తెలుగు తమ్ముళ్ల ఆశలపై నీళ్లు!
పేనం మీద నుంచి పోయ్యిలో పడినట్లుంది ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకుల పరిస్థితి. రాజధాని ఏర్పాటుపై తమ మాటే చెల్లుతుందని ఊహాల్లో తేలియాడుతున్న పచ్చ నేతల ఆశలపై నిపుణుల కమిటీ నివేదిక నీళ్లు చల్లింది. ఇప్పటి వరకు ఏపీ రాజధాని విజయవాడ - గుంటూరు నగరాల మధ్యే అని ముఖ్యమంత్రి నుంచి మంత్రి వర్గ సహచరులు... చివరకు ఆ పార్టీ ఎంపీలు కూడా అంతా డంకా భజాయించి మరీ చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ - గుంటూరు నగరాల మధ్య అనుకూలంగా లేదని ప్రొఫెసర్ శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర హోం శాఖకు బుధవారం ఇచ్చిన నివేదికతో తెలుగు తమ్ముళ్లు నిర్ఘాంతపోయారు. అంతేకాదు విజయవాడ - గుంటూరు మధ్య సాగుభూమి అధికంగా ఉందని... రాజధాని ఏర్పాటు చేస్తే ఆ భూమికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కమిటీ పేర్కొనడంతో టీడీపీకి ఎన్నికల నిధులిచ్చిన రియాల్టర్లు నీరుకారిపోయారు.
అంతేకాకుండా గుంటూరు జిల్లా వినుకొండ - ప్రకాశం జిల్లాలోని మార్టూరుల మధ్య రాజధాని ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతం అంటూ ఆ కమిటీ తన నిర్ణయాన్ని హోం శాఖ ముందుంచింది. దాంతో ఇప్పటి వరకు విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతుందని టీడీపీ ప్రజాప్రతినిధులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. కానీ శివరామకృష్ణన్ కమిటీ వినుకొండ - మార్టూరు మధ్య రాజధాని అనే సరికి టీడీపీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయపడినట్లు అయింది. రాజధాని ఎంపికపై వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో, దానిపై తమ సర్కారు ఏవిధంగా స్పందింస్తుందోనని తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు. ఈ విభజన ఏమిటో.... కొత్త రాజధాని ఎక్కడో... అంతా... అంటూ గొణుకుంటున్నారు.