గంటా రాయబారంతో మెత్తబరిచేందుకు యత్నాలు
తన సీటు కోసం మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు: అనితతోపాటు గంటాపైనా రగిలిపోతున్న కాపులు
అసలు గంటా కాపు కాదంటూ విమర్శలు
వైఎస్సార్‌సీపీకే కాపునాడు మద్దతు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి అనిత కాపులతో వ్యవహరించిన తీరును... కాపు నేతలు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. నాడు చెప్పుతో కొట్టి కేసులు పెట్టి వేధించిన అనిత... ఇప్పుడు ఓట్లు కావాలంటూ పైరవీలు చేస్తుండటం విమర్శలపాలవుతోంది. తమ సొంత సామాజికవర్గాన్ని వేధించిన అనితకు మద్దతుగా భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గానికి వచ్చి సర్దిచెప్పేందుకు ప్రయత్నించడంపై ఆ వర్గాలు మండిపడుతున్నాయి. అనితను వ్యతిరేకించినందుకు ఏకంగా పార్టీ నుంచి కొద్దిమంది నేతలు సస్పెండ్ అయ్యారు.
తమ వెనుక ఉండి నడిపించిన గంటా... తీరా తన సీటు కోసం తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మళ్లీ అనితకు మద్దతివ్వాలంటూ పాయకరావుపేట నియోజకవర్గానికి వచ్చి మరీ చెప్పడాన్ని కాపులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు గంటా కాపు కాదని కాపునాడు తీవ్రంగా విమర్శలు చేసింది. కాపు సామాజికవర్గానికి పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చిన వైఎస్సార్‌సీపీకే తమ మద్దతని స్పష్టంగా ప్రకటించింది. మొత్తంగా తమ సామాజికవర్గాన్ని తీవ్రంగా అవమానించిన అనితతోపాటు ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన గంటాకూ తమ దెబ్బ రుచి చూపిస్తామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అనిత బాధితులెందరో...!
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత నియోజకవర్గంలోని నేతలందరిపైనా అధికారం చెలాయించారు. కాపు నేతలపై మరింత కక్షపూరితంగా వ్యవహరించారు. ఏకంగా కాపు నేతలను చెప్పుతో కొట్టడమే కాకుండా కేసులు బనాయించి మరీ వేధించారు. కాపుల మద్దతుతో 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనిత మంగవరం గ్రామానికి చెందిన ఒక కాపు యువకుడ్ని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టారు. తనపై తప్పుగా వ్యాఖ్యలు చేశాడన్న ఆగ్రహంతో చెప్పుతో కొట్టి కాపు జాతిని ఘోరంగా అవమానించారు. మహిళా ఎమ్మెల్యేను కించపరిచే విధంగా మాట్లాడటం తప్పే కానీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా ఆ సామాజిక వర్గం పెద్దల సమక్షంలో మందలించడం దీనికి పరిష్కారం. ఇవేమీ చేయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేనన్న అహంకారంతో వ్యవహరించారు.
చెప్పుతో కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో పెద్ద సంచలనం అయింది. అదే విధంగా ఆనాడు ఆమె గెలుపులో కీలక పాత్ర పోషించిన కాపు సామాజికవర్గానికి చెందిన జనసేన సీనియర్ నేత గెడ్డం బుజ్జిపై అత్యాచారం కేసు పెట్టించింది. అతన్ని అరెస్టు చేయించడానికి తన అధికారాన్ని అంతా ఉపయోగించింది. బుజ్జికి చెందిన భూములపై సిట్‌కు ఫిర్యాదు చేసింది. అప్పట్లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు బుజ్జికి అండగా నిలబడటంతో ఆయన అరెస్టు నుంచి బయటపడ్డారు. తన గెలుపునకు సహకరించిన మరో కాపు నేత తోట నగేష్ పట్ల కూడా ఆమె నిర్లక్ష్య వైఖరి అవలంబించింది. అనిత ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఈ ఇద్దరు నేతలు తీవ్ర అవమానాలను ఎదుర్కొన్నారు. అలాగే పట్టణానికి చెందిన మరో ఇద్దరు కాపు టీడీపీ నాయకులు గొర్లె రాజబాబు, మజ్జూరి నారాయణరావుల పట్ల కూడా అనిత కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. ఈ ఇద్దరు నాయకులు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉండటం, వారు వేసిన ఫ్లెక్సీలో తన ఫొటో లేదన్న కారణంగా వారిద్దరినీ గత ఏడాది పార్టీ నుంచి సస్పెండ్ చేయించింది.
గంటా మధ్యవర్తిత్వంపై కాపుల్లో ఆగ్రహం
అనిత చేతిలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న గెడ్డం బుజ్జి పలుసార్లు జనసేన సమావేశాలు ఏర్పాటు చేసి అనితకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని, ఓడించి తీరుతామంటూ గతంలో ప్రకటనలు చేశారు. కాపులను చెప్పుతో కొట్టి... తమ నేతపై రేప్ కేసు పెట్టిందని పదే పదే బుజ్జి అనుచరులు గుర్తు చేసుకుంటున్నారు. బుజ్జి మెత్తబడడాన్ని కూడా ఆయన అనుచరులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. తోట నగేష్ జనసేనలో చేరి అనితకు మద్దతుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా కాపు సామాజికవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటివరకు గంటా వర్గంగా ముద్రపడి... అనితను తీవ్రంగా వ్యతిరేకించిన గొర్లె రాజబాబు, నారాయణరావులు ఏకంగా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.
అయితే గంటా వీరి మధ్య రాజీ కుదిర్చారు. ‘నీకు సీటు ఇవ్వాలంటే పాయకరావుపేటలో నీ వర్గాన్ని అనితకు మద్దతు ఇచ్చేలా చేయాల్సిందే’నంటూ చంద్రబాబు నుంచి గంటాకు ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన స్వార్థం కోసం తనను నమ్ముకున్న వారి మనోభావాలను సైతం పట్టించుకోకుండా గంటా వ్యవహరించాడంటూ ఆ సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు గంటాది అసలు కాపు సామాజికవర్గమేనా అని కాపునాడు నేతలు నేరుగా ప్రశి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు అత్యధిక సీట్లను కేటాయించిన వైఎస్సార్‌సీపీకి మద్దతిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment