వై దిస్ కొలవెరి?
ధనుష్ హీరోగా నటించిన 3 సినిమా గుర్తుందా? సినిమా పెద్ద హిట్ కాకపోయినా.. అందులో ధనుష్ స్వయంగా పాడిన 'వై దిస్ కొలవెరి కొలవెరి' పాట మాత్రం యూట్యూబ్‌లో పెద్ద సంచలనంగా మారింది. అందులో హీరో కనపడిన వాళ్లను చంపాలనే ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతుంటాడు. ప్రకాశం జిల్లాలో కూడా సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది.
మార్టూరు: మానసిక సంఘర్షణకు లోనై నిండు జీవితాన్ని అర్ధాంతరంగా చాలించిన బ్యాంకు అధికారి ఉదంతమిది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొత్తవలసకు చెందిన గురుగుపల్లి యువకిశోర్ (27) ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని వలపర్ల భారతీయ స్టేట్ బ్యాంకులో ఫీల్డు ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. స్థానిక నాగరాజుపల్లి రోడ్డులోని ఎస్‌ఆర్ రెసిడెన్సీ మూడో ఫ్లోర్ 302వ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు. యువకిశోర్‌కు గత నెల 16న వివాహమైంది. శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్తున్నానని భార్య దివ్యను గత వారమే పుట్టింటికి పంపాడు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో యువకిశోర్‌కు ఆయన భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు. చెల్లెలు బ్యాంకు మేనేజర్‌కు, ఇంటి యజమానికి ఫోన్ చేయడంతో అతడు ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సై నాగమల్లేశ్వరరావు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు మొదట బాత్‌రూమ్‌లో చిన్న కత్తితో రెండు చేతుల మణికట్టు భాగంలో కోసుకుని అనంతరం సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని మరణించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
యువకిశోర్ సూసైడ్‌నోట్
ఆత్మహత్యకు ముందు యువకిశోర్ సూసైడ్‌నోట్ రాశాడు. తనకు గత నెల 16వ తేదీన దివ్యతో వివాహం జరిగిందని, అప్పటి నుంచి తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నానని, తన భార్యను గొంతు నులిమి చంపాలని పదే పదే ఆలోచనలు వస్తున్నట్లు రాశాడు. నిద్ర సమయంలో నాలుగు సార్లు లేచి గొంతు నులిమి చంపాలని ప్రయత్నించి అతికష్టం మీద విరమించుకున్నట్లు రాశాడు. భార్యను చంపాలనే కోరిక రోజు రోజుకూ బలపడుతుందని, తాను ఎప్పటికైనా ఆమెను చంపుతానని, ఇతరులను చంపే హక్కు మనకు లేదని, అందుకే తానే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాశాడు.