Martur
-
ప్రేయసికి వివాహం.. ప్రియుడి ఆత్మహత్య
మార్టూరు: ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని రాజుపాలెంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజుపాలెం తూర్పు ఎస్సీ కాలనీకి చెందిన బైరపోగు కాసియ్య, భూలక్ష్మి దంపతుల కుమారుడు కిశోర్ (21) బేల్దారి పని చేస్తుంటాడు. అతడు ఏడాది నుంచి అదే కాలనీకి చెందిన ఓ బాలికతో ప్రేమయాణం సాగిస్తున్నాడు. ఇంతలో ఐదు నెలల క్రితం అదే కాలనీకి చెందిన మరో యువకుడితో పెద్దలు బాలికకు వివాహం జరిపించారు. ఆమె గత వారం భర్తను వదిలి నీతోనే ఉంటానని కిశోర్ ఇంటికి వచ్చింది. ఆమె భర్త తరఫు బంధువుల ఫిర్యాదుతో విషయం పోలీసుస్టేషన్‌కు చేరింది. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు కలిసి బాలికకు, కిశోర్‌కు రెండు రోజుల క్రితం పోలీసుస్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరి దారిన వారిని పంపించారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిశోర్ టవల్‌తో ఇంటి సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా గమనించిన బంధువులు అతడిని మార్టూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కిశోర్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి విచారించి వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రిలో కిశోర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. -
‘అయిదేళ్లలో రూ. 5 వేల కోట్ల అప్పు’
సాక్షి, ప్రకాశం : మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పచ్చ చొక్కాల నేతలకు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మార్టూరు బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. అయిదు సంవత్సరాల్లో చంద్రబాబు రూ.5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను మోసగించారని విమర్శించారు. అలాగే ఉగాది నాటికి డ్వాక్రా రుణాలను మొత్తం మాఫీ చేస్తామని అన్నారు. రాజధాని పేరులో వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన చంద్రబాబు తన అనుచరులకు ధారాదత్తం చేశారని మత్స్యశాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణ దుయ్యబట్టారు. లక్ష కోట్ల రుపాయలు ఒకే ప్రాంతంలో పెట్టే కంటే అభివృద్ధిని వికేంద్రికరణ చేయడంతో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దిశ చట్టాన్ని ఏపీ అమలు చేస్తూ నిందితలకు 21 రోజుల్లో శిక్ష పడే చట్టాన్ని తెచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. -
పేరుకే ఆదర్శ గ్రామం..
సాక్షి, మార్టూరు (ప్రకాశం): ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన డబ్బు గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అవినీతి అక్రమాలకు గురైందో బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన మండలస్థాయి సామాజిక తనిఖీ సమావేశంలో బహిర్గతమైంది. గత నెల 28 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో నిర్వహించిన తనిఖీల వివరాలను మార్టూరు మండల స్థాయి సమావేశంలో బుధవారం వెల్లడించారు. గత సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 2019 మార్చి 31 లోపు మండలంలోని 16 గ్రామాల్లో 17 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు జరగ్గా అందులో 4వ వంతు అంటే సుమారు 4 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు తనిఖీ బృందం నివేదికల ద్వారా వెల్లడి కావడం గమనార్హం. ఇందుకు మండల ఏపీఓ రమేష్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ఆయా గ్రామాల ఫీల్డు అసిస్టెంట్లు పాత్రధారులు కాగా గత ప్రభుత్వ హయాంలో ఆయా గ్రామాలలో చక్రం తిప్పిన టీడీపీ నేతలు సూత్రధారులు కావడం గమనార్హం. పేరుకే ఆదర్శ గ్రామం మార్టూరు మండలంలోని డేగరమూడి గ్రామం పేరుకు ఆదర్శ గ్రామం. గత సంవత్సరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ గ్రామానికి వచ్చి తనకు ఇక్కడే ఉండిపోవాలని అనిపించినట్లు చెప్పడం విశేషం. ఆ గ్రామంలో జరిగిన అవినీతిపై గ్రామ మహిళలు 50 మందికి పైగా బుధవారం మార్టూరు వచ్చి తమ గ్రామంలో జరిగిన అవినీతి అరాచకాల గురించి జిల్లా అధికారుల ముందు కుండబద్దలు కొట్టినట్లు ఏకరువు పెట్టడం గమనార్హం. డేగరమూడి గ్రామ ఫీఈల్డు అసిస్టెంట్ జాగర్లమూడి పుష్పలతకు బదులు ఆమె భర్త అంజయ్య ఉపాధి హామి పనులలో మొత్తం తమ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులతో కలిసి లక్షలలో అవినీతికి పాల్పడిన వైనం జిల్లా అధికారులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుత మండల ఉపాధ్యక్షురాలు స్థానిక ఎమ్మెల్యే ఏలూరి స్వగ్రామం కోనంకికి చెందిన టీడీపీ నాయకురాలు కోటపాటి కోమలి వేదికపై కూర్చుని సమావేశానికి పదేపదే అడ్డు పడడంతో ప్రస్తుత అధికార పార్టీ కార్యకర్తలు ఆమెను మధ్యలోనే అడ్డుకున్నారు. కోనంకిలో ఆమెకు చెందిన చెత్త నుంచి సంపదను తయారు చేసే కేంద్రంలో లక్షల్లో అవినీతి చోటు చేసుకున్నట్లు తనిఖీ సిబ్బంది వెల్లడించడం గమనార్హం. మండలంలోని అవినీతిలో సగం వలపర్ల గ్రామంలోనే చోటుచేసుకున్నట్లు తనిఖీబృందం వెల్లడించింది. బబ్బేపల్లి గ్రామంలో ఒకే రైతుకు చెందిన 3.75 ఎకరాల భూమిలో ఏకంగా 7 ఫారంపాండ్లు తవ్వించి ఆ రైతుకు 1.35 లక్షలు చెల్లించడం గమనార్హం. అదే గ్రామంలో అసలు నిర్మాణమే జరగని ఇంటిపని చేసినందుకు 5 వేల రూపాయలు చెల్లించిన ట్లు సిబ్బంది తెలిపారు. రాత్రి 10 గంటల వరకు జరిగిన సమావేశంలో అనేక అవకతవకలకు సంబంధించిన వివరాలను సిబ్బంది నివేదికలు వెల్లడించాయి. కార్యక్రమంలో ఏపీడీ మీరావలి, విజిలెన్సు అధికారి నాగరాజు అసిస్టెంట్ పీడీ ఉదయ్ కుమార్ తనిఖీ అధికారులు జెఎస్ రాజు, రమేష్, ఎస్ఆర్పీ నాగార్జున ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు కుంటలో పడి యువకులు మృతి
ఒంగోలు : కొంగలను పడుతూ ప్రమాదవశాత్తూ కుంటలో పడి ఇద్దరు యవకులు మరణించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలం గన్నవరం రోడ్డులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి...వారికి కుంటలో నుంచి బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు ప్రభుదాసు (25), సురేష్ (19) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వై దిస్ కొలవెరి?
ధనుష్ హీరోగా నటించిన 3 సినిమా గుర్తుందా? సినిమా పెద్ద హిట్ కాకపోయినా.. అందులో ధనుష్ స్వయంగా పాడిన 'వై దిస్ కొలవెరి కొలవెరి' పాట మాత్రం యూట్యూబ్‌లో పెద్ద సంచలనంగా మారింది. అందులో హీరో కనపడిన వాళ్లను చంపాలనే ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతుంటాడు. ప్రకాశం జిల్లాలో కూడా సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. మార్టూరు: మానసిక సంఘర్షణకు లోనై నిండు జీవితాన్ని అర్ధాంతరంగా చాలించిన బ్యాంకు అధికారి ఉదంతమిది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొత్తవలసకు చెందిన గురుగుపల్లి యువకిశోర్ (27) ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని వలపర్ల భారతీయ స్టేట్ బ్యాంకులో ఫీల్డు ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. స్థానిక నాగరాజుపల్లి రోడ్డులోని ఎస్ఆర్ రెసిడెన్సీ మూడో ఫ్లోర్ 302వ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు. యువకిశోర్కు గత నెల 16న వివాహమైంది. శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్తున్నానని భార్య దివ్యను గత వారమే పుట్టింటికి పంపాడు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో యువకిశోర్కు ఆయన భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు. చెల్లెలు బ్యాంకు మేనేజర్‌కు, ఇంటి యజమానికి ఫోన్ చేయడంతో అతడు ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సై నాగమల్లేశ్వరరావు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు మొదట బాత్రూమ్లో చిన్న కత్తితో రెండు చేతుల మణికట్టు భాగంలో కోసుకుని అనంతరం సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని మరణించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. యువకిశోర్ సూసైడ్‌నోట్ ఆత్మహత్యకు ముందు యువకిశోర్ సూసైడ్‌నోట్ రాశాడు. తనకు గత నెల 16వ తేదీన దివ్యతో వివాహం జరిగిందని, అప్పటి నుంచి తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నానని, తన భార్యను గొంతు నులిమి చంపాలని పదే పదే ఆలోచనలు వస్తున్నట్లు రాశాడు. నిద్ర సమయంలో నాలుగు సార్లు లేచి గొంతు నులిమి చంపాలని ప్రయత్నించి అతికష్టం మీద విరమించుకున్నట్లు రాశాడు. భార్యను చంపాలనే కోరిక రోజు రోజుకూ బలపడుతుందని, తాను ఎప్పటికైనా ఆమెను చంపుతానని, ఇతరులను చంపే హక్కు మనకు లేదని, అందుకే తానే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాశాడు. -
మార్టూరులో భారీ దొంగతనం
పర్చూరు(ప్రకాశం): ప్రకాశం జిల్లా మార్టూరులో ఆదివారం అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. పకడ్బందీగా స్కెచ్ వేసి వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. బాధితుల కథనం ప్రకారం...స్థానిక నాగరాజుపల్లి రోడ్డులోని కాకతీయ స్కూల్ పక్కన నివాసం ఉండే మువ్వ అంజయ్య ఇంట్లోకి ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఐదుగురు గుర్తు తెలియని దుండగులు ప్రవేశించారు. అంతా ముసుగులు వేసుకుని, లుంగీలనే గోచీలుగా ధరించారు. వస్తూనే పొరుగునే ఉన్న ఇళ్ల తలుపులతోపాటు అంజయ్య ఇంటిపై అంతస్తులో ఉంటున్న అతని కుమారుడి గదికి కూడా బయట నుంచి గొళ్లాలు వేసి, బైండింగ్ వైరుతో చుట్టారు. ఆ తర్వాత అంజయ్య పోర్షన్‌లోనే ఉండే అతని మామ సత్యనారాయణ గదికికూడా బయటి నుంచి గొళ్లెం పెట్టి బైండింగ్ వైరుతో చుట్టేశారు. ఆతర్వాత అంజయ్య దంపతులను కత్తితో బెదిరించి, కాళ్లు చేతులు కట్టిపడేశారు. ఇంట్లో ఉన్న బీరువాను వరండాలోకి తీసుకొచ్చి అందులో ఉన్న ఒక కిలో వెండి, 64 సవర్ల బంగారు నగలతోపాటు, ఒక లక్ష నగదును ఎత్తుకుపోయారు. సోమవారం ఉదయం బాధితుని ఫిర్యాదు మేరకు డీఎస్పీ జయరామరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్వ్కాడ్‌ను రప్పించనున్నట్లు ఆయన తెలిపారు. -
తెలుగు తమ్ముళ్ల ఆశలపై నీళ్లు!
పేనం మీద నుంచి పోయ్యిలో పడినట్లుంది ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకుల పరిస్థితి. రాజధాని ఏర్పాటుపై తమ మాటే చెల్లుతుందని ఊహాల్లో తేలియాడుతున్న పచ్చ నేతల ఆశలపై నిపుణుల కమిటీ నివేదిక నీళ్లు చల్లింది. ఇప్పటి వరకు ఏపీ రాజధాని విజయవాడ - గుంటూరు నగరాల మధ్యే అని ముఖ్యమంత్రి నుంచి మంత్రి వర్గ సహచరులు... చివరకు ఆ పార్టీ ఎంపీలు కూడా అంతా డంకా భజాయించి మరీ చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ - గుంటూరు నగరాల మధ్య అనుకూలంగా లేదని ప్రొఫెసర్ శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర హోం శాఖకు బుధవారం ఇచ్చిన నివేదికతో తెలుగు తమ్ముళ్లు నిర్ఘాంతపోయారు. అంతేకాదు విజయవాడ - గుంటూరు మధ్య సాగుభూమి అధికంగా ఉందని... రాజధాని ఏర్పాటు చేస్తే ఆ భూమికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కమిటీ పేర్కొనడంతో టీడీపీకి ఎన్నికల నిధులిచ్చిన రియాల్టర్లు నీరుకారిపోయారు. అంతేకాకుండా గుంటూరు జిల్లా వినుకొండ - ప్రకాశం జిల్లాలోని మార్టూరుల మధ్య రాజధాని ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతం అంటూ ఆ కమిటీ తన నిర్ణయాన్ని హోం శాఖ ముందుంచింది. దాంతో ఇప్పటి వరకు విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతుందని టీడీపీ ప్రజాప్రతినిధులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. కానీ శివరామకృష్ణన్ కమిటీ వినుకొండ - మార్టూరు మధ్య రాజధాని అనే సరికి టీడీపీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయపడినట్లు అయింది. రాజధాని ఎంపికపై వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో, దానిపై తమ సర్కారు ఏవిధంగా స్పందింస్తుందోనని తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు. ఈ విభజన ఏమిటో.... కొత్త రాజధాని ఎక్కడో... అంతా... అంటూ గొణుకుంటున్నారు. -
ఆరు ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ నిలిపివేత
ఒంగోలు : ప్రకాశం జిల్లా మార్టురులో ఆరు ఎంపీటీసీ స్థానాలకు అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. హైకోర్టు ఆదేశాలతో కౌంటాంగ్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం. కోనపల్లి, కొమరోలు, చీమకుర్తి, గిద్దలూరు, పెద్దారవీడు, అద్దంకి ఎంపీటీసీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. -
మంత్రి డొక్కా కారు అడ్డగింత
మార్టూరు, న్యూస్‌లైన్ : రోడ్డు విస్తరణలో భాగంగా స్థానిక జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 325 షాపులను తొలగించాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్టూరు గ్రామచావిడిలో భవనాలకు సంబంధించిన యజమానులకు గురువారం నోటీసులు కూడా అందించారు. సెంటుకు రూ. 50 వేలు చెల్లించనున్నట్లు తెలుసుకున్న భవన యజమానులు మార్కెట్ విలువ ప్రకారం రూ. సెంటు 30 లక్షల వరకు ఉందని, ప్రభుత్వం రూ. 50 వేలు చెల్లించటాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై శుక్రవారం ధర్నా చేపట్టారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు అదే మార్గంలో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వెళ్తున్నారని సమాచారం అందుకున్న షాపుల యజమానులు అప్రమత్తమయ్యారు. మార్టూరు సమీపంలోకి రాగానే డొక్కా కారును అడ్డగించి తమకు న్యాయం చేయాలని కారును చుట్టుముట్టారు. కారు నుంచి దిగిన మంత్రి.. పరిహారం పెంచేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడంతో షాపుల యజమానులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో మార్టూరు మాజీ సర్పంచ్ బొప్పూడి శ్రీనివాసరావు, హనుమంతరావు, షాపుల యజమానులు పాల్గొన్నారు.