విజయవాడలోని బీజేపీ కార్యాలయం
- అన్ని పార్టీల సన్నాహాలు
- ఆంధ్రరత్న భవన్‌లో కాంగ్రెస్ కార్యాలయం
- బసవపున్నయ్య అధ్యయన కేంద్రంలో సీపీఎం
- విశాలాంధ్ర భవన్‌నుంచి సీపీఐ
- టీడీపీలోనూ మొదలైన చర్చ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజన దాదాపు పూర్తికావడంతో అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ కార్యాలయాలను విజయవాడలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని ఎక్కడన్నది ఇప్పటికీ నిర్ణయించకపోయినా.. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉండవచ్చన్న వార్తలు రావడం, సీఎం క్యాంపు కార్యాలయం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండడంతో ఆయా పార్టీలు తమ రాష్ట్ర కార్యాలయాలను విజయవాడలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బీజేపీ ఎన్నికలకు ముందే విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
- కాంగ్రెస్ కూడా విజయవాడ కేంద్రంగానే కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. విజయవాడలోని సిటీ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్నభవన్‌కు చారిత్రక నేపథ్యం ఉండడం, నగరం నడిబొడ్డున సువిశాలమైన స్థలం ఉండడంతో అక్కడే రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఇప్పటికే పీసీసీ నేతలు దీని వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయాన్ని ఉపయోగించాలా, దాన్ని పడగొట్టి కొత్తది నిర్మించాలా అన్న విషయంపై చర్చిస్తున్నారు.
- సీపీఎం రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. కొత్తగా నిర్మిస్తున్న మాకినేని బసవపున్నయ్య అధ్యయన కేంద్రంలో రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకానుంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఈ అధ్యయన కేంద్రం కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో విజయవాడ నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు.
- సీపీఐ కూడా గురువారం రెండు కమిటీలు ఏర్పాటు చేసుకోనుంది. ప్రస్తుతానికి రెండు కమిటీలు హైదరాబాద్‌లోని మక్దూమ్ భవన్‌లోనే ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలోని విశాలాంధ్ర భవనంలో ఏర్పాటు చేసి ఇక్కడినుంచే కార్యకలాపాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
- తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఇప్పటివరకు ఆ పార్టీకి సొంత కార్యాలయం లేకపోవడంతో కొత్తగా స్థలసేకరణ చేసి కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.