- అమరావతి టౌన్‌షిప్‌లో...
- 45 ఎకరాల విస్తీర్ణంలో గృహల నిర్మాణానికి కసరత్తు
- రాజధాని హడావిడి నేపథ్యంలో కసరత్తు
- మరో నెలలో మొదలుపెట్టే యోచన?
సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా సుదీర్ఘకాలం తర్వాత మెగా హౌసింగ్ ప్రాజెక్టుకు తెరతీసింది. ఉడా పరిధిలో భూముల ధరలు భారీగా పెరగటంతో ఉడాకు భూసేకరణ సమస్యాత్మకంగా మారింది. ఈ క్రమంలో ఉడా వద్ద నిల్వ ఉన్న మిగులు భూమిపై దృష్టిసారించింది. దీంతో అమరావతి టౌన్‌షిప్‌లో ఉన్న మిగులు భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం జరుగుతుందన్న విసృత ప్రచారం నేపథ్యంలో హౌసింగ్ ప్రాజెక్టు మొదలుపడితే భారీగా డిమాండ్ వస్తుందని... తద్వారా ఉడాకు భారీగా ఆర్థికవనరులు సమకూరతాయని చైర్మన్ భావించారు. దీంతో ప్రాజెక్టును పట్టాలు ఎక్కించేందుకు కసరత్తు సాగిస్తున్నారు. అధికారులతో చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నెలరోజుల వ్యవధిలో టెండర్లు ఆహ్వనించి ఎడాదిన్నర కాలవ్యవధిలో ప్రాజెక్టు పూర్తిచేయించాలని భావిస్తున్నారు.
ఉడా పరిధిలో ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నవులూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉడా 1988-1991 మధ్య 390.38 ఎకరాల భూసేకరణ చేసింది. తదనంతరం 390 ఎకరాల్లో 285.17 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్‌వేసి 1327 ప్లాటు వేశారు. సుధీర్ఘకాలంపాటు విక్రయించారు. ఈ క్రమంలో తొలుత కొంత నగదు చెల్లించి నిర్ణీత కాలంలో రిజిష్టర్ చేయించుకుని పలుప్లాట్లను రద్దు చేశారు. 390 ఎకరాల భూమిలో ఖాళీ ఉన్న 105 ఎకరాల భూమిలో 24 ఎకరాలు ఇంటర్నేషనల్ కిక్రెట్ స్టేడియానికి, మరో 22.72 ఎకరాలు అరిహంత్‌ఇండోఅఫ్రికన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌కు కేటాయించారు.
దానిలో సదరు సంస్థ సింగ్‌పూర్ టౌన్‌షిప్ నిర్మించాలని కసరత్తు చేసింది. అలాగే 40 ఎకరాలను ఐటీ సెజ్‌గా గుర్తించి ఐటీసంస్థలకు కేటాయించడం కోసం ఉంచారు. దీంతో ఐటీ సంస్థలు రాకపోవటంతో సెజ్‌ను రద్దుచేసి కేటాయించిన భూమిని ఉడా తిరిగి వెనక్కి తీసుకుంది. దీంతో ఉడాకు ఆ భూమి నిల్వ భూమిగా ఉంది. మరోవైపు కేటాయింపులు జరిపిన భూముల్లో క్రికెట్‌స్టేడియం పనులు వేగంగా సాగుతున్నాయి.
అలాగే సింగపూర్ టౌన్‌సిప్ 2007లో పనులు మొదలుకావల్సి ఉన్నప్పటికీ అన్ని అనుమతులు లేకపోవటంతో వాయిదా పడింది. ప్రస్తుతం అన్ని అనుమతులు పొందింది. కేటాయింపులు పోను, పార్కులు, ఇతర సౌకర్యాలకు కేటాయించినది పోనూ సుమారు 45 ఎకరాలు భూమి ఉడాకు మిగిలింది. వాస్తవానికి వీజీటీఎం ఉడా రెండేళ్ల కిత్రమే హౌసింగ్ ప్రాజెక్టు మొదలుపెట్టాలని భావించింది. అయితే ఉడాకు ల్యాండ్ బ్యాంకు లేకపోవడంతో ప్రాజెక్టు సాధ్యపడలేదు.
దీంతో అప్పట్లో ఉడా వైస్‌చైర్మన్లు గుంటూరు, కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ భూములు కొన్నింటిని ఉడాకు కేటాయించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు.అయినప్పటికీ స్పందన లేకపోవటంతో పూర్తిగా హౌసింగ్ ప్రాజెక్టును వదిలేశారు.అయితే ప్రసుత్తం ఉడాలో 385 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 1000 చదరపు గజాలు మొదలుకుని 200 గజాల వరకు ఉన్న పాట్లున్నాయి. వీటిల్లో 1000 గజాల ప్లాట్లు 107, 200 గజాల ప్లాట్లు 106 అధికంగా ఉన్నాయి. వెంచర్‌లో ప్లాట్లు కావడంతో వాటిని విక్రయించే పనిలో ఉడా అధికారులు నిమగ్నమైయ్యారు.
45 ఎకరాల్లో...
45 ఎకరాల్లో మెగా హౌసింగ్ వెంచర్ నిర్మించాలని సన్నాహలు చేస్తున్నారు. వీటిలో ఇండిపెండెంట్ హౌస్‌లతోపాటు, అపార్ట్‌మెంట్లు, పార్కులు, ఇండోర్ స్టేడియం, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. 250 చదరపు గజాల విస్తీర్ణంలో ఇండిపెండెంట్ హౌస్ నిర్మాణం, అపార్ట్‌మెంట్లో సుమారు రెండువేల ప్లాట్ల నిర్మాణం చేసి మధ్యతరగతివర్గాలకు కేటాయింపు జరిపేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో జరగనున్న ఉడా పాలకవర్గ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.