ప్రకాశం జిల్లా మార్టూరులో ఆదివారం అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు.
పర్చూరు(ప్రకాశం): ప్రకాశం జిల్లా మార్టూరులో ఆదివారం అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. పకడ్బందీగా స్కెచ్ వేసి వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. బాధితుల కథనం ప్రకారం...స్థానిక నాగరాజుపల్లి రోడ్డులోని కాకతీయ స్కూల్ పక్కన నివాసం ఉండే మువ్వ అంజయ్య ఇంట్లోకి ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఐదుగురు గుర్తు తెలియని దుండగులు ప్రవేశించారు.
అంతా ముసుగులు వేసుకుని, లుంగీలనే గోచీలుగా ధరించారు. వస్తూనే పొరుగునే ఉన్న ఇళ్ల తలుపులతోపాటు అంజయ్య ఇంటిపై అంతస్తులో ఉంటున్న అతని కుమారుడి గదికి కూడా బయట నుంచి గొళ్లాలు వేసి, బైండింగ్ వైరుతో చుట్టారు. ఆ తర్వాత అంజయ్య పోర్షన్‌లోనే ఉండే అతని మామ సత్యనారాయణ గదికికూడా బయటి నుంచి గొళ్లెం పెట్టి బైండింగ్ వైరుతో చుట్టేశారు. ఆతర్వాత అంజయ్య దంపతులను కత్తితో బెదిరించి, కాళ్లు చేతులు కట్టిపడేశారు. ఇంట్లో ఉన్న బీరువాను వరండాలోకి తీసుకొచ్చి అందులో ఉన్న ఒక కిలో వెండి, 64 సవర్ల బంగారు నగలతోపాటు, ఒక లక్ష నగదును ఎత్తుకుపోయారు. సోమవారం ఉదయం బాధితుని ఫిర్యాదు మేరకు డీఎస్పీ జయరామరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్వ్కాడ్‌ను రప్పించనున్నట్లు ఆయన తెలిపారు.