ఆక్రమణలో అడవులు
- జిల్లాలో 1.23 లక్షల ఎకరాల్లో విస్తరించిన అడవులు
- కొండపల్లి మినహా దట్టమైన అడవులు నిల్
- జిల్లాలో భూకొరత నేపథ్యంలో అటవీ భూములపై సర్కారు ఆరా
- భూములపై నివేదిక సమర్పించిన జిల్లా అధికారులు
జిల్లాలో భారీగా అటవీ భూములు ఉన్నాయి. దాదాపు మూడు అటవీ రేంజ్‌ల పరిధిలో 1.23 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అయితే దట్టమైన అడవులు అంతంత మాత్రమే. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు లేవని జిల్లా అటవీ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే ఇదంతా రికార్డులకే పరిమితం. వాస్తవానికి వేల ఎకరాల అటవీ భూములు ఆక్రమణచెరలో ఉన్నాయి.
సాక్షి, విజయవాడ : విజయవాడ - గుంటూరు నగరాల మధ్య రాష్ట్ర రాజధాని ఎర్పాటవుతుందన్న ప్రచారం కొన్ని నెలలుగా సాగుతోంది. అటవీ ప్రాంతం అయితే రాజధాని నిర్మాణనికి అనువుగా ఉంటుందని, వేల ఎకరాల భూమి ఒకే చోట లభిస్తుందన్న వాదన ముందుకొచ్చింది. ఈ క్రమంలో రెండు జిల్లాలో భూముల వివరాలను ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా నివేదికల రూపంలో సేకరించింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా కలెక్టర్ అటవీశాఖ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని ప్రభుత్వానికి పంపారు. జిల్లాలో నివాస, సాగు, ప్రయివేటు భూములు మినహా ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ఉన్నాయి.
జిల్లాలో మొత్తం 5.91 లక్షల ఎకరాల భూములు ఉండగా వీటిలో 3.28 లక్షల ఎకరాల భూముల్లో సాగు, నివాసాలు ఇలా అనేకం ఉన్నాయి. ప్రభుత్వ భూములు రికార్డుల ప్రకారం 2.62 లక్షల ఎకరాలు ఉన్నా వీటిలో పనికి వచ్చే భూములు కేవలం 742 ఎకరాలు మాత్రమే. ఈ మేరకు గత వారం జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం జిల్లాలో విజయవాడ, మైలవరం, నూజివీడు అటవీ రేంజ్‌ల పరిధిలో 1,23,402.81 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి.
జిల్లాలో కొండపల్లి ప్రాంతలో మాత్రమే దట్టమైన అడవులు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఉన్నవి సాధారణ అడవులే. జిల్లాలో సుమారు 16 మండలాల్లో 95 గ్రామాలకు సమీపంలో అటవీప్రాంతం ఉంది. అయితే అటవీప్రాంత స్వరూపాన్ని బట్టి రిజర్వ్ ఫారెస్ట్‌గా కొన్నింటిని నిర్ణయించారు. ఈ క్రమంలో నూజి వీడు రేంజ్ పరిధిలో మూడు రిజర్వు ఫారెస్ట్‌లు, విజయవాడ రేంజ్ పరిధిలో తొమ్మిది రిజర్వు ఫారెస్ట్‌లు, మైలవరం డివిజన్‌లో నాలుగు రిజర్వు ఫారెస్ట్‌లు ఉన్నాయి.
నూజివీడు రేంజ్‌లో నూజివీడు, చాట్రాయి, విసన్నపేట, హనుమాన్ జంక్షన్, బాపులపాడు, మైలవరం రేంజ్ పరిధిలో ఎ.కొండూరు, తిరువూరు, విజయవాడ రేంజి పరిధిలో విజయవాడ, ఇబ్రహీంపట్నం, వీరులపాడు, చందర్లపాడు, జగ్గయ్యపేట తదితర మండలాల సమీపంలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. అయితే వందల ఎకరాల భూములు 99 ఎళ్ల లీజులో ఉన్నాయి. రికార్డుల ప్రకారం జిల్లాలో లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నా వాస్తవానికి 70 వేల ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఆక్రమణలే అధికం
ప్రధానంగా నూజివీడు రేంజ్ పరిధిలో అటవీప్రాంతలో ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. విజయవాడ, మైలవరం రేంజి పరిధిలోనూ ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల అటవీప్రాంతం అన్యాక్రాంతమయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా నూజివీడు రేంజ్ పరిధిలో సుమారు 20 వేల ఎకరాలు ఆక్రమణల చెరలో ఉన్నాయి. కొన్ని చోట్ల గ్రావెల్ కోసం అటవీభూములను అక్రమార్కులు తవ్వేశారు. కొంతమంది ఆక్రమణదారులు అటవీప్రాంతాన్ని సాగు భూమిగా మార్చారు.
ప్రధానంగా మామిడి, పామాయిల్, జామ, ఇతర ఉద్యాన పంటలు, పండ్ల తోటలను అటవీప్రాంతంలో సాగు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులుకే ఈ వివరాలు తెలిసినా పూర్తిస్థాయిలో కేసులు నమోదు చేయకుండా చూసీచూడనట్లు వ్యవహరనిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంమీద రికార్డుల కంటే జిల్లాలో తక్కువ అటవీ ప్రాంతం ఉండటం గమనార్హం.