మెట్రో రైలు ప్రాజెక్టు
అమరావతిలో మెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారం కొలిక్కి వచ్చే పరిస్థితులు కనుచూపుమేరలో కానరావడంలేదు. కేంద్రం నిధులు ఇవ్వని వైనం.. రాష్ట్రం డొంకతిరుగుడు మంత్రాంగం వెరసి నవ్యాంధ్రలో మెట్రో రైలు కథ.. కంచికేనా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మెట్రో టెండర్ల వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల లోపాయికారీ వ్యవహారాలు నచ్చక ఇప్పటికే డీఎంఆర్‌సీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. మొత్తంగా పరిశీలిస్తే పాలకుల చిత్తశుద్ధి లోపం ఈ ప్రాజెక్టు విషయంలో స్పష్టమవుతోంది.
సాక్షి, విజయవాడ : అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు ఊహలకే పరిమితమవుతోంది. నిధులు కేటాయించడానికి కేంద్రం ఏమాత్రం ముందుకు రాకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం కేవలం సర్వేలకే పరిమితం చేయడం, భూసేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో మెట్రో రైలు ప్రాజెక్టు కథ కంచికి చేరినట్లేనని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆఖరు బడ్జెట్‌లో సైతం కేంద్రం మెట్రో రైలుకు ఒక్క రూపాయి కేటాయించకపోయినా అధికార పార్టీ ఎంపీలకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం రాష్ట్ర అభివృద్ధిపై వారి చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది.
టెండర్ల దశలో అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వం
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటును ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) జూలై 2014లో చేపట్టింది. సర్వే చేసే ఏలూరు రోడ్డులో నిడమానూరు వరకు, బందరు రోడ్డులో పెనమలూరు వరకు 26.03 కి.మీ. మేర రెండు కారిడార్స్‌తో డీపీఆర్ (సమగ్ర నివేదిక)ను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. దాని ప్రకారం టెండర్లు పిలిచారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఎల్ అండ్ టీ సంస్థకు 30 శాతం ఎక్కువ రేటుకు టెండర్లు ఇవ్వడానికి డీఎంఆర్‌సీ సలహాదారు ఈ.శ్రీధరన్ అంగీకరించలేదు. టెండర్లలో ఎక్కువ కంపెనీలు పాల్గొనేందుకు వీలుగా తిరిగి టెండర్లు పిలవాలంటూ ఆయన సూచించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చకపోవడంతో డీఎంఆర్‌సీని రాష్ట్ర ప్రభుత్వం పక్కకు తప్పించింది. దీంతో మెట్రో రైలు ప్రాజెక్టు పక్కదారి పట్టింది.
డీపీఆర్ దశ దాటని లైట్ మెట్రో రైలు
రూ.6,769 కోట్ల వ్యయంతో మీడియం మెట్రో ఏర్పాటు చేసే కంటే, దాని కంటే తక్కువ వ్యయంతో లైట్ మెట్రో రైలు ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. దీంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులతో కలసి చైనాలో పర్యటించి లైట్ మెట్రో గురించి అధ్యయనం చేసి వచ్చారు. అయితే నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుకు పెద్దగా ఇచ్చింది ఏమీలేదు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు మెట్రో అధికారులు అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపులు జరపగా, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ రూ.2,500 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. మీడియం మెట్రోకు బదులుగా జక్కంపూడి కాలనీ నుంచి మూడు కారిడార్ల లైట్ మెట్రో రైలు ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేసే సంస్థను ఎంపిక చేసేందుకు కేఎఫ్‌డబ్ల్యూ సిద్ధమైంది.
అయితే మన దేశంలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు ఎక్కడా లేకపోవడం, ఆంధ్రాలోనే తొలిసారిగా ప్రారంభించాల్సిరావడంతో దీనిపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. కేఎఫ్‌డబ్ల్యూ లైట్ మెట్రో రైలు డీపీఆర్ తయారీకి సంబంధించి టెండర్లను గత జూలైలో పిలిచింది. ఐదు కంపెనీలు టెండర్లలో పాల్గొన్నా ఇప్పటి వరకు ఏ సంస్థకు డీపీఆర్ తయారు చేసే బాధ్యతను కేఎఫ్‌డబ్ల్యూ అప్పగించలేదు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడంతో అంతర్జాతీయ సంస్థ కూడా ముందుకు రావడం లేదని మెట్రో రైలు కంపెనీ అధికార వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment