housing project
-
అన్విత గ్రూప్ 2,000 కోట్ల ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ సంస్థ అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టింది. హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు వద్ద ఇవానా పేరుతో గృహ నిర్మాణ ప్రాజెక్టును నెలకొల్పుతోంది. 12.9 ఎకరాల్లో రెండు దశల్లో 1,850 ఫ్లాట్లు రానున్నాయి. మొదటి దశలో 15 అంతస్తుల్లో 2 టవర్లలో 450 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి కావస్తోంది. వీటిని ఈ ఏడాది చివరికల్లా కస్టమర్లకు అప్పగిస్తారు. రెండవ దశలో 36 అంతస్తుల్లో 4 టవర్లను నిర్మించనుంది. ఇందులో భాగంగా 1,400 ఫ్లాట్లను 2027లో వినియోగదార్లకు అందజేస్తామని అన్విత గ్రూప్ సీఎండీ అచ్యుతరావు బొప్పన గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 36 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవానా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ అనూప్ బొప్పన చెప్పారు. భారత్‌లో 6, అమెరికాలో 3 స్థిరాస్తి ప్రాజెక్టులను గ్రూప్ చేపట్టింది. -
హైదరాబాద్‌లో ట్రంప్ హౌసింగ్
పుణే: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంపెనీ దేశీయంగా మూడు నుంచి ఐదు హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టనుంది. ట్రంప్ రియల్టీ కంపెనీ ట్రంప్ ఆర్గనైజేషన్ 2023లో హైఎండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్, లూధియానాలలో మూడు నుంచి ఐదు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టనుంది. ఇందుకు దశాబ్ద కాలంగా కల్పేష్ మెహతా ప్రమోట్ చేసిన ఢిల్లీ కంపెనీ ట్రైబెకా డెవలపర్స్‌తో కొనసాగుతున్న ప్రత్యేక లైసెన్సింగ్ ఒప్పందాన్ని వినియోగించుకోనుంది. ట్రంప్ బ్రాండ్ ప్రాపర్టీల ఏర్పాటుకు ట్రైబెకా రూ. 2,500 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు మెహతా ఇక్కడ జరిగిన ఒక సదస్సు సందర్భంగా వెల్లడించారు. సదస్సుకు ట్రంప్ ఆర్గనైజేషన్ వైస్‌ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ హాజరయ్యారు. ఇద్ద రూ వార్టన్లో కలసి చదువుకోవడం గమనార్హం! 8 ప్రాజెక్టులకు ఓకే రానున్న 12 నెలల కాలంలో రూ. 5,000 కోట్ల విలువైన 7–8 ప్రాజెక్టులు చేపట్టేందుకు సంతకాలు చేసినట్లు మెహతా వెల్లడించారు. వీటిలో సగం నిధులను మూడు ట్రంప్ బ్రాండ్ ప్రాజెక్టులకు వెచ్చించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా ముంబై, పుణే, ఢిల్లీ ఎన్సీఆర్తోపాటు బెంగళూరు, హైదరాబాద్ వంటి కొత్త నగరాలవైపు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చండీగఢ్, లూధియానాలలో డెవలపర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రైబెకా సీఈవో హర్షవర్ధన్ ప్రసాద్ తెలియజేశారు. ఇప్పటికే నాలుగు దేశీయంగా ఇప్పటికే నాలుగు ట్రంప్ బ్రాండ్ ప్రాపర్టీలు ఏర్పాటయ్యాయి. తద్వారా యూఎస్ వెలుపల ట్రంప్ కంపెనీకి ఇండియా అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. నాలుగు ప్రాజెక్టులు విక్రయానికి వీలైన 2.6 మిలియన్ చదరపు అడుగుల(ఎస్‌క్యూఎఫ్‌టీ) ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. వీటిలో 0.27 మిలియన్ ఎస్‌క్యూఎఫ్‌టీ పంచ్‌శీల్ బిల్డర్స్(పుణే), 0.56 మిలియన్ ఎస్‌క్యూఎఫ్‌టీ మాక్రోటెక్ డెవలపర్స్(ముంబై) దాదాపు విక్రయంకాగా.. 1.36 మిలియన్ ఎస్‌క్యూఎఫ్‌టీ ఎం3ఎం గ్రూప్(గురుగ్రామ్) దాదాపు సిద్ధమైనట్లు మెహతా పేర్కొన్నారు. ఇక మరో 0.42 మిలియన్ ఎస్‌క్యూఎఫ్‌టీ యూనిమార్క్ గ్రూప్(కోల్‌కతా) నిర్మాణంలో ఉన్నట్లు తెలియజేశారు. -
శ్రీరామ్ చేతికి సువిలాస్ రియల్టీస్
న్యూఢిల్లీ: సుమారు రూ. 400 కోట్ల విలువైన హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న సువిలాస్ రియల్టీస్ సంస్థను సొంతం చేసుకున్నట్లు రియల్టీ రంగ కంపెనీ శ్రీరామ్ ప్రాపర్టీస్ పేర్కొంది. పూర్తి అనుబంధ సంస్థ శ్రీప్రాప్ బిల్డర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా 100 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు తెలియజేసింది. సువిలాస్ ప్రస్తుతం 0.65 మిలియన్ చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. బెంగళూరులోని జలహళ్లిలో శ్రీరామ్ సువిలాస్ పామ్స్ బ్రాండుతో 6.9 ఎకరాలలో ఈ ప్రాజెక్టును చేపట్టింది. శ్రీరామ్ ప్రాపర్టీస్‌తో కుదుర్చుకున్న అభివృద్ధి నిర్వహణా కాంట్రాక్టు ద్వారా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అయితే ప్రాజెక్టు ప్రస్తుత ప్రమోటర్లు తొలి దశలోనే మానిటైజ్‌కు తెరతీసింది. ఈ ప్రాంతానికున్న అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే బాటలో శ్రీరామ్ ప్రాపర్టీస్ ప్రాజెక్టును కొనుగోలు చేసింది. కాగా.. మరోపక్క సువిలాస్కే చెందిన మరో ప్రాజెక్టు శ్రీరామ్ సువిలాస్ గార్డెన్ ఆఫ్ జాయ్‌ను సైతం విడిగా చేజిక్కించుకున్నట్లు శ్రీరామ్ ప్రాపర్టీస్ వెల్లడించింది. 152 యూనిట్లతో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టుకు 0.2 మిలియన్ చదరపు అడుగుల విక్రయ అవకాశమున్నట్లు తెలియజేసింది. -
ఆన్లైన్లో వెతుకుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: అందుబాటు ధర, అభివృద్ధి చెందిన ప్రాంతం, అన్ని రకాల వసతులుంటే గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ల కోసం ఆన్లైన్లో కొనుగోలుదారులు తెగ వెతికేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ కాస్త నెమ్మదించడంతో జూన్ నెలలో ఆన్లైన్లో సెర్చింగ్ విపరీతంగా పెరిగిందని రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ తెలిపింది. అంతకుముందు వరుసగా రెండు నెలలు క్షీణించాయని పేర్కొంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుంచి వాస్తవ డిమాండ్ సాధ్యమవుతుందని తెలిపింది. జూన్‌లో అత్యధికంగా ఢిల్లీ–ఎన్సీఆర్ నగరంలో ప్రాపర్టీల కోసం ఆన్లైన్లో శోధనలు జరిగాయని గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. రెండో స్థానంలో ముంబై, ఆ తర్వాత వరుసగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, లూథియానా, పుణే, గోవా, సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా, గౌహతి, వారణాసి, అమృత్సర్, కోయంబత్తూర్, పాటా్న, మీరట్, జైపూర్, కాన్పూర్, లక్నో ప్రాంతాలలోని గృహాల కోసం ఆన్లైన్లో వెతికారని రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో ఆన్లైన్ సెర్చింగ్ క్షీణించగా.. జూన్‌లో 9 పాయింట్లు పెరిగిందని తెలిపింది. -
పన్నీరుకు ‘ఇంటిగండం’..?
పులియాంతోపు గృహ నిర్మాణాల్లో అక్రమాల గొడవ రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారం అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వానికి.. కన్నీరు తెప్పించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. గురువారం అసెంబ్లీలో మంత్రి అన్భరసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. సాక్షి, చెన్నై: పులియాంతోపు బహుళ అంతస్తుల గృహ నిర్మాణాల్లో నాణ్యతాలోపంపై రచ్చమొదలైంది. ఈ వ్యవహరం గురువారం అసెంబ్లీకి చేరింది. ప్రత్యేక విచారణ, భవన సామర్థ్యం పరిశీలన నివేదికల మేరకు క్రిమినల్ చర్యలు తప్పవని మంత్రి అన్భరసన్ ప్రకటించారు. దీంతో ఇది వరకు గృహ నిర్మాణశాఖకు సైతం మంత్రిగా వ్యవహరించిన పన్నీరు సెల్వంను పాలకులు టార్గెట్ చేయనున్నారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకంగా 2 వేల గృహాలు..? చెన్నై పులియాంతోపు కేపీ పార్క్‌లో గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బహుళ అంతస్తుల తరహాలో రెండు వేల మేరకు గృహాల్ని నిర్మించిన విషయం తెలిసిందే. నిర్మాణం పూర్తై నెలలు కూడా గడవని ఈ గృహాల్లో తాకిన చోటల్లా పెచ్చులు ఊడుతుండటం, మెట్లు కుంగినట్టు కనిపిస్తుండంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. వీటిల్లోని ప్రజలు బిక్కుబిక్కుమనక తప్పడం లేదు. బుధవారం నుంచి తాత్కాలిక మరమ్మతులు ఆగమేఘాలపై సాగుతున్నాయి. ఆలస్యం చేస్తే.. అంతే గురువారం అసెంబ్లీలో పులియాంతోపు బహుళ అంతస్తుల వ్యవహారం చర్చకు దారి తీసింది. డీఎంకే ఎగ్మూర్ ఎమ్మెల్యే పరంథామన్ సభ దృష్టికి ప్రత్యేక తీర్మానంగా ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. కోట్లాది రూపాయల వ్యయంతో సాగిన ఈ భవనాల నిర్మాణంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. నాణ్యత, సామర్థ్యం మీద విచారణ, పరిశోధన జరిపి, త్వరితగతిన నివేదిక తెప్పించుకోవాలని కోరారు. లేనిపక్షంలో భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిపుణుల బృందంతో పరిశీలన.. మంత్రి అన్భరసన్ సమాధానం ఇస్తూ, ఈ వ్యవహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, ఐఐటీ, అన్నా వర్సిటీల నిపుణుల బృందంతో పరిశీలన చేపట్టి.. తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమాలు నిజమని తేలితే.. ఏ ఒక్కర్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఒప్పంద దారుడైనా, వెనుక ఉన్న వాళ్లు ఎంతటి వారైనా క్రిమినల్ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఈ నిర్మాణాల సమయంలో డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా, గృహ నిర్మాణ మంత్రిగా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంను డీఎంకే ప్రభుత్వం టార్గెట్ చేసే అవకాశాలున్నాయనే చర్చ జోరందుకుంది. ముగిసిన బడ్జెట్ చర్చ అసెంబ్లీలో ఆర్థిక, వ్యవసాయ బడ్జెట్‌పై చర్చ గురువారం ముగిసింది. ప్రతి పక్షాలు, మిత్ర పక్షాల సభ్యులు చర్చ సమయంలో సంధించిన ప్రశ్నలకు తొలుత ఆర్థికమంత్రి పళని వేల్ త్యాగరాజన్ సమాధానమిచ్చారు. అలాగే, నందనంలోని ఆర్థికశాఖ భవనం ఇక, దివంగత డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ మాళిగైగా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర పన్ను తగ్గింపుతో పెట్రోల్ విక్రయాలు జోరందుకున్నాయని వివరించారు. అలాగే, విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతుల నిర్వహణకు రూ. 200 కోట్లు ప్రకటించారు. గత అన్నాడీఎంకే హయంలో 110 నిబంధన కింద అసెంబ్లీలో చేసిన ప్రత్యేక ప్రకటనల తీరు తెన్నులపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నామని తెలిపారు. ఇక, వ్యవసాయ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం వ్యవసాయ బడ్జెట్ మీద ప్రసంగించారు. ఐదేళ్లల్లో రాష్ట్రం పచ్చదనంతో నిండుతుందని, గ్రీన్ స్టేట్‌గా తమిళనాడును తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కాగా, బుధవారం అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యుల్ని గెంటి వేయలేదని, వారే వాకౌట్ చేసి బయటకు వెళ్లినట్టుగా స్పీకర్ అప్పావు వివరణ ఇచ్చారు. అలాగే, గత ప్రభుత్వం తాటి చెట్లను నరికేయగా, తాజా ప్రభుత్వం పరిరక్షించేందుకు ముందుకు సాగడం అభినందనీయమని కొనియాడారు. -
టిడ్కో 12వ విడత రివర్స్ టెండరింగ్‌లో 30.91 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి : పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టులలో 12వ విడత రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో ఏపీ టిడ్కో రూ.30.91కోట్లు ఆదా చేసింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 5,088 హౌసింగ్ యూనిట్ల (ఇళ్ల) నిర్మాణానికి టిడ్కో బుధవారం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తం రూ.306.61 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించగా, డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.275.70 కోట్లతో బిడ్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.30.91 కోట్లు భారం తగ్గింది. దీంతో ఏపీ టిడ్కో ఇంత వరకు మొత్తం 12 విడతల్లో 63,744 ఇళ్ల నిర్మాణానికి రూ.3,239.39 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించగా, రూ.2,847.16 కోట్లతో పనులను ఖరారు చేశారు. రూ.392.23 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వివిధ ప్యాకేజిల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.156 నుంచి రూ.316 వరకు వ్యయం తగ్గిందని వివరించారు. వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన వివిధ పనుల్లో మొత్తంగా రూ.1,869.51 కోట్లు ఆదా అయ్యింది. -
రియల్టీకి ఊతం!
