కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..
► ఇదీ అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు పరిస్థితి
► మెట్రో రైలు ప్రాజెక్టు ముందుకు సాగేనా?
► పీఐబీ అనుమతులు మంజూరుకు వెనుకంజ
► అయినా భూసేకరణకు సిద్ధమైన జిల్లా అధికారులు
అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో గందరగోళం కొనసాగుతోంది. నిబంధన మేరకు అన్నీ అడ్డంకులు ఎదురవుతుండటంతో చివరకు ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు (పీఐబీ) ప్రశ్నల పరంపర ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ప్రాజెక్టు పట్టాలెక్కేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. నిబంధనలను సరళతరం చేస్తే మెట్రో రైలు అమరావతిలో పరుగులెత్తడం పెద్దకష్టం కాదని రాష్ట్ర అధికారులు చెప్పుకొస్తున్నారు.
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సుముఖత వ్యక్తం చేయడం లేదు. రూ.6,847 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 20 శాతం చొప్పున మిగిలిన 60 శాతం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) భరిస్తుంది. కేంద్రం తన వాటా నిధులు ఇచ్చే విషయంలోనూ, ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసే అంశంలోనూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు (పీఐబీ) పలు సందేహాలను లేవనెత్తుతోంది.
ఇటీవల ఢిల్లీలో పీఐబీ అధికారులు సమావేశమై ఏఎంఆర్‌సీ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం, రాబడిపై చర్చించి, ప్రాజెñక్టుకు నిధులు ఖర్చు చేసే విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మెట్రో రైలును తొలుత ఆరు కార్లలో (బోగీలు) నడపాలని ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పుడు ఏఎంఆర్‌సీ అధికారులు దీన్ని మూడు కార్లకు కుదించారు.
విజయవాడకు మెట్రో అవసరమా ?
విజయవాడ నగరానికి మెట్రో ప్రాజెక్టు అవసరమా? అనే అంశం పీఐబీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మెట్రో ప్రాజెక్టులకు ఫైనాన్షియల్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటరŠన్స్ (ఎఫ్‌ఐఆర్‌ఆర్) 8 శాతం కంటే ఎక్కువ ఉంటేనే మెట్రో ప్రాజెక్టు లాభదాయకమని, అందువల్ల వాటికి నిధులు మంజూరు చేయవచ్చని అధికారులు నిర్ణయిస్తారు. అయితే విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు 3 శాతంకంటే ఎఫ్‌ఐఆర్‌ఆర్ ఎక్కువగా లేదు.
అందువల్ల ఈ ప్రాజెక్టు మంజూరు చేయడం వల్ల లాభం ఉండబోదని పీఐబీ అధికారులు అంచనాలు వేస్తున్నారు. 20 లక్షల జనాభా దాటిన నగరాలకు మాత్రమే మెట్రో ప్రాజెక్టు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు అంచనా. అయితే విజయవాడ నగర జనాభా కేవలం 10.50 లక్షలు మాత్రమే. చుట్టుపక్కల గ్రామాల జనాభా అంతా కలుపుకున్నా మరో రెండు మూడు లక్షల కంటే ఎక్కువ మంది ఉండరు. అందువల్ల మెట్రోను పూర్తిస్థాయిలో ఉపయోగించకపోవచ్చని భావిస్తున్నారు.
బిజీ వేళల్లో కనీసం (పీక్ డైరెక్షన్ ట్రాఫిక్–పీహెచ్‌పీడీటీ) మెట్రోలో కనీసం 20 వేల మంది ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే విజయవాడలోని బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులోని రెండు కారిడార్లలోనూ కలిపి 13 వేల మంది కంటే ఎక్కువ మంది ప్రయాణించరని అధికారులు అంచనా వేసినట్లు తెలిసింది. అందువల్ల మెట్రో ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసే విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రూ.100 కోట్లు మెట్రో రైలు ప్రాజెక్టుకు కేటాయించారు.
మరో వైపు భూసేకరణ
ఒక వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధులు మంజూరు అవుతాయో లేదో తెలియదు కానీ, రాష్ట్ర ప్రభుత్వం, ఏఎంఆర్‌సీ అధికారులు, కృష్ణా జిల్లా యంత్రాంగం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రాజెక్టు ప్రారంభం కావడంలో జాప్యం కావడంతో రూ.7,212 కోట్లు ఖర్చు అవుతుందని మెట్రో అధికారులు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ కోసం రూ.300 కోట్లు మంజూరు చేయడంతో పాటు తనవాటా నిధులుగా రూ.1,800 కోట్లు అప్పుగా బ్యాంకుల నుంచి తీసుకునేందుకు జీవో జారీ చేసింది.
ఇక ఏఎంఆర్‌సీ అధికారులు ఇప్పటికే ఫ్రాన్స్‌కు చెందిన ఏఎఫ్‌డీ, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రెండు సంస్థలు కలిసి సుమారు రూ.3,600 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే కేంద్ర వాటా గురించి నిర్ధిష్టంగా తెలియడం లేదు.
అనుమతులు రాకుండానే..
కేంద్రం నిధులు, అనుమతులు రాకుండానే ఈ పాజెక్టుకు అవసరమైన 76 ఎకరాల భూమి సేకరించేందుకు జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో భూ యజమానుల్లో ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా విజయవాడకు సమీపంలోని నిడమానూరు గ్రామంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం రూ.50 ఎకరాలు సేకరించాలనే నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే తమ వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉన్నాయని, మెట్రో ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రారంభించి, ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు.