రాబందుల రెక్కల చప్పుడు
అక్షర తూణీరం
‘‘ఏం చేసుకుంటార్రా ఈ పాపపు సొమ్మంతా మూటకట్టుకుని? కారే రాజులు, రాజ్యముల్ కలుగవే... వారేరీ సిరి మూటగట్టుకుని పోవం జాలిరే’’ అంటూ ఒక పండు ముసలి కంటతడి పెట్టుకున్నాడు.
‘గుడిని మింగేవాడికి తలుపులు అప్పడాలు’ - చాలా చక్కటి సామెత. నిజం ఉంది. చమత్కారం ఉంది. పాపభీతి, దైవభీతి అట్టి వారికి ఉండనే ఉండవని కూడా చెబుతోందీ సామెత. ‘విశ్వవిఖ్యాత నగరంగా నయా కాపిటల్’ అనగానే రాబందులు వచ్చి వాలాయి. ఎన్ని తమాషాలు చెయ్యాలో దండుకోవడానికి అన్ని తమాషాలు చేస్తున్నాయి. రాబందులు పోట్లాడుకోవు. కాట్లాడుకోవు. సమష్టిగా పీక్కు తినడం వాటి నైజం. మన నేతలకి స్ఫూర్తి రాబందులే. కాకపోతే రాబందులు ఒట్లేసి ఒడ్డున పడే ప్రయత్నం చెయ్యవు. ప్రెస్‌మీట్లు పెట్టి ఎదురుదాడికి దిగవు. అంతేతేడా.
‘‘ఏం చేసుకుంటార్రా ఈ పాపపు సొమ్మంతా మూటకట్టుకుని? కారే రాజులు, రాజ్యముల్ కలుగవే... వారేరీ సిరి మూటగట్టుకుని పోవం జాలిరే’’ అంటూ ఒక పండు ముసలి కంటతడి పెట్టుకున్నాడు. ‘‘మీ భూమి ఏమైనా అన్యాక్రాంతమైందా?’’ అని అడిగాను. ‘‘అబ్బే, అదేం లేదు. నేను శిస్తు కట్టే పని ఎప్పుడో తప్పించుకున్నా’’ అన్నాడాయన హాయిగా నవ్వుతూ. ‘‘ఆలూ లేదు చూలూలేదు, కొడుకు పేరు సోమలింగమన్నట్టు - అప్పుడే అమరావతి బ్రాండ్ ఇమేజ్ గురించి గొప్పలు చెబుతాడేంటి? ఏడాదిగా మాటలతో బొమ్మలు చూపిస్తున్నారు’’ అంటూ ఆ పెద్దాయన బోలెడు చికాకుపడ్డాడు.
ఆనాడు శంకరాచార్యులు లాంటి జగద్గురువులు జాతికి కౌన్సెలింగ్ చేశారు. అంతా మాయ, మిథ్య. బంగారు లేడి వెనుక పరుగెత్తవద్దని బోధించారు. జీవితం నీటి బుడగని విశదపరిచారు. తప్పుడు పనులు చేస్తే నూనెలో వేగిస్తారనీ; స్వర్గం, నరకం, మరుజన్మలు ఉన్నాయినీ తెలియచెప్పారు. ఇప్పుడేమైందంటే అక్రమార్కులకు తగిన గురువులు వచ్చారు. వాళ్లు అవినీతికి అక్రమాలకు తగిన భాష్యాలు చెప్పి, ఉత్సాహ పరుస్తున్నారు. ‘‘దేవాలయ నిర్మాణంలో, నిర్వహణలోనే మా వంతు మేం నొక్కేసినప్పుడు క్యాపిటల్ వ్యవహారంలో మొహమాటపడతామా!’’ అని ఒక నేత నిజం చెప్పాడు. ‘‘సైన్డ్ భూములు, అసైన్డ్ భూములు కూడా కొట్టేశారండీ’’ అంటూ ఓ చిన్న రైతు ప్రాసతో బాధపడ్డాడు. ‘‘రాబందులు ఒక మహా విధ్వంసాన్ని కోరుకుంటాయి. యాభై వేల ఎకరాల సస్యక్షేత్రాన్ని బీడు పెట్టడం మహా విధ్వంసం’’ అంటూ తన సహజ ధోరణిలో ఆవేశపడ్డాడు స్థానిక కామ్రేడ్.
ద్వాపరంలో మహాభారత సంగ్రామానికి భేరీ వేశారు. ఇంతలో ఒక చిన్నకుర్రాడు విల్లు, మూడు బాణాలతో అక్కడికి వచ్చాడు. ఎవరని ఆరా తీశారు. ‘‘నేను ఘటోత్కచుని కుమారుణ్ణి. నా పేరు బర్బరీకుడు. కేవలం ముగ్గురి వల్ల ఈ మహా సంగ్రామం జరగబోతోంది. వాళ్లు ధృతరాష్ట్రుడు, సుయోధనుడు, కృష్ణుడు. ఆ ముగ్గుర్ని చంపేస్తే ఈ విధ్వంసకాండ ఉండదు. అందుకే మూడు బాణాలతో వచ్చాను’’ అన్నాడు. కృష్ణుడు ఉలిక్కిపడ్డాడు. ‘‘బావా ధర్మనందనా! ఇప్పుడు మనవాడినొకరిని బలి ఇవ్వాలి. లేకుంటే విజయం వరించదు. అందుకు బర్బరీకుడు యోగ్యుడు’’ అన్నాడు.
బర్బరీకుడికి వ్యూహం అర్థమైంది. కానీ, ‘‘కడదాకా ఈ మహాసంగ్రామం చూసే వీలు కల్పించండి!’’ అంటూ అర్థించాడు. శిరసుని వేరు చేసి ఎత్తయిన సిడిపై ఉంచారు. యుద్ధం ఆరంభమైంది. పద్మవ్యూహంలో అభిమన్యుడిని చూశాడు బర్బరీకుడు. ఇకచాలు, నేనింక చూడలేను. నాకు విముక్తి కలిగించమని అతని శిరస్సు ప్రాధేయ పడింది. బాణంతో శిరసుని నింగికి ఎగరగొట్టారు. మొదట వచ్చిన పండు ముసలి ఈ కథని మరింత వివరంగా చెప్పాడు. ‘‘నాలాంటి చాలామందికి ఇలాంటివన్నీ చూస్తూ బతకాలనిలేదు. వీటిని అడ్డుకునే శక్తి లేనేలేదు. సహజ మరణం రాకపోతే....’’ అంటూ జీరపోయాడు. నాకు చాలా భయమేసింది.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