న్యూఢిల్లీ: ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన ఆర్థిక వృద్ధిని గాడిలోకి తెచ్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రూ.70,000 కోట్ల విలువైన చర్యలను ప్రకటించారు. ఎగుమతి దారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే ఈ చర్యల్లో రూ.30,000 కోట్లతో దెబ్బతిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే ఫండ్ ఉంది. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన చర్యల్లో సుంకాల్ని రద్దు చేయటం, బీమా కవరేజీని పెంచటం, పోర్టుల్లో దిగుమతి సమయాన్ని తగ్గించేందుకు టెక్నాలజీని వాడకం వంటివి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రూ.20వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. దీన్లో సగ భాగాన్ని ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ 10వేల కోట్లను మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసి మధ్యలో ఆగిన ప్రాజెక్టుల పూర్తికి వినియోగిస్తారు. అయితే ఈ ప్రాజెక్టులు ఎన్పీఏలుగా ప్రకటించనివి, ఎన్సీఎల్టీ మెట్లు ఎక్కనివి అయి ఉండాలి. ‘ఈ ఫండ్ మార్కెట్, బ్యాంకింగ్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ నిపుణుల ద్వారా నడుస్తుంది. తక్కువ నిధులు అవసరమయ్యే మధ్యాదాయ వర్గాలకు చెందిన ప్రాజెక్టులు, పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులను వీరు గుర్తిస్తారు. ఫలితంగా గృహాల కోసం ఇన్వెస్ట్‌చేసి, ఆ ఇళ్లు పూర్తికావడం కోసం ఎక్కువకాలం వేచిచూస్తున్న కొనుగోలుదార్ల వెతలు తీరుతాయి. ఇబ్బందుల్లో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు ఉపశమనం పొందుతాయి. మొత్తంగా 3.5 లక్షల మంది గృహ కొనుగోలుదారులు లబ్ధి పొందే అవకాశముంది’ అని మీడియాతో చెప్పారు. మంత్రి చెప్పిన మరికొన్ని వివరాలు.. ► ఎగుమతి ఉత్పత్తులపై సుంకం లేదా పన్నుల ఉపశమనం (ఆర్ఓడీటీఈపీ) పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. ఇది వచ్చే జనవరి 1 నుంచి ప్రస్తుత మర్చండీస్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా స్కీమ్ స్థానంలో అమల్లోకి వస్తుంది. ఈ కొత్త పథకం ద్వారా ప్రభుత్వం రూ.50,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. ► ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) రూ.1,700 కోట్ల మేర అదనంగా ఖర్చు చేసి ఎగుమతుల కోసం వర్కింగ్ క్యాపిటల్ రుణాలిచ్చే బ్యాంకులకు అధిక బీమా సౌకర్యాన్ని కల్పించనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వడ్డీ రేటుతో సహా ఎగుమతులకు సంబంధించిన రుణాలపై భారం తగ్గుతుందన్నారు. ► నెలాఖరుకల్లా జీఎస్టీ రిఫండ్లను రియల్‌టైమ్‌లో ప్రాసెస్ చేయటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి ‘ఎగుమతి చేసే సమయం’ తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయాలు, ఓడరేవులలో ఎగుమతులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఇది అమలులోకి వస్తుంది. ► ఎగుమతులకు ఇచ్చే రుణాన్ని ప్రాధాన్యత రంగాలకిచ్చే రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. అంతేకాకుండా ఎగుమతులకు రుణ లభ్యత ఉండేలా అదనంగా రూ.36,000– 68,000 కోట్లను విడుదల చేస్తారు. ► అందుబాటు గృహాల ప్రాజెక్టులకు విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీలు) లభించేలా మార్గదర్శకాలను సరళీకరిస్తారు. ► వడ్డీరేట్ల బదలాయింపుపై చర్చించేందుకు ఈ నెల 19న ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో నిర్మలా సీతారామన్ ప్రత్యేక సమావేశంకానున్నారు. -
హౌసింగ్ ప్రాజెక్టులకు రాయితీ రుణాలు
క్రెడాయ్‌తో చేయికలిపిన ఎస్బీఐ ► చౌక, గ్రీన్ గృహ నిర్మాణాలకు ప్రాధాన్యత ► బిల్డర్లు, కస్టమర్లకు 0.35 శాతం వరకూ రాయితీ న్యూఢిల్లీ: హౌసింగ్ ప్రాజెక్టులకు రాయితీలపై రుణాలను అందించడానికి సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య క్రెడాయ్ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం... ప్రత్యేకించి చౌక, గ్రీన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో డెవలపర్లు, కస్టమర్లకు రాయితీలపై రుణాలు లభ్యమవుతాయి. ఎస్బీఐ గ్రీన్ హౌస్ లోన్స్ కింద గృహ రుణాల విషయంలో ప్రాసెసింగ్ ఫీజ్ కూడా రద్దు చేస్తారు. రూ.70,000 కోట్ల పెట్టుబడులతో తమ సభ్యులు 373 చౌక గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టారని, వీటిద్వారా 2.33 లక్షల గృహాలు అందుబాటులోకి వస్తాయని గతనెలలో క్రెడాయ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జరిగిన తాజా ఒప్పందానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఒప్పందం... మూడేళ్లు! ఈ ఒప్పందం కాలపరమితి మూడేళ్లు. ‘‘క్రెడాయ్‌తో మేం ఒప్పందం కుదుర్చుకున్నాం. గృహ కొనుగోలుదారులకు 10 బేసిస్ పాయింట్ల (0.10శాతం) రాయితీని అందిస్తాం. క్రెడాయ్ డెవలపర్ మెంబర్లకు 10 నుంచి 35 బేసిస్ పాయింట్ల మేర రుణ రాయితీ లభిస్తుంది’ అని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్) రజ్నీష్ కుమార్ తెలిపారు. గృహ రుణ విభాగంలో 25 శాతం వాటాతో మార్కెట్లో ఎస్బీఐ ముందుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘తాజా ఒప్పందం వల్ల అపార్ట్మెంట్ల వ్యయాల విషయంలో బిల్డర్లు, కస్టమర్లకు వడ్డీ భారం మరింత తగ్గుతుంది’’ అని కూడా ఎస్బీఐ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ‘ఎస్బీఐ హమారా ఘర్’ తాజా ఒప్పందానికి సంబంధించి... చౌక గృహ కొనుగోలు యోచనలో ఉన్న కస్టమర్ల కోసం ‘ఎస్బీఐ హమారా ఘర్’ పేరిట బ్యాంకు ఒక ప్రత్యేక స్కీమ్‌ను కూడా ఆవిష్కరించింది. రుణ మంజూరు ప్రక్రియలో విధానాల సరళీకరణ, ఈ ప్రాజెక్టుల కింద అధిక సంఖ్యలో కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడం తాజా స్కీమ్ లక్ష్యం. ‘‘లక్షల మంది గృహ కొనుగోలుదారులు వారి సొంత ఇల్లు కలను నిజం చేసుకోడానికి తాజా పథకం దోహదపడుతుంది. దీర్ఘకాలంలో రియల్టీ రంగ అభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి దోహదపడ్డమే తాజా ఎస్బీఐ చొరవల ప్రధాన లక్ష్యం’’ అని ఎస్బీఐ అధికారి పేర్కొన్నారు. చౌక గృహ నిర్మాణాలకు ఊతం: క్రెడాయ్ చౌక గృహ నిర్మాణాల విభాగం ఊపునందించడానికి తాజా ఒప్పందం చేయూత నిస్తుందని క్రెడాయ్ ప్రెసిడెంట్ జక్సాయ్ షా పేర్కొన్నారు. తక్కువ వడ్డీరేటు ప్రయోజనాన్ని డెవలపర్లు కస్టమర్లకు అందించడానికి తాజా చొరవ ఉపయుక్తంగా మారుతుందని, నిర్మాణ వ్యయాలు తగ్గడంలో ఇది కీలక అడుగని ఆయన అన్నారు. -
మౌలిక వసతుల్లో ఏపీ వెనుకంజ
⇒ అనుమతుల మంజూరులో జాప్యం వల్లే పెట్టుబడులు రావట్లేదు ⇒ అభివృద్ధి ఏ ప్రాంతంలో జరుగుతుందో క్లారిటీ లేదు ⇒ మాలక్ష్మి గ్రూప్ చైర్మన్ హరీష్ చంద్రప్రసాద్ వ్యాఖ్యలు ⇒ విజయవాడలో సెంటోజా పేరిట హౌసింగ్ ప్రాజెక్టు ప్రకటన ⇒ 25న శంకుస్థాపన; ఏ ప్రాజెక్టుకైనా ఇక అదే పేరు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గుజరాత్, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలతో పోలిస్తే మౌలిక వసతుల్లోను, త్వరితగతిన అనుమతులివ్వటంలోను ఆంధ్రప్రదేశ్ కాస్త వెనకబడే ఉందని, అందుకే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో పరిశ్రమలను ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చిన కంపెనీలు ఇపుడు ఆలోచనల్లో పడ్డాయని మాలక్ష్మి గ్రూప్ చైర్మన్ వై.హరీష్ చంద్ర ప్రసాద్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడి ఏడు నెలలవుతున్నా రాజకీయంగా స్థిరపడకపోవటం, రాజధాని నిర్మాణానికి నిధుల లేమి, మౌలిక వసతుల్లో వెనకబాటు తనం వల్లే ఏపీలో అభివృద్ధికి ఇంకా శంకుస్థాపన జరగట్లేదని అభిప్రాయపడ్డారు. మాలక్ష్మీ ప్రాపర్టీ వెంచర్స్ తరఫున ఏపీలో తొలి ప్రాజెక్టుకు ఈ నెల 25న విజయవాడలో శంకుస్థాపన చేయనున్న సందర్భంగా మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ‘రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్’ అనే అంశంపై ఆయన తన అభిప్రాయాలు వ్యక్తంచేశారు. ఆయనేమన్నారంటే... ఆరేడు నెలలుగా ఏపీలో స్థిరాస్తి అమ్మకాలు పూర్తిగా మందగించాయి. జరుగుతున్నవల్లా డెవలప్మెంట్ ఒప్పందాలే. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నిడమానూరులో మా సంస్థకున్న భూమి విలువ ఎకరం రూ.15 కోట్లు పలికింది. కానీ, ఇప్పుడు సగానికి విక్రయిస్తామన్నా కొనేవారు లేరు. కావాలంటే డెవలప్మెంట్కు ఇవ్వండని అడుగుతున్నారు. ఇందుకు ప్రధాన కారణమేంటంటే... కొత్త రాజధానిగా ప్రకటించిన తుళ్లూరు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందా? లేక క్యాపిటల్ రీజియన్ అథారిటీగా ప్రకటించిన ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందా? అనే విషయంపై ఇంకా పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు క్లారిటీ రాలేదు. అందుకే ఏపీకి ఇంకా పెట్టుబడులు రావట్లేదు. ఆయా అంశాలపై స్పష్టత తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తోంది. ప్లాన్ వస్తేగానీ ఎక్కడ ఎంత విస్తీర్ణంలో అభివృద్ధి జరుగుతుందో తెలియదు. విజయవాడ, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాలక్ష్మి గ్రూప్‌కు 250 ఎకరాలున్నాయి. వీటిల్లో 100 ఫేజుల్లో 100 అపార్ట్మెంట్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఒక్కో అపార్ట్‌మెంట్‌పై రూ.100 కోట్లు పెట్టుబడిగా పెడతాం. ఫేజ్-1లో నిడమానూరులో 2.3 ఎకరాల్లో ‘సెంటోజా’ పేరుతో నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నాం. ఈనెల 25న ప్రారంభించనున్న ఈ ప్రాజెక్ట్‌ను 18 నెలల్లో పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలిస్తాం. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో మాలక్ష్మి గ్రూప్ నిర్మించే ఏ నివాస సముదాయాన్నైనా సెంటోజా పేరుతోనే నిర్మిస్తాం. - సమైక్య ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నపుడు చాలా మంది కవులు, రచయితలు, కళాకారులు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడి పోయారు. ఇపుడు వారికి పునఃస్వాగతం పలుకుతూనే.. కొత్త వారిని ప్రోత్సహించాలి. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో సాంస్కృతిక పునరుజ్జీవనం చేసేందుకు విజయవాడలో కల్చరల్ సెంటర్‌ను నిర్మిస్తాం. పారిశ్రామికవేత్తలు స్థానికంగా ఉన్న కళారూపాల్ని, గ్రామాల్ని దత్తత తీసుకొని అభివృద్ధి పరచాలి. అప్పుడే ఆ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. అందుకే విజయవాడలో కొండపల్లి బొమ్మలను తయారుచేసే 116 కళాకారులను దత్తత తీసుకున్నాం. మా స్వస్థలమైన కృష్ణా జిల్లాలోని పెదమద్దాలి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా. -
ఉడా మెగా హౌసింగ్ ప్రాజెక్టు!
అమరావతి టౌన్షిప్లో... 45 ఎకరాల విస్తీర్ణంలో గృహల నిర్మాణానికి కసరత్తు రాజధాని హడావిడి నేపథ్యంలో కసరత్తు మరో నెలలో మొదలుపెట్టే యోచన? సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా సుదీర్ఘకాలం తర్వాత మెగా హౌసింగ్ ప్రాజెక్టుకు తెరతీసింది. ఉడా పరిధిలో భూముల ధరలు భారీగా పెరగటంతో ఉడాకు భూసేకరణ సమస్యాత్మకంగా మారింది. ఈ క్రమంలో ఉడా వద్ద నిల్వ ఉన్న మిగులు భూమిపై దృష్టిసారించింది. దీంతో అమరావతి టౌన్షిప్లో ఉన్న మిగులు భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం జరుగుతుందన్న విసృత ప్రచారం నేపథ్యంలో హౌసింగ్ ప్రాజెక్టు మొదలుపడితే భారీగా డిమాండ్ వస్తుందని... తద్వారా ఉడాకు భారీగా ఆర్థికవనరులు సమకూరతాయని చైర్మన్ భావించారు. దీంతో ప్రాజెక్టును పట్టాలు ఎక్కించేందుకు కసరత్తు సాగిస్తున్నారు. అధికారులతో చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నెలరోజుల వ్యవధిలో టెండర్లు ఆహ్వనించి ఎడాదిన్నర కాలవ్యవధిలో ప్రాజెక్టు పూర్తిచేయించాలని భావిస్తున్నారు. ఉడా పరిధిలో ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నవులూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉడా 1988-1991 మధ్య 390.38 ఎకరాల భూసేకరణ చేసింది. తదనంతరం 390 ఎకరాల్లో 285.17 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్‌వేసి 1327 ప్లాటు వేశారు. సుధీర్ఘకాలంపాటు విక్రయించారు. ఈ క్రమంలో తొలుత కొంత నగదు చెల్లించి నిర్ణీత కాలంలో రిజిష్టర్ చేయించుకుని పలుప్లాట్లను రద్దు చేశారు. 390 ఎకరాల భూమిలో ఖాళీ ఉన్న 105 ఎకరాల భూమిలో 24 ఎకరాలు ఇంటర్నేషనల్ కిక్రెట్ స్టేడియానికి, మరో 22.72 ఎకరాలు అరిహంత్ఇండోఅఫ్రికన్ ఇన్ఫ్రా డెవలపర్స్‌కు కేటాయించారు. దానిలో సదరు సంస్థ సింగ్‌పూర్ టౌన్షిప్ నిర్మించాలని కసరత్తు చేసింది. అలాగే 40 ఎకరాలను ఐటీ సెజ్‌గా గుర్తించి ఐటీసంస్థలకు కేటాయించడం కోసం ఉంచారు. దీంతో ఐటీ సంస్థలు రాకపోవటంతో సెజ్‌ను రద్దుచేసి కేటాయించిన భూమిని ఉడా తిరిగి వెనక్కి తీసుకుంది. దీంతో ఉడాకు ఆ భూమి నిల్వ భూమిగా ఉంది. మరోవైపు కేటాయింపులు జరిపిన భూముల్లో క్రికెట్స్టేడియం పనులు వేగంగా సాగుతున్నాయి. అలాగే సింగపూర్ టౌన్‌సిప్ 2007లో పనులు మొదలుకావల్సి ఉన్నప్పటికీ అన్ని అనుమతులు లేకపోవటంతో వాయిదా పడింది. ప్రస్తుతం అన్ని అనుమతులు పొందింది. కేటాయింపులు పోను, పార్కులు, ఇతర సౌకర్యాలకు కేటాయించినది పోనూ సుమారు 45 ఎకరాలు భూమి ఉడాకు మిగిలింది. వాస్తవానికి వీజీటీఎం ఉడా రెండేళ్ల కిత్రమే హౌసింగ్ ప్రాజెక్టు మొదలుపెట్టాలని భావించింది. అయితే ఉడాకు ల్యాండ్ బ్యాంకు లేకపోవడంతో ప్రాజెక్టు సాధ్యపడలేదు. దీంతో అప్పట్లో ఉడా వైస్చైర్మన్లు గుంటూరు, కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ భూములు కొన్నింటిని ఉడాకు కేటాయించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు.అయినప్పటికీ స్పందన లేకపోవటంతో పూర్తిగా హౌసింగ్ ప్రాజెక్టును వదిలేశారు.అయితే ప్రసుత్తం ఉడాలో 385 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 1000 చదరపు గజాలు మొదలుకుని 200 గజాల వరకు ఉన్న పాట్లున్నాయి. వీటిల్లో 1000 గజాల ప్లాట్లు 107, 200 గజాల ప్లాట్లు 106 అధికంగా ఉన్నాయి. వెంచర్లో ప్లాట్లు కావడంతో వాటిని విక్రయించే పనిలో ఉడా అధికారులు నిమగ్నమైయ్యారు. 45 ఎకరాల్లో... 45 ఎకరాల్లో మెగా హౌసింగ్ వెంచర్ నిర్మించాలని సన్నాహలు చేస్తున్నారు. వీటిలో ఇండిపెండెంట్ హౌస్‌లతోపాటు, అపార్ట్మెంట్లు, పార్కులు, ఇండోర్ స్టేడియం, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. 250 చదరపు గజాల విస్తీర్ణంలో ఇండిపెండెంట్ హౌస్ నిర్మాణం, అపార్ట్మెంట్లో సుమారు రెండువేల ప్లాట్ల నిర్మాణం చేసి మధ్యతరగతివర్గాలకు కేటాయింపు జరిపేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో జరగనున్న ఉడా పాలకవర్గ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. -
వుడాకు శి‘రో’భారం
సాక్షి, విశాఖపట్నం : రో హౌసింగ్ ప్రాజెక్టు విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా)కు భారంగా మారింది. ఐదేళ్ల క్రితం నిర్మించిన రోహౌసింగ్ యూనిట్లు ఇప్పటికీ విక్రయానికి నోచుకోకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ఆ ప్రాజెక్టు కోసం చేసిన రూ.18.5 కోట్ల ఖర్చు ప్రశ్నార్థంగా ఉంది. లాభాలు ఆర్జించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు తలపెడితే కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో అసలుకే ఎసరొచ్చే పరిస్థితి ఎదురైంది. వుడా అధికారులు రో హౌసింగ్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విశాఖ-భీమిలి బీచ్ రోడ్డుకు దగ్గరగా రుషికొండ వద్ద యూరోపియన్ నిర్మాణ నమూనాలో 2008లో నిర్మాణం చేపట్టారు. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా డూప్లెక్స్ పద్ధతిలో 65 యూనిట్లు నిర్మించారు. సుమారు రూ.18.5 కోట్లు ఖర్చు పెట్టారు. వీటిని నాలుగు కేటగిరీలుగా విభజించి అమ్మకానికి పెట్టా రు. కనీస ధరగా కేటగిరీ ఏలో ఉన్న యూనిట్లకు రూ.71 లక్షలు, కేటగిరీ బి యూనిట్లకు రూ.72లక్షలు, కేటగిరీ సీ యూనిట్లకు రూ.77 లక్షలు, కేటగిరీ డీ యూనిట్లకు రూ.82.50 లక్షలు ధర నిర్ణయించారు. యూనిట్లు సుందరంగా కనిపించడంతో కొనుగోలుదారులు పోటీ పడి వస్తారని బహిరంగ వేలం కోసం ఇప్పటికే పలు పర్యాయాలు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రజల నుంచి స్పందన రాలేదు. నగరానికి దూరంగా ఉండడం, అదే ధరకు సిటీలోనే ఫ్లాట్లు దొరకడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపలేదు. దీంతో ఏళ్ల తరబడి రో హౌసింగ్ యూనిట్లు వేలానికి నోచుకోకుండా మిగిలిపోయాయి. జూలై 10 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరగా ఇప్పటివరకు 65 యూనిట్లకు కేవలం 45 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన బహిరంగ వేలంలో పోటీ పడే అవకాశం ఉండదు. దీంతో ఆశించిన ధర రాదు సరికదా కనీస రేటులో కూడా యూనిట్లు అన్నీ విక్రయానికి నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రూ.18.5 కోట్ల పెట్టుబడి వుడాకు భారంగా పరిణమించింది. మరోవైపు నిర్మించిన హౌసింగ్ యూనిట్లు ఏళ్ల తరబడి విక్రయం కాకపోవడంతో నిర్వహణ లేక దయనీయంగా తయారయ్యాయి. నిర్మాణ నాణ్యతపై అనుమానాలు కూడా కమ్ముకుంటున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయం, వుడా లాభాపేక్ష ధర ఫలితంగా రో హౌసింగ్ ప్రాజెక్టు ఆ సంస్థకు గుదిబండగా మారిందన్న విమర్శలున్నాయి. -
పేదోడికి గూడు కలేనా?
భాగ్యనగరంలో గూడు దొరకని అభాగ్యులు! హైదరాబాద్ జిల్లాలో ఇళ్లకోసం లక్షల్లో దరఖాస్తులు పెండింగ్‌లో 1.90 లక్షలకుపైగా దరఖాస్తులు హౌసింగ్ శాఖ చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు ఏళ్లు గడుస్తున్నా ‘రచ్చబండ’ అర్జీలకూ కలగని మోక్షం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో పేదోడికి సొంతింటి కల నెరవేరదా..? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమిస్తున్నారు హౌసింగ్ అధికారులు. నగరంలో అద్దె ఇళ్లల్లో ఉంటూ, చాలీచాలని ఆదాయంతో బతుకులీడుస్తున్న పేద వర్గాలవారు ఎప్పటికైనా ఇల్లు రాకపోతుందా అన్న ఆశతో దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు. కానీ వారి ఆశ మాత్రం నెరవేరడం లేదు. ఎదురుచూపులే వారికి మిగులుతున్నాయి. 2011 ఫిబ్రవరిలో నిర్వహించిన మొదటి విడత ‘రచ్చబండ’ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల్లో 1.27 లక్షలమంది, రెండో విడత రచ్చబండలో మరో మూడున్నర వేల మందికిపైగా పేదలు ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏళ్లు గడుస్తున్నాయి కానీ ఆయా దరఖాస్తులకు మోక్షం మాత్రం కలగట్లేదు. లక్షలాది మందికి ప్రయోజనం కల్పించే ఈ విషయమై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో పేదోడికి సొంతగూడు అందనిద్రాక్షగానే మిగిలిపోతోంది. పెండింగ్‌లో 1.90 లక్షల దరఖాస్తులు.. హైదరాబాద్ జిల్లా హౌసింగ్ విభాగానికి ఇళ్లకోసమంటూ.. దాదాపు రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి. తొలివిడత ‘రచ్చబండ’లో 1.27 ల క్షల దరఖాస్తులు రాగా, రెండో విడతలో 3,500 దరఖాస్తులొచ్చాయి. ఇవిగాక ‘సోషల్ ఎకనామిక్ సర్వే’ కింద ఇళ్లు కట్టిస్తామంటూ 20 వేల పేద కుటుంబాల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మరోవైపు రాజీవ్ గృహకల్ప పథకం కింద రూ.వెయ్యి చెల్లించినా.. ఇళ్లు రానివారు 35 వేలమందికిపైగా ఉన్నారు. జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం ‘మీకోసం’ కార్యక్రమం ద్వారా పేదలనుంచి మరో ఆరు వేలదాకా దరఖాస్తులు హౌసింగ్ విభాగానికి అం దాయి. ఏతావాతా పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 1.90 లక్షలు దాటింది. హౌసింగ్ శాఖ చుట్టూ పేదలు ప్రదక్షిణలు చేస్తున్నారు తప్పించి... ఎలాంటి ప్రయోజనమూ ఉండడం లేదు. మరోవైపు పేదలకు ఇళ్ల నిర్మాణ అంశం గురించి.. అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడంతో వారికి ఏంచేయాలో పాలు పోవట్లేదు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి.. హైదరాబాద్ జిల్లాలో ఇళ్లకోసం ప్రజలనుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అయితే జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలు లేకపోవడంతో సమస్య జటిలమైంది. ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని పొరుగునున్న రంగారెడ్డి జిల్లాలో స్థలాలను ఇస్తే తప్ప పేదలకు ఇళ్లు కట్టించలేం. స్థలాలను కేటాయించాలని పలుమార్లు విన్నవించాం. ఈ విషయమై ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -కృష్ణయ్య, హౌసింగ్ ప్రాజెక్ట్ డెరైక్టర్ -
చైనాలో రూ. 5,600 కోట్ల కుంభకోణం
బీజింగ్: చైనాలో గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. గతేడాది చేపట్టిన 360 హౌజింగ్ ప్రాజెక్టుల్లో సుమారు 94.8 కోట్ల డాలర్లు (రూ.5,600 కోట్లు) మేరకు నిధులు దారిమళ్లినట్లు చైనా అత్యున్నత ఆడిటింగ్ సంస్థ తనిఖీల్లో వెలుగుచూసింది. ఈ ప్రాజెక్టులకు కేటాయించిన 580 కోట్ల యువాన్లను పలు సంస్థలు రుణాలు చెల్లించేందుకు, పెట్టుబడులకు, నగదు నిర్వహణ వంటి అవసరాలకు వాడుకున్నాయని ఈ మేరకు ‘నేషనల్ ఆడిట్ ఆఫీస్’ తన నివేదికలో తెలిపింది.