Vijayawada - Guntur
-
సర్కార్ ల్యాండ్ ఫూలింగ్!
* ల్యాండ్ పూలింగ్‌లో ఎకరాకు రూ. 1.11 కోట్లు ఖర్చు చేయాలి * భూసేకరణకు మూడు నాలుగేళ్లు పడుతుంది * విజయవాడ - గుంటూరు రీజియన్‌లో తీవ్ర సమస్యలు * ఒకే ప్రాంతంలో పెద్ద విస్తీర్ణంలో స్థలాలు లభ్యం కావు సాక్షి, హైదరాబాద్ : ల్యాండ్ పూలింగ్ కోసం రైతుల నుంచి భూముల సేకరణ ద్వారా తక్కువ ఖర్చుతో రాజధానికి భూములు సమకూర్చుకోవచ్చంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన అంచనాలు తప్పని శివరామకృష్ణన్ కమిటీ నిరూపించింది. ఈ విధానంలో సేకరించిన భూమిని అభివృద్ధి చేసి 40 శాతం భూమిని తిరిగి రైతుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం విదితమే. ల్యాండ్ పూలింగ్ విధానంలో ఒక్క ఎకరా ప్రభుత్వం చేతిలోకి రావాలంటే రూ. 1.11 కోట్లు ఖర్చు చేయాలని కమిటీ విశ్లేషించింది. ‘‘పూర్తిస్థాయిలో భూసేకరణ చేయడానికైనా, ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించడానికైనా సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది. పాలనా పరమైన జాప్యం జరిగితే మరింత ఆలస్యమవుతుంది. భూసేకరణలో పట్టే సుదీర్ఘ సమయమే ప్రధాన అవరోధంగా మారుతుంది’’ అని పేర్కొంది. ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వానికి ఎకరా ఇస్తే తమకు 40 సెంట్లు (40 శాతం) తిరిగి వస్తుందనే భావనలో రైతులు ఉన్నారు. వారికి వచ్చేది 24 సెంట్లు (24 శాతం). మరి 24 శాతానికి రైతులు అంగీకరిస్తారా? లేదా? అనే విషయంలో అనుమానం ఉంది. విజయవాడ - గుంటూరు రీజియన్‌లో ఈ అంశం మీద తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) ఆధారిత ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు సేకరించడం ద్వారా భూసేకరణను తక్కువ నిధులతో పూర్తి చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ సర్కారు పేర్కొంది. ఈ మేరకు డీటీసీపీ (డిపార్ట్మెంట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) వేసిన అంచనాలు సరిగా లేవు. వీజీటీఎం రీజియన్‌లో 1,458 ఎకరాల భూములు (తర్వాత 5-10 వేల ఎకరాలకు పెంచాల్సి ఉంటుంది) ఈ విధానంలో సేకరించడం సరైన మార్గమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రైతుల వద్ద తీసుకున్న భూమిలోనే వారికి వాటా ఇస్తే.. ప్రభుత్వానికి ఒకే ప్రాంతంలో పెద్ద ఎత్తున స్థలాలు లభించడం సాధ్యం కాదు. ఫలితంగా కేంద్రీకృతంగా పరిపాలనా కేంద్రం నిర్మించడానికి వీలు కాదు. ప్రతి ప్రభుత్వ స్థలం పక్కనే ప్రయివేటు భూమి ఉంటుంది. రాజధాని అంతా ఇదే పరిస్థితి ఉంటుంది. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం చేస్తే... కొత్త భూసేకరణ చట్టం (ఎల్ఏఆర్ఆర్) ప్రకారం.. పాలనా పరమైన జాప్యం లేకుండా చేస్తే, భూసేకరణకు కనీసం 3-4 సంవత్సరాల సమయం అవసరం. ల్యాండ్ పూలింగ్ విధానంలో కూడా భూసేకరణకు కనీసం 4 సంవత్సరాలు కావాలి. ఏ కారణం వల్ల అయినా జాప్యం జరిగితే ఐదారేళ్లు పడుతుంది. భూసేకరణ ప్రకటన, వాస్తవ భూసేకరణకు మధ్య సుదీర్ఘ వ్యత్యాసం ఉంటే.. ఆ ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అదే జరిగితే.. కొత్త చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించడం మరీ భారమవుతుంది. భూసేకరణలో జాప్యం జరిగితే వడ్డీలు భారమైపోతాయి. ఫలితంగా రాజధాని నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెరుగుతుంది. పెరిగిన భారాన్ని భరించలేకపోతే.. ప్రతికూల ఫలితాలు వస్తాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థలాల ధరలను కమిటీ పరిశీలించింది. ఈ ధరలు తెలుసుకోవడానికి ‘ఇండియా ప్రాపర్టీ’ లాంటి వాణిజ్య వెబ్సైట్లను వాడుకుంది. విజయవాడ పరిసరాల్లోని రామవరప్పాడులో నివాస స్థలాలు ఎకరా ధర రూ. 3.87 కోట్ల నుంచి 6.98 కోట్లు ఉంది. నున్నలో వ్యవసాయ భూముల ధరలు ఎకరా రూ. 50 లక్షల నుంచి రూ. 1.12 కోట్లు ఉంది. ఇవి ప్రాథమిక (బేస్) ధరలు. వాస్తవంగా చెబుతున్న రియల్ ఎస్టేట్ ధరలతో పోలిస్తే ఇవి మరీ తక్కువగా ఉన్నాయి. ఈ ధరల్లో భూ సేకరణకు కావాల్సిన నిధులు సమకూర్చుకోవడం సాధారణ విషయం కాదు. ల్యాండ్ పూలింగ్ విధానంలో ఈ ధరల ప్రకారం రైతుకు వచ్చే 24 శాతం వాటా భూమి ధర ఆ మేరకు పెరుగుతుందనే విషయంలో రైతులకు అనుమానాలుంటాయి. కొత్త రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో పెద్ద ఎత్తున భూములు సేకరించిన చరిత్ర దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేదు. పరిమిత అవసరాలకు ఈ విధానాన్ని అనుసరించారు. కొత్త భూసేకరణ చట్టాన్ని వినియోగించి పెద్ద ఎత్తున భూసేకరణ కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఈ రెండు విధానానాల్లో వచ్చే సమస్యలను గత అనుభవాల ఆధారంగా అంచనా వేయలేం. పశ్చిమబెంగాల్ సింగూరులో 2006లో చెలరేగిన భూసేకరణ వ్యతిరేక నిరసనలు తర్వాత దేశవ్యాప్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొత్త భూసేకరణ చట్టం వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా హర్యానా, రాజస్థాన్‌లలో.. యమునా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టుపై నోయిడాలో, జైపూర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై జైపూర్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రాలపైన రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమయింది. బళ్లారిలో విమానాశ్రయం నిర్మాణానికి సారవంతమైన భూముల సేకరణను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భూసేకరణలో వచ్చే ముందస్తు సమస్యలను గుర్తించి అధిగమించాలి. ‘ల్యాండ్ పూలింగ్’కు చట్టబద్ధత తప్పనిసరి రాజధాని కోసం భూసేకరణ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి (ఏపీయూడీ) చట్టంలో కొత్త అధ్యాయాన్ని చేర్చాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. ల్యాండ్ పూలింగ్ విధానానికి చట్టబద్ధత ఉండాలంటే చట్టంలో మార్పు తప్పనిసరని పేర్కొంది. ల్యాండ్ పూలింగ్ నిబంధనలనూ రూపొందించాలని సూచించింది. గతంలో విశాఖపట్నం అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ (వుడా)కి పరదేశిపాలెం, చెర్లోపాలికందం ప్రాంతంలో భూసేకరణ సమయంలో తగిన చట్టం లేకపోవడం వల్ల తలెత్తిన సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. హెదరాబాద్ మెట్రో డెవలెప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) రూపొందించిన ల్యాండ్ పూలింగ్ మార్గదర్శకాలను పరిశీలించాలని సూచించింది. వీజీటీఎం ప్రాంతంలో భూ సేకరణకు హెచ్ఎండీఏ చట్టాన్ని వినియోగించడానికి వీల్లేదు కాబట్టి.. ఏపీయూడీ చట్టానికి చేర్చే అధ్యాయానికి అనుగుణంగా వీజీటీఎం చట్టాన్ని రూపాందించాలని సూచించింది. భూ సేకరణకు అనుగుణంగా చట్టం చేసుకునే అవకాశాన్ని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కల్పించిన విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. ‘కొత్త రాజధానికి 5 వేల నుంచి 10 వేల ఎకరాలు కావాలని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ తొలి దశలో 1,458 కావాలని కమిటీకి టౌన్ ప్లానింగ్ విభాగం నివేదించింది. అంతకంటే ఎక్కువ భూమి కావాల్సి వస్తే దశల వారీగా సేకరించాల్సిన భూమి వివరాలను ఇవ్వలేదు. తొలి దశలో సేకరించిన భూమితోనే రాజధాని నిర్మిస్తారా?’ అని కమిటీ ప్రశ్నిం చింది. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మూడింట రెండొంతుల మంది రైతులు భూసేకరణకు అంగీకరించాలనే నిబంధన పెద్ద అడ్డంకి అవుతుందనే అనుమానం వ్యక్తంచేసింది. భూ రికార్డులు, ఇతర న్యాయ సమస్యలు ఉన్నప్పుడు అనుసరించాల్సిన మార్గాన్ని ముందే నిర్ధారించుకోవాలని సూచించింది. నిర్వాసితులు ప్రత్యామ్నాయంగా భూమి ఇచ్చే విధానాన్ని దక్షిణాసియాలో అనుసరిస్తున్నారని పేర్కొంది. ఢిల్లీ, గుర్గాం, నవీ ముంబై, మాగరపట్ట, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో భూసేకరణకు అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. జపాన్, దక్షిణ కొరియాలో అనుసరించిన ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు విధానాన్ని పరిశీలించాలని సూచించింది. -
తెలుగు తమ్ముళ్ల ఆశలపై నీళ్లు!
పేనం మీద నుంచి పోయ్యిలో పడినట్లుంది ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకుల పరిస్థితి. రాజధాని ఏర్పాటుపై తమ మాటే చెల్లుతుందని ఊహాల్లో తేలియాడుతున్న పచ్చ నేతల ఆశలపై నిపుణుల కమిటీ నివేదిక నీళ్లు చల్లింది. ఇప్పటి వరకు ఏపీ రాజధాని విజయవాడ - గుంటూరు నగరాల మధ్యే అని ముఖ్యమంత్రి నుంచి మంత్రి వర్గ సహచరులు... చివరకు ఆ పార్టీ ఎంపీలు కూడా అంతా డంకా భజాయించి మరీ చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ - గుంటూరు నగరాల మధ్య అనుకూలంగా లేదని ప్రొఫెసర్ శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర హోం శాఖకు బుధవారం ఇచ్చిన నివేదికతో తెలుగు తమ్ముళ్లు నిర్ఘాంతపోయారు. అంతేకాదు విజయవాడ - గుంటూరు మధ్య సాగుభూమి అధికంగా ఉందని... రాజధాని ఏర్పాటు చేస్తే ఆ భూమికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కమిటీ పేర్కొనడంతో టీడీపీకి ఎన్నికల నిధులిచ్చిన రియాల్టర్లు నీరుకారిపోయారు. అంతేకాకుండా గుంటూరు జిల్లా వినుకొండ - ప్రకాశం జిల్లాలోని మార్టూరుల మధ్య రాజధాని ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతం అంటూ ఆ కమిటీ తన నిర్ణయాన్ని హోం శాఖ ముందుంచింది. దాంతో ఇప్పటి వరకు విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతుందని టీడీపీ ప్రజాప్రతినిధులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. కానీ శివరామకృష్ణన్ కమిటీ వినుకొండ - మార్టూరు మధ్య రాజధాని అనే సరికి టీడీపీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయపడినట్లు అయింది. రాజధాని ఎంపికపై వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో, దానిపై తమ సర్కారు ఏవిధంగా స్పందింస్తుందోనని తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు. ఈ విభజన ఏమిటో.... కొత్త రాజధాని ఎక్కడో... అంతా... అంటూ గొణుకుంటున్నారు. -
ఆక్రమణలో అడవులు
జిల్లాలో 1.23 లక్షల ఎకరాల్లో విస్తరించిన అడవులు కొండపల్లి మినహా దట్టమైన అడవులు నిల్ జిల్లాలో భూకొరత నేపథ్యంలో అటవీ భూములపై సర్కారు ఆరా భూములపై నివేదిక సమర్పించిన జిల్లా అధికారులు జిల్లాలో భారీగా అటవీ భూములు ఉన్నాయి. దాదాపు మూడు అటవీ రేంజ్‌ల పరిధిలో 1.23 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అయితే దట్టమైన అడవులు అంతంత మాత్రమే. