అక్కడో... ఇక్కడో... ఎక్కడో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయి నెల అయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అనే అంశంపై ప్రొ. శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించి వెళ్లింది. అలాగే రాజధాని ఎక్కడ అనే అంశంపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆ కమిటీతో పలుమార్లు భేటీ ఆయ్యారు. అయినా రాజధానిపై మాత్రం స్పష్టత రాలేదు. ఇదే విషయాన్ని సాక్షాత్తూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రే బల్ల గుద్ది మరీ చెప్పారు. మీడియా మాత్రం రాజధాని అక్కడో... ఇక్కడో... ఎక్కడో అంటూ రోజుకో ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని వార్త కథనాలు వెల్లువలా వెలువరిస్తుంది. మీడియా కథనాలతో ఆంధ్రప్రదేశ్లోని రియాల్టర్లకు కాసుల వర్షం కురుస్తుంది. మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలోని రియాల్టర్ల 'దశ' తాడు వదిలి నేల మీద విసిరిన బొంగరంలా గిరగిర 'తిరుగుతుంది'.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఏర్పాటు అవుతుందని గతంలో పుకార్లు షికార్లు చేశాయి. దాంతో ఆ ప్రాంతంలో గజం భూమి విలువ లక్షలకు చేరుకుంది. మరోవైపు రాష్ట్ర వాణిజ్య రాజధాని విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న ఆగిరిపల్లిలో రాజధాని ఏర్పాటవుతుందంటూ మీడియాలో పలు కథనాలు హల్చల్ చేశాయి. దాంతో ఇటు విజయవాడ, అటు నూజివీడు, హనుమాన్ జంక్షన్, గన్నవరం పరిసర ప్రాంతాల్లో భూమి ధరలు చుక్కలనంటాయి. ఇంతలో గుంటూరు జిల్లా అమరావతి రాజధాని అయితే అన్ని విధాల శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందంటూ మరో కథనం వెలువడింది.
ఇంకో వైపు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం చేస్తామంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయంటూ వెల్లడించారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రకటించిన పలు జాతీయ విద్యా సంస్థలు తన సొంత నియోజక వర్గం భీమిలి పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు ఆయన తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దాంతో భీమిలిలో భూముల ధరలు రెక్కలు వచ్చి ఆకాశంలో మేఘాలు చాటున దోబూచులాడుతున్నాయి.
భీమిలిలోపాటు విశాఖపట్నం జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే అగ్రగామి జిల్లాగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు గంటా తెలిపారు. రాష్ట్ర విభజనతో ఇప్పటికే ఉత్సాహంతో ఉన్న సదరు జిల్లాలకు చెందిన రియాల్టర్లకు ఇప్పుడు మరింత జోరు మీద ఉన్నారు.