రోడ్డు విస్తరణలో భాగంగా స్థానిక జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 325 షాపులను తొలగించాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే.
మార్టూరు, న్యూస్‌లైన్ : రోడ్డు విస్తరణలో భాగంగా స్థానిక జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 325 షాపులను తొలగించాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్టూరు గ్రామచావిడిలో భవనాలకు సంబంధించిన యజమానులకు గురువారం నోటీసులు కూడా అందించారు. సెంటుకు రూ. 50 వేలు చెల్లించనున్నట్లు తెలుసుకున్న భవన యజమానులు మార్కెట్ విలువ ప్రకారం రూ. సెంటు 30 లక్షల వరకు ఉందని, ప్రభుత్వం రూ. 50 వేలు చెల్లించటాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై శుక్రవారం ధర్నా చేపట్టారు.
గుంటూరు నుంచి ఒంగోలు వైపు అదే మార్గంలో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వెళ్తున్నారని సమాచారం అందుకున్న షాపుల యజమానులు అప్రమత్తమయ్యారు. మార్టూరు సమీపంలోకి రాగానే డొక్కా కారును అడ్డగించి తమకు న్యాయం చేయాలని కారును చుట్టుముట్టారు. కారు నుంచి దిగిన మంత్రి.. పరిహారం పెంచేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడంతో షాపుల యజమానులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో మార్టూరు మాజీ సర్పంచ్ బొప్పూడి శ్రీనివాసరావు, హనుమంతరావు, షాపుల యజమానులు పాల్గొన్నారు.