హౌసింగ్ ప్రాజెక్టులకు రాయితీ రుణాలు
క్రెడాయ్‌తో చేయికలిపిన ఎస్‌బీఐ
► చౌక, గ్రీన్ గృహ నిర్మాణాలకు ప్రాధాన్యత
► బిల్డర్లు, కస్టమర్లకు 0.35 శాతం వరకూ రాయితీ
న్యూఢిల్లీ: హౌసింగ్ ప్రాజెక్టులకు రాయితీలపై రుణాలను అందించడానికి సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య క్రెడాయ్ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం... ప్రత్యేకించి చౌక, గ్రీన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో డెవలపర్లు, కస్టమర్లకు రాయితీలపై రుణాలు లభ్యమవుతాయి.
ఎస్‌బీఐ గ్రీన్ హౌస్ లోన్స్ కింద గృహ రుణాల విషయంలో ప్రాసెసింగ్ ఫీజ్ కూడా రద్దు చేస్తారు. రూ.70,000 కోట్ల పెట్టుబడులతో తమ సభ్యులు 373 చౌక గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టారని, వీటిద్వారా 2.33 లక్షల గృహాలు అందుబాటులోకి వస్తాయని గతనెలలో క్రెడాయ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జరిగిన తాజా ఒప్పందానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒప్పందం... మూడేళ్లు!
ఈ ఒప్పందం కాలపరమితి మూడేళ్లు. ‘‘క్రెడాయ్‌తో మేం ఒప్పందం కుదుర్చుకున్నాం. గృహ కొనుగోలుదారులకు 10 బేసిస్ పాయింట్ల (0.10శాతం) రాయితీని అందిస్తాం. క్రెడాయ్ డెవలపర్ మెంబర్లకు 10 నుంచి 35 బేసిస్ పాయింట్ల మేర రుణ రాయితీ లభిస్తుంది’ అని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్) రజ్‌నీష్ కుమార్ తెలిపారు. గృహ రుణ విభాగంలో 25 శాతం వాటాతో మార్కెట్లో ఎస్‌బీఐ ముందుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘తాజా ఒప్పందం వల్ల అపార్ట్‌మెంట్ల వ్యయాల విషయంలో బిల్డర్లు, కస్టమర్లకు వడ్డీ భారం మరింత తగ్గుతుంది’’ అని కూడా ఎస్‌బీఐ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
‘ఎస్‌బీఐ హమారా ఘర్’
తాజా ఒప్పందానికి సంబంధించి... చౌక గృహ కొనుగోలు యోచనలో ఉన్న కస్టమర్ల కోసం ‘ఎస్‌బీఐ హమారా ఘర్’ పేరిట బ్యాంకు ఒక ప్రత్యేక స్కీమ్‌ను కూడా ఆవిష్కరించింది. రుణ మంజూరు ప్రక్రియలో విధానాల సరళీకరణ, ఈ ప్రాజెక్టుల కింద అధిక సంఖ్యలో కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడం తాజా స్కీమ్ లక్ష్యం. ‘‘లక్షల మంది గృహ కొనుగోలుదారులు వారి సొంత ఇల్లు కలను నిజం చేసుకోడానికి తాజా పథకం దోహదపడుతుంది. దీర్ఘకాలంలో రియల్టీ రంగ అభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి దోహదపడ్డమే తాజా ఎస్‌బీఐ చొరవల ప్రధాన లక్ష్యం’’ అని ఎస్‌బీఐ అధికారి పేర్కొన్నారు.
చౌక గృహ నిర్మాణాలకు ఊతం: క్రెడాయ్
చౌక గృహ నిర్మాణాల విభాగం ఊపునందించడానికి తాజా ఒప్పందం చేయూత నిస్తుందని క్రెడాయ్ ప్రెసిడెంట్ జక్సాయ్ షా పేర్కొన్నారు. తక్కువ వడ్డీరేటు ప్రయోజనాన్ని డెవలపర్లు కస్టమర్లకు అందించడానికి తాజా చొరవ ఉపయుక్తంగా మారుతుందని, నిర్మాణ వ్యయాలు తగ్గడంలో ఇది కీలక అడుగని ఆయన అన్నారు.