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు లేవని జిల్లా అటవీ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే ఇదంతా రికార్డులకే పరిమితం. వాస్తవానికి వేల ఎకరాల అటవీ భూములు ఆక్రమణచెరలో ఉన్నాయి. సాక్షి, విజయవాడ : విజయవాడ - గుంటూరు నగరాల మధ్య రాష్ట్ర రాజధాని ఎర్పాటవుతుందన్న ప్రచారం కొన్ని నెలలుగా సాగుతోంది. అటవీ ప్రాంతం అయితే రాజధాని నిర్మాణనికి అనువుగా ఉంటుందని, వేల ఎకరాల భూమి ఒకే చోట లభిస్తుందన్న వాదన ముందుకొచ్చింది. ఈ క్రమంలో రెండు జిల్లాలో భూముల వివరాలను ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా నివేదికల రూపంలో సేకరించింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా కలెక్టర్ అటవీశాఖ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని ప్రభుత్వానికి పంపారు. జిల్లాలో నివాస, సాగు, ప్రయివేటు భూములు మినహా ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 5.91 లక్షల ఎకరాల భూములు ఉండగా వీటిలో 3.28 లక్షల ఎకరాల భూముల్లో సాగు, నివాసాలు ఇలా అనేకం ఉన్నాయి. ప్రభుత్వ భూములు రికార్డుల ప్రకారం 2.62 లక్షల ఎకరాలు ఉన్నా వీటిలో పనికి వచ్చే భూములు కేవలం 742 ఎకరాలు మాత్రమే. ఈ మేరకు గత వారం జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం జిల్లాలో విజయవాడ, మైలవరం, నూజివీడు అటవీ రేంజ్‌ల పరిధిలో 1,23,402.81 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. జిల్లాలో కొండపల్లి ప్రాంతలో మాత్రమే దట్టమైన అడవులు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఉన్నవి సాధారణ అడవులే. జిల్లాలో సుమారు 16 మండలాల్లో 95 గ్రామాలకు సమీపంలో అటవీప్రాంతం ఉంది. అయితే అటవీప్రాంత స్వరూపాన్ని బట్టి రిజర్వ్ ఫారెస్ట్‌గా కొన్నింటిని నిర్ణయించారు. ఈ క్రమంలో నూజి వీడు రేంజ్ పరిధిలో మూడు రిజర్వు ఫారెస్ట్లు, విజయవాడ రేంజ్ పరిధిలో తొమ్మిది రిజర్వు ఫారెస్ట్లు, మైలవరం డివిజన్లో నాలుగు రిజర్వు ఫారెస్ట్లు ఉన్నాయి. నూజివీడు రేంజ్లో నూజివీడు, చాట్రాయి, విసన్నపేట, హనుమాన్ జంక్షన్, బాపులపాడు, మైలవరం రేంజ్ పరిధిలో ఎ.కొండూరు, తిరువూరు, విజయవాడ రేంజి పరిధిలో విజయవాడ, ఇబ్రహీంపట్నం, వీరులపాడు, చందర్లపాడు, జగ్గయ్యపేట తదితర మండలాల సమీపంలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. అయితే వందల ఎకరాల భూములు 99 ఎళ్ల లీజులో ఉన్నాయి. రికార్డుల ప్రకారం జిల్లాలో లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నా వాస్తవానికి 70 వేల ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆక్రమణలే అధికం ప్రధానంగా నూజివీడు రేంజ్ పరిధిలో అటవీప్రాంతలో ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. విజయవాడ, మైలవరం రేంజి పరిధిలోనూ ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల అటవీప్రాంతం అన్యాక్రాంతమయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నూజివీడు రేంజ్ పరిధిలో సుమారు 20 వేల ఎకరాలు ఆక్రమణల చెరలో ఉన్నాయి. కొన్ని చోట్ల గ్రావెల్ కోసం అటవీభూములను అక్రమార్కులు తవ్వేశారు. కొంతమంది ఆక్రమణదారులు అటవీప్రాంతాన్ని సాగు భూమిగా మార్చారు. ప్రధానంగా మామిడి, పామాయిల్, జామ, ఇతర ఉద్యాన పంటలు, పండ్ల తోటలను అటవీప్రాంతంలో సాగు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులుకే ఈ వివరాలు తెలిసినా పూర్తిస్థాయిలో కేసులు నమోదు చేయకుండా చూసీచూడనట్లు వ్యవహరనిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంమీద రికార్డుల కంటే జిల్లాలో తక్కువ అటవీ ప్రాంతం ఉండటం గమనార్హం. -
అక్కడో... ఇక్కడో... ఎక్కడో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయి నెల అయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అనే అంశంపై ప్రొ. శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించి వెళ్లింది. అలాగే రాజధాని ఎక్కడ అనే అంశంపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆ కమిటీతో పలుమార్లు భేటీ ఆయ్యారు. అయినా రాజధానిపై మాత్రం స్పష్టత రాలేదు. ఇదే విషయాన్ని సాక్షాత్తూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రే బల్ల గుద్ది మరీ చెప్పారు. మీడియా మాత్రం రాజధాని అక్కడో... ఇక్కడో... ఎక్కడో అంటూ రోజుకో ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని వార్త కథనాలు వెల్లువలా వెలువరిస్తుంది. మీడియా కథనాలతో ఆంధ్రప్రదేశ్‌లోని రియాల్టర్లకు కాసుల వర్షం కురుస్తుంది. మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలోని రియాల్టర్ల 'దశ' తాడు వదిలి నేల మీద విసిరిన బొంగరంలా గిరగిర 'తిరుగుతుంది'. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఏర్పాటు అవుతుందని గతంలో పుకార్లు షికార్లు చేశాయి. దాంతో ఆ ప్రాంతంలో గజం భూమి విలువ లక్షలకు చేరుకుంది. మరోవైపు రాష్ట్ర వాణిజ్య రాజధాని విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న ఆగిరిపల్లిలో రాజధాని ఏర్పాటవుతుందంటూ మీడియాలో పలు కథనాలు హల్చల్ చేశాయి. దాంతో ఇటు విజయవాడ, అటు నూజివీడు, హనుమాన్ జంక్షన్, గన్నవరం పరిసర ప్రాంతాల్లో భూమి ధరలు చుక్కలనంటాయి. ఇంతలో గుంటూరు జిల్లా అమరావతి రాజధాని అయితే అన్ని విధాల శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందంటూ మరో కథనం వెలువడింది. ఇంకో వైపు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం చేస్తామంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయంటూ వెల్లడించారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రకటించిన పలు జాతీయ విద్యా సంస్థలు తన సొంత నియోజక వర్గం భీమిలి పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు ఆయన తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దాంతో భీమిలిలో భూముల ధరలు రెక్కలు వచ్చి ఆకాశంలో మేఘాలు చాటున దోబూచులాడుతున్నాయి. భీమిలిలోపాటు విశాఖపట్నం జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే అగ్రగామి జిల్లాగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు గంటా తెలిపారు. రాష్ట్ర విభజనతో ఇప్పటికే ఉత్సాహంతో ఉన్న సదరు జిల్లాలకు చెందిన రియాల్టర్లకు ఇప్పుడు మరింత జోరు మీద ఉన్నారు. -
ఇవిగో భూములు
విజయవాడ పరిసరాల్లో 12,000 ఎకరాల గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా జిల్లా కలెక్టర్ నివేదిక రాజధానికా..? కేంద్ర ప్రభుత్వ సంస్థలకా..? విజయవాడ: విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటవుతుందనే ప్రచారం నేపథ్యంలో.. ఈ ప్రాంతంలో ప్రభుత్వ, అటవీ భూముల గుర్తింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే విజయవాడ, నూజివీడు పరిసరాల్లో 12,000 ఎకరాల అటవీ భూముల వివరాలను సేకరించిన కృష్ణా జిల్లా యంత్రాంగం ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. విజయవాడ శివారున విజయవాడ రూరల్ మండల పరిధిలోని నున్న ప్రాంతంలో 6,500 ఎకరాల అటవీ భూములు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. విజయవాడ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో నున్న, పాతపాడు, కొత్తూరుతాడేపల్లి గ్రామాల పరిధిలో ఒకే ప్రాంతంలో ఈ అటవీ భూమి ఉండడం విశేషం. ఈ ప్రాంతంలో భూములు ఉన్నట్లు తెలిసినా వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మొన్నటివరకూ అధికారుల వద్ద కూడా లేవు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట భూముల గుర్తింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టి వాటి వివరాలను సేకరించారు. కొత్తూరుతాడేపల్లి వద్ద 1,000 ఎకరాల భూమిని గుర్తించారు. ఇదిగాక నున్న పరిసరాల్లో 4,000 ఎకరాల భూమిని గుర్తించారు. 1,500 ఎకరాలు పాతపాడు ప్రాంతంలో ఉంది. ఈ 6,500 ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డులు, మ్యాప్‌లను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి సమర్పించింది. ఇక నూజివీడు పరిసర ప్రాంతాల్లో 5,500 ఎకరాల వివరాలను కూడా సేకరించింది. మొత్తంగా ఈ 12,000 ఎకరాల వివరాలను కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందనరావు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఈ అటవీ భూములను డీనోటిఫై చేసి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణానికి వినియోగించుకుంటారా, లేక ప్రభుత్వ సంస్థలకా అనేది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. -
బడా ‘ఉడా’
కొత్త రాజధాని నేపథ్యం విజయవాడ-గుంటూరు జంటనగరాలుగా అభివృద్ధి విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి మధ్య మెట్రో రైలు నిర్మాణం రెండు జిల్లాల్లో ఉడా పరిధి 7065 కిలోమీటర్లు గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య రాజకీయ రాజధాని నిర్మాణం జరుగుతుందనేది ప్రస్తుతం ఉన్న బలమైన వాదన. అది కూడా అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు చెబుతున్న మాట. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మరింత బలం చేకూర్చారు. విజయవాడ-గుంటూరులను జంటనగరాలుగా అభివృద్ధి చేస్తామని ఇటీవలే ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు దీటుగా రెండు నగరాలను అభివృద్ధిచేస్తామన్న ప్రకటన రెండు జిల్లాల ప్రజల్లో రాజధాని ఆశల్ని రెట్టింపు చేసింది. రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో ఏర్పాటుచేసే మెట్రో రైలును విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటుచేయాలని కూడా నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రెండు నగరాల స్వరూపంతోపాటు వీజీటీఎం ఉడా పరిధిలోని ప్రాంత స్వరూపమే మారనుంది. సీమాంధ్రలోనే నంబర్‌వన్ నగరంగా విజయవాడ అవతరించే దిశగా అవకాశాలు రెట్టింపు అయ్యాయి. సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో ఇప్పుడు నేతలు, అధికారుల అందరి అలోచన రాజధాని ప్రకటనపైనే ఉంది. జూన్ పది తర్వాత రాజధాని ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముందుగా ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న వసతులు, తర్వాత సమకూరే సౌకర్యాలు, కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు.. ఇలా అన్ని అంశాలు పరిగణనలోకి వస్తున్నాయి. వెంకయ్యనాయుడు తొలి ప్రకటనలోనే విజయవాడ, గుంటూరుకు ప్రాధాన్యత దక్కడం విశేషం. శివరామకృష్ణన్ కమిటీ పరోక్ష సంకేతాలు ఇప్పటికే రెండు జిల్లాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ రాజకీయ రాజధాని ఇక్కడే ఉంటుంది అని పరోక్ష సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు రాజకీయ రాజధానికే ఓటు వేశారు. నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా గుంటూరు-విజయవాడ మధ్య రాజధానిృఉంటుందని రెండు జిల్లాల నేతలకు తెలిపారు. దీనికి బలం చేకూర్చేలా రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ను విజయవాడలో ఏర్పాటుచేస్తున్నారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం లభించింది. దీంతోపాటు నూతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు ఇప్పటికే విజయవాడ, రాజధాని నిర్మాణం జరుగుతుందన్న మంగళగిరి ప్రాంతంలో పర్యటించారు. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు. అందుకే ఈ ప్రాంతంలోనే రాజధాని నిర్మిస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందనేది వారి యోచన. అభివృద్ధి పథంలో రెండు జిల్లాలు.. విద్య, వాణిజ్య, వ్యాపార, వైద్యపరంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు సీమాంధ్రలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో మొదటి ఐదుస్థానాల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలు నిలుస్తాయి. ఈ ప్రాంత ప్రజల తలసరి ఆదాయం సుమారు రూ.96 వేలుగా ఉంది. వీటితోపాటు రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక, సిమెంట్, ఐరన్ తదితర మెటీరియల్ ఉత్పత్తి చేసే అన్ని ప్రధాన కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూములు కూడా రెండు జిల్లాల్లోనూ కలిపి సుమారు లక్ష ఎకరాల వరకు ఉంటుందని అంచనా. జాతీయ రహదారుల సమీపంలో సుమారు 10వేల ఎకరాలు భూమి ఉంది. వీటన్నింటితోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాలు అధికార తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. రెండు జిల్లాల్లో అధికారపార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు ఐదుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఏపీఎస్పీ బెటాలియన్‌లో డీజీపీ కార్యాలయం.. మంగళగిరి సమీపంలో 134 ఎకరాల్లో ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ క్యాంపు ఉంది. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో భవనాలు ఇప్పటికే ఉన్నాయి. నూతన ఆంధ్రప్రదేశ్‌కు డీజీపీ కార్యాలయం తక్షణమే ఏర్పాటుకు ఈ బెటాలియన్ అనువుగా ఉంది. దీంతో సీఎం క్యాంపు కార్యాలయం, డీజీపీ కార్యాలయం ఇక్కడే ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ఉడా పరిధిలో చాలినంత భూమి.. ఇదంతా ఉడా పరిధిలోనే ఉంది. వీజీటీఎం ఉడా విజయవాడ, గుంటూరు నగరపాలకసంస్థలతోపాటు రెండు జిల్లాలో 9 మున్సిపాలిటీలు 1400 గ్రామాల్లో విస్తరించి ఉంది. ఉడాకు తాడేపల్లిలోని అమరావతి టౌన్షిప్లో 45 ఎకరాల భూమి మాత్రమే ఉంది. విజయవాడ -గుంటూరు మధ్య సుమారు 1000 ఎకరాల వరకు రెవెన్యూ భూమి ఉంది. ఈ పరిణామాల క్రమంలో ఇటీవల రెండు జిల్లాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ ఉడాకు సంబంధించిన అన్ని వివరాలతోపాటు సమగ్ర నివేదికను తీసుకున్నారు. ఉడా వైస్‌చైర్మన్ పి.ఉషాకుమారి ఉడా పరిధి, కార్యకలాపాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం రూపొందుతున్న ఉడా మాస్టర్‌ప్లాన్‌పై విస్తృతంగా చర్చించడంతోపాటు పరిధి పెంపు వల్ల రాజధాని నిర్మాణానికి ఎంతవరకు దోహదపడుతుందనే దానిపై చర్చించారు. గుంటూరు జిల్లా పర్యటనకు వెళుతూ శివరామకృష్ణన్ కమిటీ మంగళగిరి ప్రాంతాన్ని పరిశీలించి వాటి రికార్డుల్ని జిల్లా అధికారుల నుంచి తీసుకున్నారు. మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఏర్పాట్లు... ఉడా పరిధిలోనే రాజధాని నిర్మాణం జరిగే అవకాశం ఉండటంతో ఉడా యంత్రాంగం కూడా ఆ దిశగా కసరత్తు సాగిస్తోంది. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన సాగుతుంది. వచ్చే ఏడాదికి ప్లాన్ ఉడాకు అందే అవకాశం ఉంది. రాజధాని ఏర్పాటు హడావుడి నేపథ్యంలో ప్లాన్ త్వరితగతిన పూర్తిచేయించాలని చూస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ప్రధానంగా నివాసప్రాంతాల గుర్తింపు, పారిశ్రామిక ప్రాంతాల గుర్తింపు, వాణిజ్య ప్రాంతాల గుర్తింపు, ప్రభుత్వ స్థలాలను గుర్తించి సేకరించి ఉడాకు ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేసుకోవటానికి ప్రాధాన్యం, తదితర అంశాలను మాస్టర్‌ప్లాన్‌లో చేర్చారు. వీటితో పాటు ప్రతి నివాస ప్రాంతంలో పార్కుల ఏర్పాటుకు స్థలాలను ప్లాన్‌లో గుర్తిస్తారు. ఉడా విస్తీర్ణం పెంపునకు కసరత్తు.. ఉడా పరిధిలో సుమారు రెండు లక్షల ఎకరాలు ప్రైవేట్ భూములు, వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. వీటితోపాటు అవసరమైతే పరిధి పెంచాలనే యోచన కూడా చేస్తున్నారు. ఉడా పరిధిని మరో 15 కిలోమీటర్లు పెంచితే ఏలూరు, మచిలీపట్నంతో పాటు పలు పట్టణాలు ఉడాలోకి వస్తాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అదే జరిగితే ఉడా పరిధి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే కాకుండా పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలకు విస్తరించటంతోపాటు సీమాంధ్రలోనే పట్టణాభివృద్ధి సంస్థలో అగ్రగామిగా ఉంటుంది. సీఎం క్యాంపు కార్యాలయంగా ఆచార్య నాగార్జున వర్సిటీ.. ఈ పరిణామాల క్రమంలో గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చటానికి సన్నాహాలు చేస్తున్నారు. చంద్రబాబు సొంత టీమ్ ఇప్పటికే వర్సిటీకి సంబంధించిన అన్ని వివరాలను సేకరించి బ్లూప్రింట్తోసహా చంద్రబాబుకు పంపినట్లు సమాచారం. వర్సిటీ 294 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దానిలో సుమారు 100 ఎకరాల్లో వివిధ బ్లాకులు ఇప్పటికే నిర్మితమై ఉన్నాయి. కీలకం కానున్న ఉడా పాత్ర.. ఈ రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న వీజీటీఎం ఉడా రాజధాని నిర్మాణంలో కీలక భూమిక పోషించనుంది. గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతలోనే రాజధాని నిర్మాణం ఉంటుందని పరోక్షంగా సంకేతాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, డీజీపీ కార్యాలయం రెండూ గుంటూరు జిల్లాలోని మంగళగిరి సమీపంలోనే ఏర్పాటు కానుండటంతో రాజధాని నిర్మాణం కూడా ఇదే ప్రాంతంలో జరుగుతుందనే బలమైన వాదన వినిపిస్తోంది. ఉడా మాస్టర్‌ప్లానే నూతన రాజధానికి కూడ మాస్టర్‌ప్లాన్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. భవిష్యత్తు 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉడా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తుంది. -
బెజవాడకు మహర్దశ
విజయవాడ - గుంటూరులను జంటనగరాలుగా అభివృద్థి చేస్తాం కేంద్ర మంత్రి వెంకయ్య వెల్లడి జిల్లా వాసుల హర్షాతిరేకాలు సాక్షి, విజయవాడ : కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. తెలంగాణలోని హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాలకు దీటుగా విజయవాడ-గుంటూరు నగరాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతోపాటు విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి మధ్య మెట్రోరైలు ప్రతిపాదనను కూడా సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. జంటనగరాలుగా విజయవాడ-గుంటూరులను అభివృద్ధి చేయాలంటే ప్రత్యేక నిధుల అవసరం ఉంది. ఇప్పటికే విజయవాడ నగరానికి జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద వచ్చిన నిధులతో కార్పొరేషన్ అభివృద్ధి చెందకపోగా వెనక్కి వెళ్లిపోయింది. సిబ్బందికి జీతాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. పురోగతి పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రెండు నగరాలు ఆర్థికంగా పరిపుష్టి చెందడం కోసం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక ప్యాకేజీ అవసరం.. స్థానిక రాజకీయాల కారణంగా విజయవాడను గ్రేటర్‌గా కూడా మార్చలేదు. ముందు గ్రేటర్ ప్రతిపాదనను కౌన్సిల్ ముందు ఉంచాల్సి ఉంది. గ్రేటర్‌గా మారితే కార్పొరేషన్ ఆదాయం పెరగడంతోపాటు కార్పొరేషన్‌కు పెద్దఎత్తున ల్యాండ్ బ్యాంక్ సమకూరుతుంది. ఈ నేపథ్యంలో జంటనగరాలుగా అభివృద్ధి చేయాలంటే ముందుగా కార్పొరేషన్‌కు 010 పద్దు ఇవ్వడంతో పాటు భారీగా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల్సిఉంటుంది. విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి మహానగరపాలక సంస్థగా ఏర్పాటుచేసి సీనియర్ ఐఏఎస్‌లను నియమించాల్సిఉంటుంది. విజయవాడ నగరంలో నాలుగో వంతు ప్రజలు కొండ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ఈ ప్రాంతానికి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశం ఉంది. విజయవాడ నగరంలో గృహనిర్మాణం చేపట్టాలన్నా స్థలం లేక పదివేల ఇళ్లు ఆగిపోయాయి. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటన చూస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం రాజధానిని ఇక్కడే ఏర్పాటుచేసే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. -
జంట నగరాలుగా విజయవాడ-గుంటూరు
విజయవాడ-గుంటూరు-తెనాలి, విశాఖకు మెట్రో రైలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వంద స్మార్ట్ నగరాల అభివృద్ధి ప్రథమ కర్తవ్యం 2020 నాటికి అందరికీ ఇళ్ల నిర్మాణం పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య న్యూఢిల్లీ: విశాఖ నగరానికి మెట్రో రైలు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. విజయవాడ-గుంటూరు-తెనాలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోనూ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్-సికింద్రాబాద్ తరహాలో విజయవాడ-గుంటూరును జంట నగరాలుగా అభివృద్ధి పరుస్తామన్నారు. దేశంలో కొత్తగా వంద స్మార్ట్, సురక్షిత నగరాలను నిర్మించడమే తన ప్రధాన కర్తవ్యమని వెంకయ్య తెలిపారు. బుధవారం ఉదయం ఆయన ఇక్కడి నిర్మాణ్ భవన్లో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల పనితీరును, కీలకాంశాలను వె ంకయ్యకు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుధీర్ కృష్ణ, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ కార్యదర్శి అనితా అగ్నిహోత్రి వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. జేఎన్ఎన్యూఆర్ఎం స్థానంలో త్వరలో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. 2020 నాటికి దేశంలో అందరికీ ఇళ్ల నిర్మాణం అనేది తమ అజెండాలో మరో ప్రాధాన్య అంశంగా వివరించారు. ఇందుకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో పాటు సామాజిక బాధ్యత కింద వాణిజ్య సంస్థలు అందించే సాయాన్ని కూడా స్వీకరిస్తామని చెప్పారు. వాణిజ్య సంస్థలు, బ్యాంకులు తమ ఉద్యోగులకు, పదవీ విరమణ పొందిన వారికి విరివిగా ఇంటి రుణాలు ఇవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నగరాల్లో అత్యుత్తమ పారిశుధ్య వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ, నీటి పునర్వినియోగం, పబ్లిక్, వాణిజ్య సముదాయాల్లో వై-ఫై సౌకర్యాల కల్పన వంటి వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్) ఆధారంగా పట్టణాభివృద్ధికి అత్యున్నత, శాస్త్రీయ పద్ధతులను వినియోగిస్తామని వెంకయ్య చెప్పారు. ప్రస్తుతం చెన్నై, బెంగుళూరు, కొచ్చిన్ నగరాల్లో జరుగుతున్న మెట్రో రైలు పనులను వేగవంతం చేస్తామని, మరిన్ని నగరాల్లో మెట్రో రైలు సౌకర్యాన్ని కల్పిస్తామని వివరించారు. ఇక దేశంలోని అన్ని ఆధ్యాత్మిక నగరాలను శుద్ధి చేసి అవి యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతామని వెంకయ్య తెలిపారు. పట్టణాల్లోని మురికి వాడల అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఆరోగ్య, విద్యా శాఖలతోనూ సమావేశాలు జరుపుతానని వివరించారు. పట్టణాల్లో నివాస గృహం లేని వారికి జాతీయ పట్టణ ఆవాస యోజన పథకం ద్వారా చేయూతనిస్తామన్నారు. ప్రొటెం స్పీకర్‌గా కమల్‌నాథ్ పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన అనంతరం వెంకయ్యనాయుడు పార్లమెంట్ హౌజ్‌లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బాధ్యతలను కూడా స్వీకరించారు. స్పీకర్ ఎన్నిక జరిగేంత వరకు ప్రోటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కమల్‌నాథ్ వ్యవహరిస్తారని వెల్లడించారు. -
ఉడా మెగా హౌసింగ్ ప్రాజెక్టు!
అమరావతి టౌన్షిప్లో... 45 ఎకరాల విస్తీర్ణంలో గృహల నిర్మాణానికి కసరత్తు రాజధాని హడావిడి నేపథ్యంలో కసరత్తు మరో నెలలో మొదలుపెట్టే యోచన? సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా సుదీర్ఘకాలం తర్వాత మెగా హౌసింగ్ ప్రాజెక్టుకు తెరతీసింది. ఉడా పరిధిలో భూముల ధరలు భారీగా పెరగటంతో ఉడాకు భూసేకరణ సమస్యాత్మకంగా మారింది. ఈ క్రమంలో ఉడా వద్ద నిల్వ ఉన్న మిగులు భూమిపై దృష్టిసారించింది. దీంతో అమరావతి టౌన్షిప్లో ఉన్న మిగులు భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం జరుగుతుందన్న విసృత ప్రచారం నేపథ్యంలో హౌసింగ్ ప్రాజెక్టు మొదలుపడితే భారీగా డిమాండ్ వస్తుందని... తద్వారా ఉడాకు భారీగా ఆర్థికవనరులు సమకూరతాయని చైర్మన్ భావించారు. దీంతో ప్రాజెక్టును పట్టాలు ఎక్కించేందుకు కసరత్తు సాగిస్తున్నారు. అధికారులతో చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నెలరోజుల వ్యవధిలో టెండర్లు ఆహ్వనించి ఎడాదిన్నర కాలవ్యవధిలో ప్రాజెక్టు పూర్తిచేయించాలని భావిస్తున్నారు. ఉడా పరిధిలో ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నవులూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉడా 1988-1991 మధ్య 390.38 ఎకరాల భూసేకరణ చేసింది. తదనంతరం 390 ఎకరాల్లో 285.17 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్‌వేసి 1327 ప్లాటు వేశారు. సుధీర్ఘకాలంపాటు విక్రయించారు. ఈ క్రమంలో తొలుత కొంత నగదు చెల్లించి నిర్ణీత కాలంలో రిజిష్టర్ చేయించుకుని పలుప్లాట్లను రద్దు చేశారు. 390 ఎకరాల భూమిలో ఖాళీ ఉన్న 105 ఎకరాల భూమిలో 24 ఎకరాలు ఇంటర్నేషనల్ కిక్రెట్ స్టేడియానికి, మరో 22.72 ఎకరాలు అరిహంత్ఇండోఅఫ్రికన్ ఇన్ఫ్రా డెవలపర్స్‌కు కేటాయించారు. దానిలో సదరు సంస్థ సింగ్‌పూర్ టౌన్షిప్ నిర్మించాలని కసరత్తు చేసింది. అలాగే 40 ఎకరాలను ఐటీ సెజ్‌గా గుర్తించి ఐటీసంస్థలకు కేటాయించడం కోసం ఉంచారు. దీంతో ఐటీ సంస్థలు రాకపోవటంతో సెజ్‌ను రద్దుచేసి కేటాయించిన భూమిని ఉడా తిరిగి వెనక్కి తీసుకుంది. దీంతో ఉడాకు ఆ భూమి నిల్వ భూమిగా ఉంది. మరోవైపు కేటాయింపులు జరిపిన భూముల్లో క్రికెట్స్టేడియం పనులు వేగంగా సాగుతున్నాయి. అలాగే సింగపూర్ టౌన్‌సిప్ 2007లో పనులు మొదలుకావల్సి ఉన్నప్పటికీ అన్ని అనుమతులు లేకపోవటంతో వాయిదా పడింది. ప్రస్తుతం అన్ని అనుమతులు పొందింది. కేటాయింపులు పోను, పార్కులు, ఇతర సౌకర్యాలకు కేటాయించినది పోనూ సుమారు 45 ఎకరాలు భూమి ఉడాకు మిగిలింది. వాస్తవానికి వీజీటీఎం ఉడా రెండేళ్ల కిత్రమే హౌసింగ్ ప్రాజెక్టు మొదలుపెట్టాలని భావించింది. అయితే ఉడాకు ల్యాండ్ బ్యాంకు లేకపోవడంతో ప్రాజెక్టు సాధ్యపడలేదు. దీంతో అప్పట్లో ఉడా వైస్చైర్మన్లు గుంటూరు, కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ భూములు కొన్నింటిని ఉడాకు కేటాయించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు.అయినప్పటికీ స్పందన లేకపోవటంతో పూర్తిగా హౌసింగ్ ప్రాజెక్టును వదిలేశారు.అయితే ప్రసుత్తం ఉడాలో 385 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 1000 చదరపు గజాలు మొదలుకుని 200 గజాల వరకు ఉన్న పాట్లున్నాయి. వీటిల్లో 1000 గజాల ప్లాట్లు 107, 200 గజాల ప్లాట్లు 106 అధికంగా ఉన్నాయి. వెంచర్లో ప్లాట్లు కావడంతో వాటిని విక్రయించే పనిలో ఉడా అధికారులు నిమగ్నమైయ్యారు. 45 ఎకరాల్లో... 45 ఎకరాల్లో మెగా హౌసింగ్ వెంచర్ నిర్మించాలని సన్నాహలు చేస్తున్నారు. వీటిలో ఇండిపెండెంట్ హౌస్‌లతోపాటు, అపార్ట్మెంట్లు, పార్కులు, ఇండోర్ స్టేడియం, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. 250 చదరపు గజాల విస్తీర్ణంలో ఇండిపెండెంట్ హౌస్ నిర్మాణం, అపార్ట్మెంట్లో సుమారు రెండువేల ప్లాట్ల నిర్మాణం చేసి మధ్యతరగతివర్గాలకు కేటాయింపు జరిపేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో జరగనున్న ఉడా పాలకవర్గ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. -
బెజవాడలోనే కార్యాలయాలు
- అన్ని పార్టీల సన్నాహాలు - ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ కార్యాలయం - బసవపున్నయ్య అధ్యయన కేంద్రంలో సీపీఎం - విశాలాంధ్ర భవన్‌నుంచి సీపీఐ - టీడీపీలోనూ మొదలైన చర్చ సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజన దాదాపు పూర్తికావడంతో అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ కార్యాలయాలను విజయవాడలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని ఎక్కడన్నది ఇప్పటికీ నిర్ణయించకపోయినా.. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉండవచ్చన్న వార్తలు రావడం, సీఎం క్యాంపు కార్యాలయం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండడంతో ఆయా పార్టీలు తమ రాష్ట్ర కార్యాలయాలను విజయవాడలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బీజేపీ ఎన్నికలకు ముందే విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. - కాంగ్రెస్ కూడా విజయవాడ కేంద్రంగానే కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. విజయవాడలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్నభవన్‌కు చారిత్రక నేపథ్యం ఉండడం, నగరం నడిబొడ్డున సువిశాలమైన స్థలం ఉండడంతో అక్కడే రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఇప్పటికే పీసీసీ నేతలు దీని వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయాన్ని ఉపయోగించాలా, దాన్ని పడగొట్టి కొత్తది నిర్మించాలా అన్న విషయంపై చర్చిస్తున్నారు. - సీపీఎం రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. కొత్తగా నిర్మిస్తున్న మాకినేని బసవపున్నయ్య అధ్యయన కేంద్రంలో రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకానుంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఈ అధ్యయన కేంద్రం కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో విజయవాడ నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు. - సీపీఐ కూడా గురువారం రెండు కమిటీలు ఏర్పాటు చేసుకోనుంది. ప్రస్తుతానికి రెండు కమిటీలు హైదరాబాద్‌లోని మక్దూమ్ భవన్‌లోనే ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలోని విశాలాంధ్ర భవనంలో ఏర్పాటు చేసి ఇక్కడినుంచే కార్యకలాపాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. - తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఇప్పటివరకు ఆ పార్టీకి సొంత కార్యాలయం లేకపోవడంతో కొత్తగా స్థలసేకరణ చేసి కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. -
రాజధానిపైనే చర్చ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర విభజనతో ఇక ప్రజల దృష్టి రాజధానిపై పడింది. ముఖ్యంగా జిల్లావాసులు తమకు దగ్గరలోనే రాజధాని ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాయలసీమకు, కోస్తాంధ్రకు మధ్యలో ప్రకాశం జిల్లా ఉండటంతో రాజధానిపైనే చర్చ ఈ ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉంటుందంటున్నారు. కేంద్రమంత్రి జైరాం రమేష్ మరో ఆరు నెలల్లో సీమాంధ్రకు రాజధాని వస్తుందని శుక్రవారం ప్రకటించడంతో రాజధానిపై చర్చ మరింత ఊపందుకుంది. కొంత మంది కర్నూలులో రాజధాని కావాలని కోరుతుండగా, మరికొందరు విశాఖపట్నంలో రావాలని ఆశిస్తున్నారు. ఇంకా తిరుపతిలో కొందరు, విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటవుతుందని మరికొందరు చెప్పుకుంటున్నారు. అయితే జిల్లావాసులు మాత్రం ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే రాజధాని నిర్మాణం అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. ప్రకాశం జిల్లా అటు నెల్లూరు, కర్నూలు, కడప, గుంటూరు జిల్లాలకు సరిహద్దుల్లో ఉంది. తమ ప్రాంతాల్లో రాజధాని కావాలనే వారు మధ్యస్థంగా ఒంగోలునే రాజధానిగా అంగీకరించే అవకాశం ఉందని అంటున్నారు. భౌగోళికంగా అనుకూలంగా ఉండటంతో పాటు రైలు మార్గం, జాతీయ రహదారి ఉండటం కలిసొచ్చే అంశం. నెల్లూరు జిల్లాలోని దుగరాజుపట్నానికి తోడు, జిల్లాలోని రామాయపట్నం పోర్టు కూడా వస్తే..రెండు పోర్టులు సమీపంలోనే ఉంటాయి. ఒంగోలు సమీపంలో వేలాది ఎకరాల ప్రభుత్వ స్థల ం ఉంది. ఒంగోలు కాకుండా ఇతర ప్రాంతాలకు రాజధాని వెళితే..సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. ఒంగోలులో రాజధాని ఏర్పడితే జిల్లా అభివృద్ధికి లోటు ఉండదని భావిస్తున్నారు. ఇప్పటికే విపరీతంగా ఉన్న భూముల ధరలు రాజధాని ఊహాగానాలతో మరింత పెరిగే అవకాశం ఉంది.