సాగుభూమికి ‘బకాసుర’ చెర | Andhra pradesh capital effects on lands | Sakshi
Sakshi News home page

సాగుభూమికి ‘బకాసుర’ చెర

Published Thu, Nov 20 2014 1:03 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

సాగుభూమికి ‘బకాసుర’ చెర - Sakshi

సాగుభూమికి ‘బకాసుర’ చెర

హైదరాబాద్ పంట పొలాలను పడావు పెట్టి ఇనుప కంచెలను మొలిపించినట్టే, ఏపీ రాజధాని కోసం మూడు పంటల పొలాలను కాంక్రీట్ అరణ్యాలుగా మారుస్తామంటున్నారు. దీంతో నికర సాగు భూమి క్షీణించి ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్ల దిగుబడి పడిపోయి వాటిని దిగుమతి చేసుకోవాల్సిన దౌర్భాగ్యస్థితికి చేరుతున్నాం. పారిశ్రామికీకరణ వంటి అవసరాలకు భూ వినియోగాన్ని ఎవరూ కాదనరు. కానీ తెలుగు రాష్ట్రాల్లో భూమిని వ్యాపారంగా, నల్లధనాన్ని దాచే ముళ్ల కంచెల ఖజానాగా మారుస్తున్నారు. మధ్య తరగతి అవసరాలను, బలహీనతలను అవకాశంగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు.
 
 ఇటీవల ఒక పనిపై హైదరాబాద్ సమీపంలోని కిష్టాయిపల్లి, గాగిల్లాపూర్, గడ్డపోతారం గ్రామాలకు వెళ్లాల్సివచ్చింది. ఆ ఊళ్ల చుట్టూ ఉన్న భూములకు ఇనుప కంచెలున్నాయి. పంటలు లేవు. వ్యవసాయ పనులు జరుగుతున్న దాఖ లాలూ లేవు. ఈ విషయమై గ్రామస్తులను విచారిస్తే ‘‘మా ఊళ్లో వాళ్లకు ఇంటి స్థలాలు తప్ప పంట పొలాలు లేవు. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో పెద్ద మను షులు గత పదేళ్ల నుంచి ఇక్కడి భూములన్నిటినీ కొనేసి, పచ్చటి పంట పొలా లను పడావు పెట్టారు. అసలు వాళ్లు ఈ భూమిలో ఏం చేయదల్చుకున్నారో మాకు తెలియదు’’ అని గ్రామస్తుల సమాధానం. ఈ దృశ్యం ఆ గ్రామాలకే పరి మితం కాదు.
 
 హైదరాబాద్ నుంచి పోయే దారులన్నిటిలోనూ దాదాపు వంద కిలో మీటర్ల పరిధిలో ఇలా కంచె వేసిన పడావు భూములే కనిపిస్తాయి. హైదరా బాద్ నుంచి వరంగల్‌కి పోయే దారిలో ఆలేరు వరకు, శ్రీశైలం దారిలో కల్వ కుర్తి వరకు, బెంగళూరు దారిలో జడ్చర్ల వరకు, తాండూరు దారిలో వికారాబాద్ వరకు, నిజామాబాద్ దారిలో తూప్రాన్ వరకు, కరీంనగర్ దారిలో ప్రజ్ఞాపూర్ వరకు ఎక్కడా పంట పొలాలు కనిపించవు. తెల్లని రాళ్లు పాతి, నల్లటి ఇనుప తీగలు చుట్టి ఉన్న ఎండిన బీడు భూములు ఎడారిని తలపింపచేస్తాయి. పాతికేళ్ల క్రితం హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ పచ్చటి పొలాలు, ద్రాక్ష, చెరకు, గులాబీ, మల్లె తోటలు పరచుకొని ఉండేవి. తోటలకు ప్రసిద్ధిగాంచిన హైదరా బాద్ పరిసరాలు నేడు ఇలా బీళ్లుగా ఎందుకు మారిపోయాయి?
 
 కారణాలేమిటి?
 
 హైదరాబాద్ చుట్టూ వచ్చిన రింగురోడ్డు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర యం, కొండాపూర్, మాదాపూర్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి చుట్టూ ఉన్న ఐటీ సెం టర్లన్నీ కలిసి ఆ ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలను మొలిపించాయి. 1995లో కూడా సామాన్యులకు అందుబాటులో ఉన్న భూముల ధరలు 2006 చివరికి 6 రెట్లకు పైగా పెరిగాయి. అప్పటి వరకు భూయజమానులైన రైతులను మధ్యవర్తులు మోసగించి అతి తక్కువ ధరలకు కొని, ఎక్కువ ధరలకు అమ్మి కోట్లు గడించారు. 2005లో ఒక రైతు ఎకరా రూ.4 లక్షలకు ఐదెకరాలు అమ్మా డు. అదే భూమిని మధ్యవర్తి కోటీ పది లక్షలకు విక్రయించగా, దాన్ని ప్లాట్లుగా మార్చి అమ్ముకున్న కంపెనీ ఎకరానికి మూడు కోట్ల రూపాయలు రాబట్టింది! అమ్ముకున్న రైతు అక్కడే 200 గజాల ఇంటి స్థలాన్ని కొనుక్కోలేకపోయాడు. భూముల ధరల పెరుగుదలకీ, సామాన్యుడికి కలిగే ప్రయోజనానికి మధ్య ఉన్న అగాధాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
 
 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ భూ సమస్యపైనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ పంట పొలాలను పడావు పెట్టి ఇనుప కంచెలను మొలిపించినట్టే, ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం తడి ఆరకుండా మూడు పంటలు పండే పొలా లను కాంక్రీట్ జనారణ్యాలుగా మార్చే పథకం రూపొందుతోంది. దీంతో నికర సాగు భూమి క్షీణించి ఆహార పంటలు, కూరగాయలు, పూలు, పండ్ల దిగుబడి పడిపోయి వాటిని ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే దౌర్భా గ్యస్థితికి చేరుతున్నాం. గత రెండు దశాబ్దాల్లో హైదరాబాద్ చుట్టూ ఉన్న  9 నుంచి 10 లక్షల ఎకరాల భూమి సాగుకు దూరమై, టన్నులకొద్దీ ఆహార ధాన్యాల ఉత్పత్తి క్షీణించింది. చెట్లు, చేమలు, రాళ్లు, రప్పలతో నిండిన ఎకరం భూమిని సాగులోకి తేవాలంటే దశాబ్దకాలం పాటు ఎన్నో కుటుంబాలు రక్తాన్నే చెమటగా మార్చి నేలలో సారం నింపాలి. చివరకు జరిగేది ఆ పచ్చటి పంట పొలాలను కొనేసి పడావు పెట్టడమా?  
 
 పారిశ్రామికీకరణకు, ఇతర సామాజిక అవసరాలకు భూమిని వినియోగిం చడాన్ని ఎవరూ కాదనరు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భూమిని వ్యాపారంగా, నల్లధనాన్ని దాచే ముళ్ల కంచెల ఖజానాగా మారుస్తున్నారు. మధ్య తరగతి ప్రజల అవసరాలను, బలహీనతలను అవకాశం చేసుకొని సొమ్ము చేసుకో వడాన్నే మేం ప్రశ్నిస్తున్నాం. రియల్ ఎస్టేట్‌లో పెట్టే పెట్టుబడులు  పదింతలవు తాయనే దురాశతో పంట భూములను నాశనం చేసి, ప్రకృతికి, సమాజానికి వినాశకర పరిణామాలను కలిగించడానికి సిద్ధపడుతున్నారు. విజయవాడ ప్రాంతంలో ఇటీవలి భూ అమ్మకాలను పరిశీలిస్తే తల తిరిగిపోయే వాస్తవాలు బయటికొ స్తున్నాయి. ఒక్క పదిహేను రోజుల్లోనే మూడు వేల కోట్ల రూపా యల నల్లధనం చలామణిలోకి వచ్చింది. ఎకరాకు కోటి రూపాయలకు పైగా వసూలు చేస్తూ ఐదు లక్షలకు రిజిస్టర్ చేయిస్తున్నారు.
 
 శాస్త్రీయం పాత గ్రామం
 
 పూర్వం ఇల్లు లేదా నగరం లేదా గ్రామం దేని నిర్మాణమైనా ఒక శాస్త్రీయ పద్ధతి ననుసరించి సాగేది. నేటికీ నిలచి ఉన్న మన పాత గ్రామాలే అందుకు రుజువు. చేలు, పొలాలు ఎప్పుడూ గృహనిర్మాణానికి వాడిన దాఖలాలు లేవు. కాల్వలను మళ్లించి, చెరువులను పూడ్చి ఇళ్లు కట్టిన దాఖలాలు అసలే లేవు. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం జనగామ గ్రామం గోదావరి నదీతీరాన ఉంది. వందలసార్లు నదికి వరదలొచ్చి ఉంటాయి. మా ఎరుకలో నాలుగుసార్లు పెద్ద ఎత్తున గోదావరికి వరదలొచ్చాయి. గోదావరి గ్రామాన్ని చుట్టుముట్టిందే కానీ గ్రామంలోకి చుక్క నీరు చేరలేదు. అంటే గ్రామాలు ఎత్తయిన ప్రదేశంలో గట్టి భూములు కలిగిన ప్రాంతంలో నిర్మించాలి. ఇది నాటి స్థితి. ఆనాటి శాస్త్రీయ పద్ధతులను విడనాడి నేటి పట్టణాల నిర్మాణం విచ్చలవిడిగా సాగుతోంది. ఫలితంగా నేటి పట్టణాలు, నగరాల్లో కొత్తగా నిర్మించిన ప్రాంతాల్లో సైతం నాలుగు చినుకులకే మోకాలి లోతున నీరు నిలుస్తోంది. హైదరాబాద్ పరిసరా ల్లోని కాలనీల పరిస్థితి మరీ అధ్వానం. వర్షపు ముంపునకు గురయ్యే కాలనీలన్నీ చెరువులను పూడ్చి కట్టినవే.
 
 పొరుగు రాష్ట్రాల అనుభవం అక్కర్లేదా?
 
 సరిగ్గా ఇక్కడే నేటి సమాజం స్పందించాల్సిన అవసరం ఉంది. రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడిన ఈ సమయంలో భూమి వ్యవసాయం, గృహనిర్మాణం, పారి శ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పన అంశాల్లో సమతుల్యత పాటిం చాలి. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యవసాయం, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి పొరుగు రాష్ట్రాల నుంచి, మన గత చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కర్ణాటక, మహా రాష్ట్రల్లో వ్యవసాయ భూముల చట్టాలు చాలా ప్రగతిదాయకంగా ఉన్నాయి. వ్యవసాయ భూమిని అమ్మడం, కొనడం మీద కొన్ని ఆంక్షలున్నాయి. కర్ణాట కలో రెండు లక్షల రూపాయలకు మించి ఆదాయం గలిగిన వ్యవసాయేతరులు వ్యవసాయ భూమిని కొనడానికి వీల్లేదు. మహారాష్ట్రలో వ్యవసాయదారులు తప్ప ఎవరూ వ్యవసాయ భూములను సొంతం చేసుకోవడం చట్టప్రకారం సాధ్యం కాదు.
 
 కొంత కాలం క్రితం నిబంధనలకు విరుద్ధంగా భూమిని కొనుగోలు చేసిన అమితాబ్ బచ్చన్ చివరకు ఆ భూమిని తిరిగి ఇవ్వక తప్పని స్థితిని కల్పించింది ఈ చట్టమే. మహారాష్ట్రలో సాధ్యం కాదు కాబట్టే సచిన్ టెండూల్కర్ హైదరా బాద్ చుట్టూ, నెల్లూరు జిల్లాలో వందల ఎకరాల భూమిని సొంతం చేసుకు న్నాడు. దానికి సామాజిక సేవ  ముసుగుని తగిలించి మరీ నెల్లూరులో హల్‌చల్ చేస్తున్నాడు. గుజరాత్‌లో వ్యవసాయ భూమి ఉన్న వ్యక్తి మాత్రమే వ్యవసాయ భూమిని కొనే అవకాశం ఉంటుంది. అందువల్లే గుజరాత్‌లో వ్యాపారస్తులు, భూమిై వెపుగాక  పరిశ్రమలు, వ్యాపారాభివృద్ధి మీద దృష్టి పెట్టారు. అందుకు భిన్నంగా ఉమ్మడి రాష్ర్టంలోనూ, నేటి మన రెండు రాష్ట్రాల్లోనూ భూమిని వ్యాపారంగా మార్చారు. కాబట్టే లక్షలాది ఎకరాల పంట పొలాలు పడావుపడి, వ్యవసాయ సంక్షోభం ఏర్పడింది.
 
 పరిష్కారం?
 
 భూముల వ్యాపారీకరణ సమస్యకు పరిష్కారం ఏది? ఆ పరిష్కారం నాటి హైదరాబాద్ రాష్ట్రంలోని  హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టం (1950)లో ఉంది. కర్ణాటక, మహారాష్ట్రల్లోలాగే ఈ చట్టం కూడా వ్యవసాయదారులు మాత్రమే వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చునని నిర్దేశించింది. పైగా వ్యవసాయ భూమిని ఒక సంవత్సరానికి మించి ఎవరు పడావు పెట్టినా దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, ఆ గ్రామంలోని, లేదా ఆ ప్రాంతంలోని రైతులకు, కూలీలకు కౌలుకు ఇచ్చే అధికారాన్ని ఈ చట్టం ప్రభుత్వానికిచ్చింది. 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ భూములపై కన్నేసిన కొన్ని వర్గాలు 1969లో ఈ చట్టంలో మార్పులు తెచ్చాయి. ఫలితంగా ఎవరైనా విచ్చలవిడిగా భూములు కొని, అమ్మే అరాచకత్వానికి మార్గం ఏర్పడింది.
 
 హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు సరైన అవసరాల కోసం, వ్యవ సాయం కోసం, వినియోగంలోకి రావాలంటే, మళ్లీ 1950 చట్టాన్ని పునరుజ్జీ వింపజేయడం తప్ప మరో పరిష్కారం లేదు. అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం దృష్టి పెట్టాలి. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇటువంటి అంశాలపై సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. అందువల్ల ఈ విషయం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి కావాలి. రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ కార్మిక సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, ప్రజాస్వామికవాదులు, రైతుకూలీ సంఘాలు ఇటువంటి చట్టం కోసం మరో ఉద్యమాన్ని చేపట్టాల్సి ఉంటుంది.
 
 విశ్లేషణ: మల్లెపల్లి లక్ష్మయ్య
 
 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్ నం: 9705566213)

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement