సాక్షి, విశాఖపట్నం : రో హౌసింగ్ ప్రాజెక్టు విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా)కు భారంగా మారింది. ఐదేళ్ల క్రితం నిర్మించిన రోహౌసింగ్ యూనిట్లు ఇప్పటికీ విక్రయానికి నోచుకోకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ఆ ప్రాజెక్టు కోసం చేసిన రూ.18.5 కోట్ల ఖర్చు ప్రశ్నార్థంగా ఉంది. లాభాలు ఆర్జించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు తలపెడితే కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో అసలుకే ఎసరొచ్చే పరిస్థితి ఎదురైంది. వుడా అధికారులు రో హౌసింగ్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
విశాఖ-భీమిలి బీచ్ రోడ్డుకు దగ్గరగా రుషికొండ వద్ద యూరోపియన్ నిర్మాణ నమూనాలో 2008లో నిర్మాణం చేపట్టారు. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా డూప్లెక్స్ పద్ధతిలో 65 యూనిట్లు నిర్మించారు. సుమారు రూ.18.5 కోట్లు ఖర్చు పెట్టారు. వీటిని నాలుగు కేటగిరీలుగా విభజించి అమ్మకానికి పెట్టా రు. కనీస ధరగా కేటగిరీ ఏలో ఉన్న యూనిట్‌లకు రూ.71 లక్షలు, కేటగిరీ బి యూనిట్లకు రూ.72లక్షలు, కేటగిరీ సీ యూనిట్లకు రూ.77 లక్షలు, కేటగిరీ డీ యూనిట్లకు రూ.82.50 లక్షలు ధర నిర్ణయించారు.
యూనిట్లు సుందరంగా కనిపించడంతో కొనుగోలుదారులు పోటీ పడి వస్తారని బహిరంగ వేలం కోసం ఇప్పటికే పలు పర్యాయాలు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రజల నుంచి స్పందన రాలేదు. నగరానికి దూరంగా ఉండడం, అదే ధరకు సిటీలోనే ఫ్లాట్లు దొరకడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపలేదు. దీంతో ఏళ్ల తరబడి రో హౌసింగ్ యూనిట్లు వేలానికి నోచుకోకుండా మిగిలిపోయాయి. జూలై 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరగా ఇప్పటివరకు 65 యూనిట్లకు కేవలం 45 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
ఈ లెక్కన బహిరంగ వేలంలో పోటీ పడే అవకాశం ఉండదు. దీంతో ఆశించిన ధర రాదు సరికదా కనీస రేటులో కూడా యూనిట్లు అన్నీ విక్రయానికి నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రూ.18.5 కోట్ల పెట్టుబడి వుడాకు భారంగా పరిణమించింది. మరోవైపు నిర్మించిన హౌసింగ్ యూనిట్లు ఏళ్ల తరబడి విక్రయం కాకపోవడంతో నిర్వహణ లేక దయనీయంగా తయారయ్యాయి. నిర్మాణ నాణ్యతపై అనుమానాలు కూడా కమ్ముకుంటున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయం, వుడా లాభాపేక్ష ధర ఫలితంగా రో హౌసింగ్ ప్రాజెక్టు ఆ సంస్థకు గుదిబండగా మారిందన్న విమర్శలున్నాయి.
వుడాకు శి‘రో’భారం
Published Mon, Sep 16 2013 4:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
Advertisement
Advertisement