బడా ‘ఉడా’ | he possibility of the state Division of the Central University of | Sakshi
Sakshi News home page

బడా ‘ఉడా’

Published Sun, Jun 1 2014 1:20 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

బడా ‘ఉడా’ - Sakshi

బడా ‘ఉడా’

  •   కొత్త రాజధాని నేపథ్యం
  •   విజయవాడ-గుంటూరు జంటనగరాలుగా అభివృద్ధి
  •   విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి మధ్య మెట్రో రైలు నిర్మాణం
  •   రెండు జిల్లాల్లో ఉడా పరిధి 7065 కిలోమీటర్లు
  • గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య రాజకీయ రాజధాని నిర్మాణం జరుగుతుందనేది ప్రస్తుతం ఉన్న బలమైన వాదన. అది కూడా అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు చెబుతున్న మాట. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మరింత బలం చేకూర్చారు. విజయవాడ-గుంటూరులను జంటనగరాలుగా అభివృద్ధి చేస్తామని ఇటీవలే ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు దీటుగా రెండు నగరాలను అభివృద్ధిచేస్తామన్న ప్రకటన రెండు జిల్లాల ప్రజల్లో రాజధాని ఆశల్ని రెట్టింపు చేసింది.  రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో ఏర్పాటుచేసే మెట్రో రైలును విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటుచేయాలని కూడా నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రెండు నగరాల స్వరూపంతోపాటు వీజీటీఎం ఉడా పరిధిలోని ప్రాంత స్వరూపమే మారనుంది. సీమాంధ్రలోనే నంబర్‌వన్ నగరంగా విజయవాడ అవతరించే దిశగా అవకాశాలు రెట్టింపు అయ్యాయి.
     
    సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో ఇప్పుడు నేతలు, అధికారుల అందరి అలోచన రాజధాని ప్రకటనపైనే ఉంది. జూన్ పది తర్వాత రాజధాని ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముందుగా ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న వసతులు, తర్వాత సమకూరే సౌకర్యాలు, కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు.. ఇలా అన్ని  అంశాలు పరిగణనలోకి వస్తున్నాయి. వెంకయ్యనాయుడు తొలి ప్రకటనలోనే విజయవాడ, గుంటూరుకు ప్రాధాన్యత దక్కడం విశేషం.
     
    శివరామకృష్ణన్ కమిటీ పరోక్ష సంకేతాలు

    ఇప్పటికే రెండు జిల్లాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ రాజకీయ రాజధాని ఇక్కడే ఉంటుంది అని పరోక్ష సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు రాజకీయ రాజధానికే ఓటు వేశారు. నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా గుంటూరు-విజయవాడ మధ్య రాజధానిృఉంటుందని రెండు జిల్లాల నేతలకు తెలిపారు. దీనికి బలం చేకూర్చేలా రాష్ట్ర వైద్యవిధాన పరిషత్‌ను విజయవాడలో ఏర్పాటుచేస్తున్నారు.

    ఆర్టీసీ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం లభించింది. దీంతోపాటు నూతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు ఇప్పటికే విజయవాడ, రాజధాని నిర్మాణం జరుగుతుందన్న మంగళగిరి ప్రాంతంలో పర్యటించారు. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు. అందుకే ఈ ప్రాంతంలోనే రాజధాని నిర్మిస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందనేది వారి యోచన.
     
    అభివృద్ధి పథంలో రెండు జిల్లాలు..
     
    విద్య, వాణిజ్య, వ్యాపార, వైద్యపరంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు సీమాంధ్రలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో  మొదటి ఐదుస్థానాల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలు నిలుస్తాయి. ఈ ప్రాంత ప్రజల తలసరి ఆదాయం సుమారు రూ.96 వేలుగా ఉంది. వీటితోపాటు రాజధాని నిర్మాణానికి  అవసరమయ్యే ఇసుక, సిమెంట్, ఐరన్ తదితర  మెటీరియల్ ఉత్పత్తి చేసే అన్ని ప్రధాన కంపెనీలు ఇక్కడే ఉన్నాయి.

    రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూములు కూడా రెండు జిల్లాల్లోనూ కలిపి సుమారు లక్ష ఎకరాల వరకు ఉంటుందని అంచనా. జాతీయ రహదారుల సమీపంలో సుమారు 10వేల ఎకరాలు భూమి ఉంది. వీటన్నింటితోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాలు అధికార తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. రెండు జిల్లాల్లో అధికారపార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు ఐదుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు.
     
    ఏపీఎస్పీ బెటాలియన్‌లో డీజీపీ కార్యాలయం..
     
    మంగళగిరి సమీపంలో 134 ఎకరాల్లో ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ క్యాంపు ఉంది. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో భవనాలు ఇప్పటికే ఉన్నాయి. నూతన ఆంధ్రప్రదేశ్‌కు డీజీపీ కార్యాలయం తక్షణమే ఏర్పాటుకు ఈ బెటాలియన్ అనువుగా ఉంది. దీంతో సీఎం క్యాంపు కార్యాలయం, డీజీపీ కార్యాలయం ఇక్కడే ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.
     
    ఉడా పరిధిలో చాలినంత భూమి..

     
    ఇదంతా ఉడా పరిధిలోనే ఉంది. వీజీటీఎం ఉడా విజయవాడ, గుంటూరు నగరపాలకసంస్థలతోపాటు రెండు జిల్లాలో 9 మున్సిపాలిటీలు 1400 గ్రామాల్లో విస్తరించి ఉంది. ఉడాకు తాడేపల్లిలోని అమరావతి టౌన్‌షిప్‌లో 45 ఎకరాల భూమి మాత్రమే ఉంది.  విజయవాడ -గుంటూరు మధ్య సుమారు 1000 ఎకరాల వరకు రెవెన్యూ భూమి ఉంది. ఈ పరిణామాల క్రమంలో ఇటీవల రెండు జిల్లాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ ఉడాకు సంబంధించిన అన్ని వివరాలతోపాటు సమగ్ర నివేదికను తీసుకున్నారు.

    ఉడా వైస్‌చైర్మన్ పి.ఉషాకుమారి ఉడా పరిధి, కార్యకలాపాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం రూపొందుతున్న ఉడా మాస్టర్‌ప్లాన్‌పై విస్తృతంగా చర్చించడంతోపాటు పరిధి పెంపు వల్ల రాజధాని నిర్మాణానికి  ఎంతవరకు దోహదపడుతుందనే దానిపై చర్చించారు. గుంటూరు జిల్లా పర్యటనకు వెళుతూ శివరామకృష్ణన్ కమిటీ  మంగళగిరి  ప్రాంతాన్ని  పరిశీలించి వాటి రికార్డుల్ని జిల్లా అధికారుల నుంచి తీసుకున్నారు.
     
    మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఏర్పాట్లు...
     
    ఉడా పరిధిలోనే రాజధాని నిర్మాణం జరిగే అవకాశం ఉండటంతో ఉడా యంత్రాంగం కూడా  ఆ దిశగా కసరత్తు సాగిస్తోంది. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన సాగుతుంది. వచ్చే ఏడాదికి ప్లాన్ ఉడాకు అందే అవకాశం ఉంది. రాజధాని ఏర్పాటు హడావుడి నేపథ్యంలో ప్లాన్ త్వరితగతిన పూర్తిచేయించాలని చూస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ప్రధానంగా నివాసప్రాంతాల గుర్తింపు, పారిశ్రామిక ప్రాంతాల గుర్తింపు, వాణిజ్య ప్రాంతాల గుర్తింపు, ప్రభుత్వ స్థలాలను గుర్తించి సేకరించి ఉడాకు ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేసుకోవటానికి ప్రాధాన్యం,  తదితర అంశాలను మాస్టర్‌ప్లాన్‌లో చేర్చారు. వీటితో పాటు ప్రతి నివాస ప్రాంతంలో పార్కుల ఏర్పాటుకు స్థలాలను ప్లాన్‌లో గుర్తిస్తారు.
     
    ఉడా విస్తీర్ణం పెంపునకు కసరత్తు..
     
    ఉడా పరిధిలో సుమారు రెండు లక్షల ఎకరాలు ప్రైవేట్ భూములు, వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. వీటితోపాటు అవసరమైతే పరిధి పెంచాలనే యోచన కూడా చేస్తున్నారు. ఉడా పరిధిని  మరో 15 కిలోమీటర్లు పెంచితే ఏలూరు, మచిలీపట్నంతో పాటు పలు పట్టణాలు ఉడాలోకి వస్తాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అదే జరిగితే  ఉడా పరిధి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే కాకుండా పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలకు విస్తరించటంతోపాటు సీమాంధ్రలోనే పట్టణాభివృద్ధి సంస్థలో అగ్రగామిగా ఉంటుంది.
     
     సీఎం క్యాంపు కార్యాలయంగా ఆచార్య నాగార్జున వర్సిటీ..

     ఈ పరిణామాల క్రమంలో గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని  సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చటానికి సన్నాహాలు చేస్తున్నారు. చంద్రబాబు సొంత టీమ్ ఇప్పటికే  వర్సిటీకి సంబంధించిన అన్ని వివరాలను సేకరించి బ్లూప్రింట్‌తోసహా చంద్రబాబుకు పంపినట్లు సమాచారం. వర్సిటీ 294 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దానిలో సుమారు 100 ఎకరాల్లో వివిధ బ్లాకులు ఇప్పటికే నిర్మితమై ఉన్నాయి.
     
     కీలకం కానున్న ఉడా పాత్ర..

     ఈ రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న వీజీటీఎం ఉడా రాజధాని నిర్మాణంలో కీలక భూమిక పోషించనుంది. గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతలోనే రాజధాని నిర్మాణం ఉంటుందని పరోక్షంగా సంకేతాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, డీజీపీ కార్యాలయం రెండూ గుంటూరు జిల్లాలోని మంగళగిరి సమీపంలోనే ఏర్పాటు కానుండటంతో రాజధాని నిర్మాణం కూడా ఇదే ప్రాంతంలో జరుగుతుందనే బలమైన వాదన వినిపిస్తోంది. ఉడా మాస్టర్‌ప్లానే నూతన రాజధానికి కూడ మాస్టర్‌ప్లాన్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. భవిష్యత్తు 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉడా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement