సాక్షి, అమరావతి: మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామటూ గతంలో ఎన్నో గొప్పలు చెప్పిన చంద్రబాబు నేడు అందుకు పొంతన లేని మాటలు మాట్లాడటం చర్చనీయాంశమైంది. అమరావతిని సింగపూర్ చేస్తా, జపాన్ చేస్తా అంటూ ఏ దేశం వెళ్తే ఆ దేశం పేర్లు చెప్పిన సీఎం చంద్రబాబు.. నేడు అమరావతి గురించి మాట్లాడుతూ.. ఇది ఇటు పల్లెకాదు.. అటు పట్నం కాదని, ఆ కారణంగానే మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వలేదేమోనంటూ కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికినట్లు తెలుస్తోంది.
శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడంతో అమరావతి స్థాయిని దిగజార్చి మాట్లాడుతున్న వ్యక్తి.. ఏ స్థాయి రాజధానిని నిర్మిస్తారో చెప్పాలంటున్నారు. విశాఖ పెద్ద సిటీనే కదా అని మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం చంద్రబాబును అడగగా.. స్పందన కరువైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయా శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపుల వివరాలపై చంద్రబాబు ప్రశ్నించగా, తమకు డేటా అందుబాటులో లేదని చెప్పడం అధికారుల వంతయింది. కేంద్ర అధికారులతో మాట్లాడి శాఖలకు కేటాయించిన నిధుల వివరాలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఏపీ కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలు
- ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఆరు ఎకనామిక్ సిటీల నిర్మాణానికి ఆమోదం తెలిపిన కేబినెట్
- కృష్ణాజిల్లా చెవుటూరు, పినపాకలో రూ.2706 కోట్లతో గుంటూరు జిల్లా మంగళగిరి, విశాఖ జిల్లా అచ్యుతాపురంలలో రూ.13,580 కోట్లతో ఎకనామిక్ సిటీ నిర్మాణం
- కంటెంట్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటుకే కేబినెట్ ఆమోదం
- గుంటూరులో తల్లీపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- ఆస్పత్రుల్లో వసతుల మెరుగుకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.2,100 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం
- అర్బన్ హౌసింగ్‌లో రూ.38 వేల కోట్ల ఖర్చు చేయాలని నిర్ణయం
- అగ్రిగోల్డ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment