల్సి వస్తోంది. ఇదిలావుంటే.. ఇదే అలైన్‌మెంట్‌లో మరోవైపు ఆర్మీ స్థలం ఉండటంతో అటువైపు కూడా ఈ రోడ్డు పనులు నిలిచిపోయాయి. అర్ధంతరంగా నిలిచిపోయిన ఈ రోడ్డును పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించడం కొసమెరుపు. 

అసలేం జరిగింది
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగర ప్రణాళికను తయారు చేసిన హెచ్‌ఎండీఏ... 2031 మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించింది. దీంట్లో భూ అవసరాలను పేర్కొంటూ జోన్లను పొందుపరిచింది. దీనికి అనుగుణంగా నివాస, పారిశ్రామిక, కన్జర్వేషన్‌ తదితర జోన్లను ప్రకటించింది. ఇవేగాకుండా భవిష్యత్తులో రద్దీని దృష్టిలో ఉంచుకొని రోడ్లను కూడా ప్రతిపాదించింది. ప్రతి భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతిలోనూ ఈ మాస్టర్‌ప్లాన్‌ను దిక్సూచిగా ప్రణాళిక విభాగం పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే ఈ మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనలో కీలకభూమిక పోషించిన అధికారే దాన్ని తుంగలో తొక్కాడు.

అధికార యంత్రాంగం అవినీతి పుణ్యామాని ఆ మార్గంలో ఆకాశహార్మ్యం వెలిసింది. ఆ తర్వాత తాపీగా రోడ్డేసుకుంటూ వచ్చిన ఇంజనీరింగ్‌ విభాగం అక్కడ వెలిసిన బహుళ అంతస్తు భవనాన్ని చూసి నివ్వెరపోయింది. చేసేదిలేక పనులు పక్కనపెట్టేసింది. నార్సింగ్‌ నుంచి అల్కాపురి టౌన్‌షిప్‌ మీదుగా పుప్పాలగూడలోని రేడియల్‌ రోడ్డు నం.5 (షేక్‌పేట నుంచి కోకాపేట ఔటర్‌కు వెళ్లే దారి)ను కలిపేలా ఏడేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ లింకు రోడ్డు పనులను గతేడాది మొదలుపెట్టారు. 

పక్కా ప్రణాళికతో..
అల్కాపురి టౌన్‌షిప్‌లో 2017లో బహుళ అంతస్తుల భవనానికి హెచ్‌ఎండీఏ అనుమతి ఇచ్చింది. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే క్రమంలో మాస్టర్‌ప్లాన్‌ను నిశితంగా పరిశీలించాల్సిన ప్లానింగ్‌ విభాగం.. ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో భారీగా ముట్టజెప్పడంతో మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదిత రహదారి మార్గంలోనే అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. అసలు విషయమేమింటే 2015లోనే ఇదే హెచ్‌ఎండీఏ రోడ్డు కోసం భూసేకరణ కూడా చేసింది.

రూ. 22.66 కోట్లు పరిహారంగా చెల్లించింది. ఈ విషయాలను మరుగున పెట్టిన ప్లానింగ్‌ విభాగం.. అపార్ట్‌మెంటుకు అనుమతులిచ్చేసింది. దీంతో పుప్పాలగూడ ప్రాంతంలో నడిరోడ్డుపై బహుళ అంతస్తుల భవనం పుట్టుకొచ్చింది. ఈ అవినీతి బాగోతంలో గతంలో సస్పెండయిన ప్లానింగ్‌ విభాగాధిపతి కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. 

లింకు కుదరక.. దిక్కుతోచక
ఏదేనీ రోడ్డు నిర్మాణం చేపట్టేటప్పుడు ఇంజనీరింగ్‌ అధికారులు సదరు రోడ్డు అలైన్‌మెంట్‌ను నిశితంగా పరిశీలించాల్సి వుంటుంది. క్షేత్రస్థాయిలో సర్వే చేయడం ద్వారా ఏయే ప్రాంతంలో ఎలా నిర్మించాలనే దానిపై స్పష్టత వస్తుంది. ఈ రోడ్డు విషయానికి వస్తే కనీసం రోడ్డు విస్తీర్ణమెంత? మార్గమధ్యంలో వంతెనలు ఏమైనా నిర్మించాలా? కట్టడాలేవైనా ఎదురొస్తున్నాయా? అనేది గమనించకుండానే గుడ్డిగా పనులు మొదలుపెట్టారు. అలైన్‌మెంట్‌ను చూడకుండా నిర్మాణవ్యయం కూడా ఎలా ప్రతిపాదించారనే దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవైపు నడిబొడ్డున బహుళ అంతస్తుల భవనం అడ్డు వస్తుండగా... మరోవైపు రక్షణ స్థలం ఉండటంతో పనులు నిలిచిపోయాయి. అటు అర కి.మీ... ఇటు అర కి.మీ వదిలి పూర్తి చేసిన 2.5 కి.మీ రోడ్డు కూడా నిరుపయోగంగా మారింది. 100 ఫీట్ల ఈ లింకు రోడ్డుకు అడ్డంకులను ఎలా అధిగమిస్తారనే దానిపై హెచ్‌ఆర్‌డీసీఎల్‌ ఉన్నతాధికారి జియావుద్దీన్‌ను ఫోన్‌లో సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు. 

ఏ ప్రాంతవాసులకు ఉపయోగమంటే
ఈ లింకు రోడ్డు పూర్తయితే మణికొండ, అల్కపూర్, పుప్పాలగూడ, నార్సింగి, సెక్రటరీ కాలనీ, నెక్నాంపూర్‌తో పాటు చుట్టూ ప్రక్కల ప్రాంతాల వారికి... ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు వెళ్లేందుకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగం కానుంది. ఈ రోడ్డు మైహోం అవతార్‌ దగ్గర ఉన్న ఓఆర్‌ఆర్‌ సర్వీసురోడ్డుకు కూడా అనుసంధానం అవుతుండటంతో వాహనచోదకుల సాఫీ ప్రయాణానికి వీలవుతుంది.

హెచ్‌ఆర్‌డీసీఎల్‌ వారే లింక్‌ రోడ్డు వేస్తున్నారు
హైదరాబాద్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) రేడియల్‌ రోడ్డు నంబర్‌ –4 (నార్సింగి) నుంచి రేడియల్‌ రోడ్డు నంబర్‌ 5(పుప్పలగూడ)ని అనుసంధానించే... 3.5 కిలోమీటర్ల 100 ఫీట్ల లింక్‌ రోడ్డును నిర్మిస్తోంది. మేం 2015లోనే రూ.22.66 కోట్లు పరిహారం చెల్లించి భారీ రహదారి కోసం భూమి సేకరించాం.
అయితే గతేడాది ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం హెచ్‌ఆర్‌డీసీఎల్‌ వారే టెండర్లు పిలిచి కరోనా సమయంలో కాంట్రాక్టర్‌తో రోడ్డు నిర్మించారు.అయితే నార్సింగ్‌ వైపున 500 మీటర్ల మేర ఆర్మీ స్థలం ఉండటంతో వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే పరిష్కరిస్తాం.
– బీఎల్‌ఎన్‌ రెడ్డి, హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి

లింక్‌ రోడ్డు లేక నరకం
రేడియల్‌ రోడ్ల మధ్య లింక్‌ రోడ్డు పనులు పూర్తి కాకపోవటంతో మణికొండ, నార్సింగి, నెక్నాంపూర్, పుప్పాలగూడ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఐటీ సంస్థలకు వెళ్లేందుకు ఇరుకు రోడ్ల వెంట ట్రాఫిక్‌లో దుమ్ము,ధూళితో ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. 
– శ్రీనివాస్, ఐటీ ఉద్యోగి, అల్కాపురి టౌన్‌షిప్‌

ఏమర్జెన్సీ వస్తే... అంతే సంగతులు!
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి టౌన్‌షిప్‌తో పాటు చుట్టు పక్కల ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఇక అంతే సంగతులు. రోడ్ల కనెక్టివిటీ సరిగా లేకపోవటం, ఉన్న రోడ్లు సైతం మిలట్రీ అధికారులు ఓ వైపు, భవన నిర్మాణంతో మరోవైపు మూసి వేయటంతో అంబులెన్స్‌ రావాలన్నా బాగా సమయం పడుతోంది. – అనురాగ్, అల్కాపురి టౌన్‌షిప్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement