సమావేశంలో పాల్గొన్న అధికారులు
సాక్షి, మార్టూరు (ప్రకాశం): ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన డబ్బు గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అవినీతి అక్రమాలకు గురైందో బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన మండలస్థాయి సామాజిక తనిఖీ సమావేశంలో బహిర్గతమైంది. గత నెల 28 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో నిర్వహించిన తనిఖీల వివరాలను మార్టూరు మండల స్థాయి సమావేశంలో బుధవారం వెల్లడించారు. గత సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 2019 మార్చి 31 లోపు మండలంలోని 16 గ్రామాల్లో 17 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు జరగ్గా అందులో 4వ వంతు అంటే సుమారు 4 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు తనిఖీ బృందం నివేదికల ద్వారా వెల్లడి కావడం గమనార్హం. ఇందుకు మండల ఏపీఓ రమేష్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ఆయా గ్రామాల ఫీల్డు అసిస్టెంట్లు పాత్రధారులు కాగా గత ప్రభుత్వ హయాంలో ఆయా గ్రామాలలో చక్రం తిప్పిన టీడీపీ నేతలు సూత్రధారులు కావడం గమనార్హం.
పేరుకే ఆదర్శ గ్రామం
మార్టూరు మండలంలోని డేగరమూడి గ్రామం పేరుకు ఆదర్శ గ్రామం. గత సంవత్సరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ గ్రామానికి వచ్చి తనకు ఇక్కడే ఉండిపోవాలని అనిపించినట్లు చెప్పడం విశేషం. ఆ గ్రామంలో జరిగిన అవినీతిపై గ్రామ మహిళలు 50 మందికి పైగా బుధవారం మార్టూరు వచ్చి తమ గ్రామంలో జరిగిన అవినీతి అరాచకాల గురించి జిల్లా అధికారుల ముందు కుండబద్దలు కొట్టినట్లు ఏకరువు పెట్టడం గమనార్హం. డేగరమూడి గ్రామ ఫీఈల్డు అసిస్టెంట్ జాగర్లమూడి పుష్పలతకు బదులు ఆమె భర్త అంజయ్య ఉపాధి హామి పనులలో మొత్తం తమ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులతో కలిసి లక్షలలో అవినీతికి పాల్పడిన వైనం జిల్లా అధికారులను విస్మయానికి గురిచేసింది.
ప్రస్తుత మండల ఉపాధ్యక్షురాలు స్థానిక ఎమ్మెల్యే ఏలూరి స్వగ్రామం కోనంకికి చెందిన టీడీపీ నాయకురాలు కోటపాటి కోమలి వేదికపై కూర్చుని సమావేశానికి పదేపదే అడ్డు పడడంతో ప్రస్తుత అధికార పార్టీ కార్యకర్తలు ఆమెను మధ్యలోనే అడ్డుకున్నారు. కోనంకిలో ఆమెకు చెందిన చెత్త నుంచి సంపదను తయారు చేసే కేంద్రంలో లక్షల్లో అవినీతి చోటు చేసుకున్నట్లు తనిఖీ సిబ్బంది వెల్లడించడం గమనార్హం. మండలంలోని అవినీతిలో సగం వలపర్ల గ్రామంలోనే చోటుచేసుకున్నట్లు తనిఖీబృందం వెల్లడించింది.
బబ్బేపల్లి గ్రామంలో ఒకే రైతుకు చెందిన 3.75 ఎకరాల భూమిలో ఏకంగా 7 ఫారంపాండ్లు తవ్వించి ఆ రైతుకు 1.35 లక్షలు చెల్లించడం గమనార్హం. అదే గ్రామంలో అసలు నిర్మాణమే జరగని ఇంటిపని చేసినందుకు 5 వేల రూపాయలు చెల్లించిన ట్లు సిబ్బంది తెలిపారు. రాత్రి 10 గంటల వరకు జరిగిన సమావేశంలో అనేక అవకతవకలకు సంబంధించిన వివరాలను సిబ్బంది నివేదికలు వెల్లడించాయి. కార్యక్రమంలో ఏపీడీ మీరావలి, విజిలెన్సు అధికారి నాగరాజు అసిస్టెంట్ పీడీ ఉదయ్ కుమార్ తనిఖీ అధికారులు జెఎస్ రాజు, రమేష్, ఎస్‌ఆర్‌పీ నాగార్జున ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment