ఇవిగో భూములు
విజయవాడ పరిసరాల్లో 12,000 ఎకరాల గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా జిల్లా కలెక్టర్ నివేదిక
రాజధానికా..? కేంద్ర ప్రభుత్వ సంస్థలకా..?
విజయవాడ: విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటవుతుందనే ప్రచారం నేపథ్యంలో.. ఈ ప్రాంతంలో ప్రభుత్వ, అటవీ భూముల గుర్తింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే విజయవాడ, నూజివీడు పరిసరాల్లో 12,000 ఎకరాల అటవీ భూముల వివరాలను సేకరించిన కృష్ణా జిల్లా యంత్రాంగం ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. విజయవాడ శివారున విజయవాడ రూరల్ మండల పరిధిలోని నున్న ప్రాంతంలో 6,500 ఎకరాల అటవీ భూములు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. విజయవాడ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో నున్న, పాతపాడు, కొత్తూరుతాడేపల్లి గ్రామాల పరిధిలో ఒకే ప్రాంతంలో ఈ అటవీ భూమి ఉండడం విశేషం. ఈ ప్రాంతంలో భూములు ఉన్నట్లు తెలిసినా వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మొన్నటివరకూ అధికారుల వద్ద కూడా లేవు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట భూముల గుర్తింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టి వాటి వివరాలను సేకరించారు. కొత్తూరుతాడేపల్లి వద్ద 1,000 ఎకరాల భూమిని గుర్తించారు.
ఇదిగాక నున్న పరిసరాల్లో 4,000 ఎకరాల భూమిని గుర్తించారు. 1,500 ఎకరాలు పాతపాడు ప్రాంతంలో ఉంది. ఈ 6,500 ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డులు, మ్యాప్‌లను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి సమర్పించింది. ఇక నూజివీడు పరిసర ప్రాంతాల్లో 5,500 ఎకరాల వివరాలను కూడా సేకరించింది. మొత్తంగా ఈ 12,000 ఎకరాల వివరాలను కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందనరావు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఈ అటవీ భూములను డీనోటిఫై చేసి స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణానికి వినియోగించుకుంటారా, లేక ప్రభుత్వ సంస్థలకా అనేది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది.