సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర విభజనతో ఇక ప్రజల దృష్టి రాజధానిపై పడింది. ముఖ్యంగా జిల్లావాసులు తమకు దగ్గరలోనే రాజధాని ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాయలసీమకు, కోస్తాంధ్రకు మధ్యలో ప్రకాశం జిల్లా ఉండటంతో
రాజధానిపైనే చర్చ ఈ ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉంటుందంటున్నారు. కేంద్రమంత్రి జైరాం రమేష్ మరో ఆరు నెలల్లో సీమాంధ్రకు రాజధాని వస్తుందని శుక్రవారం ప్రకటించడంతో రాజధానిపై చర్చ మరింత ఊపందుకుంది. కొంత మంది కర్నూలులో రాజధాని కావాలని కోరుతుండగా, మరికొందరు విశాఖపట్నంలో రావాలని ఆశిస్తున్నారు.
ఇంకా తిరుపతిలో కొందరు, విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటవుతుందని మరికొందరు చెప్పుకుంటున్నారు. అయితే జిల్లావాసులు మాత్రం ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే రాజధాని నిర్మాణం అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. ప్రకాశం జిల్లా అటు నెల్లూరు, కర్నూలు, కడప, గుంటూరు జిల్లాలకు సరిహద్దుల్లో ఉంది. తమ ప్రాంతాల్లో రాజధాని కావాలనే వారు మధ్యస్థంగా ఒంగోలునే రాజధానిగా అంగీకరించే అవకాశం ఉందని అంటున్నారు.
భౌగోళికంగా అనుకూలంగా ఉండటంతో పాటు రైలు మార్గం, జాతీయ రహదారి ఉండటం కలిసొచ్చే అంశం. నెల్లూరు జిల్లాలోని దుగరాజుపట్నానికి తోడు, జిల్లాలోని రామాయపట్నం పోర్టు కూడా వస్తే..రెండు పోర్టులు సమీపంలోనే ఉంటాయి. ఒంగోలు సమీపంలో వేలాది ఎకరాల ప్రభుత్వ స్థల ం ఉంది. ఒంగోలు కాకుండా ఇతర ప్రాంతాలకు రాజధాని వెళితే..సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. ఒంగోలులో రాజధాని ఏర్పడితే జిల్లా అభివృద్ధికి లోటు ఉండదని భావిస్తున్నారు. ఇప్పటికే విపరీతంగా ఉన్న భూముల ధరలు రాజధాని ఊహాగానాలతో మరింత పెరిగే అవకాశం ఉంది.
రాజధానిపైనే చర్చ
Published Sat, Feb 22 2014 2:41 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement