పులియాంతోపు గృహ నిర్మాణాల్లో అక్రమాల గొడవ రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారం అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వానికి.. కన్నీరు తెప్పించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. గురువారం అసెంబ్లీలో మంత్రి అన్భరసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.
సాక్షి, చెన్నై: పులియాంతోపు బహుళ అంతస్తుల గృహ నిర్మాణాల్లో నాణ్యతాలోపంపై రచ్చమొదలైంది. ఈ వ్యవహరం గురువారం అసెంబ్లీకి చేరింది. ప్రత్యేక విచారణ, భవన సామర్థ్యం పరిశీలన నివేదికల మేరకు క్రిమినల్ చర్యలు తప్పవని మంత్రి అన్భరసన్ ప్రకటించారు. దీంతో ఇది వరకు గృహ నిర్మాణశాఖకు సైతం మంత్రిగా వ్యవహరించిన పన్నీరు సెల్వంను పాలకులు టార్గెట్ చేయనున్నారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాసిరకంగా 2 వేల గృహాలు..?
చెన్నై పులియాంతోపు కేపీ పార్క్‌లో గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బహుళ అంతస్తుల తరహాలో రెండు వేల మేరకు గృహాల్ని నిర్మించిన విషయం తెలిసిందే. నిర్మాణం పూర్తై నెలలు కూడా గడవని ఈ గృహాల్లో తాకిన చోటల్లా పెచ్చులు ఊడుతుండటం, మెట్లు కుంగినట్టు కనిపిస్తుండంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. వీటిల్లోని ప్రజలు బిక్కుబిక్కుమనక తప్పడం లేదు. బుధవారం నుంచి తాత్కాలిక మరమ్మతులు ఆగమేఘాలపై సాగుతున్నాయి.
ఆలస్యం చేస్తే.. అంతే
గురువారం అసెంబ్లీలో పులియాంతోపు బహుళ అంతస్తుల వ్యవహారం చర్చకు దారి తీసింది. డీఎంకే ఎగ్మూర్ ఎమ్మెల్యే పరంథామన్ సభ దృష్టికి ప్రత్యేక తీర్మానంగా ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. కోట్లాది రూపాయల వ్యయంతో సాగిన ఈ భవనాల నిర్మాణంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. నాణ్యత, సామర్థ్యం మీద విచారణ, పరిశోధన జరిపి, త్వరితగతిన నివేదిక తెప్పించుకోవాలని కోరారు. లేనిపక్షంలో భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నిపుణుల బృందంతో పరిశీలన..
మంత్రి అన్భరసన్ సమాధానం ఇస్తూ, ఈ వ్యవహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, ఐఐటీ, అన్నా వర్సిటీల నిపుణుల బృందంతో పరిశీలన చేపట్టి.. తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమాలు నిజమని తేలితే.. ఏ ఒక్కర్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఒప్పంద దారుడైనా, వెనుక ఉన్న వాళ్లు ఎంతటి వారైనా క్రిమినల్ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఈ నిర్మాణాల సమయంలో డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా, గృహ నిర్మాణ మంత్రిగా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంను డీఎంకే ప్రభుత్వం టార్గెట్ చేసే అవకాశాలున్నాయనే చర్చ జోరందుకుంది.
ముగిసిన బడ్జెట్ చర్చ
అసెంబ్లీలో ఆర్థిక, వ్యవసాయ బడ్జెట్‌పై చర్చ గురువారం ముగిసింది. ప్రతి పక్షాలు, మిత్ర పక్షాల సభ్యులు చర్చ సమయంలో సంధించిన ప్రశ్నలకు తొలుత ఆర్థికమంత్రి పళని వేల్ త్యాగరాజన్ సమాధానమిచ్చారు. అలాగే, నందనంలోని ఆర్థికశాఖ భవనం ఇక, దివంగత డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ మాళిగైగా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర పన్ను తగ్గింపుతో పెట్రోల్ విక్రయాలు జోరందుకున్నాయని వివరించారు. అలాగే, విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతుల నిర్వహణకు రూ. 200 కోట్లు ప్రకటించారు. గత అన్నాడీఎంకే హయంలో 110 నిబంధన కింద అసెంబ్లీలో చేసిన ప్రత్యేక ప్రకటనల తీరు తెన్నులపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నామని తెలిపారు.
ఇక, వ్యవసాయ మంత్రి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం వ్యవసాయ బడ్జెట్ మీద ప్రసంగించారు. ఐదేళ్లల్లో రాష్ట్రం పచ్చదనంతో నిండుతుందని, గ్రీన్ స్టేట్‌గా తమిళనాడును తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కాగా, బుధవారం అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యుల్ని గెంటి వేయలేదని, వారే వాకౌట్ చేసి బయటకు వెళ్లినట్టుగా స్పీకర్ అప్పావు వివరణ ఇచ్చారు. అలాగే, గత ప్రభుత్వం తాటి చెట్లను నరికేయగా, తాజా ప్రభుత్వం పరిరక్షించేందుకు ముందుకు సాగడం అభినందనీయమని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment