Kredai
-
హౌసింగ్ ప్రాజెక్టులకు రాయితీ రుణాలు
క్రెడాయ్‌తో చేయికలిపిన ఎస్బీఐ ► చౌక, గ్రీన్ గృహ నిర్మాణాలకు ప్రాధాన్యత ► బిల్డర్లు, కస్టమర్లకు 0.35 శాతం వరకూ రాయితీ న్యూఢిల్లీ: హౌసింగ్ ప్రాజెక్టులకు రాయితీలపై రుణాలను అందించడానికి సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య క్రెడాయ్ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం... ప్రత్యేకించి చౌక, గ్రీన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో డెవలపర్లు, కస్టమర్లకు రాయితీలపై రుణాలు లభ్యమవుతాయి. ఎస్బీఐ గ్రీన్ హౌస్ లోన్స్ కింద గృహ రుణాల విషయంలో ప్రాసెసింగ్ ఫీజ్ కూడా రద్దు చేస్తారు. రూ.70,000 కోట్ల పెట్టుబడులతో తమ సభ్యులు 373 చౌక గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టారని, వీటిద్వారా 2.33 లక్షల గృహాలు అందుబాటులోకి వస్తాయని గతనెలలో క్రెడాయ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జరిగిన తాజా ఒప్పందానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఒప్పందం... మూడేళ్లు! ఈ ఒప్పందం కాలపరమితి మూడేళ్లు. ‘‘క్రెడాయ్‌తో మేం ఒప్పందం కుదుర్చుకున్నాం. గృహ కొనుగోలుదారులకు 10 బేసిస్ పాయింట్ల (0.10శాతం) రాయితీని అందిస్తాం. క్రెడాయ్ డెవలపర్ మెంబర్లకు 10 నుంచి 35 బేసిస్ పాయింట్ల మేర రుణ రాయితీ లభిస్తుంది’ అని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్) రజ్నీష్ కుమార్ తెలిపారు. గృహ రుణ విభాగంలో 25 శాతం వాటాతో మార్కెట్లో ఎస్బీఐ ముందుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘తాజా ఒప్పందం వల్ల అపార్ట్మెంట్ల వ్యయాల విషయంలో బిల్డర్లు, కస్టమర్లకు వడ్డీ భారం మరింత తగ్గుతుంది’’ అని కూడా ఎస్బీఐ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ‘ఎస్బీఐ హమారా ఘర్’ తాజా ఒప్పందానికి సంబంధించి... చౌక గృహ కొనుగోలు యోచనలో ఉన్న కస్టమర్ల కోసం ‘ఎస్బీఐ హమారా ఘర్’ పేరిట బ్యాంకు ఒక ప్రత్యేక స్కీమ్‌ను కూడా ఆవిష్కరించింది. రుణ మంజూరు ప్రక్రియలో విధానాల సరళీకరణ, ఈ ప్రాజెక్టుల కింద అధిక సంఖ్యలో కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడం తాజా స్కీమ్ లక్ష్యం. ‘‘లక్షల మంది గృహ కొనుగోలుదారులు వారి సొంత ఇల్లు కలను నిజం చేసుకోడానికి తాజా పథకం దోహదపడుతుంది. దీర్ఘకాలంలో రియల్టీ రంగ అభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి దోహదపడ్డమే తాజా ఎస్బీఐ చొరవల ప్రధాన లక్ష్యం’’ అని ఎస్బీఐ అధికారి పేర్కొన్నారు. చౌక గృహ నిర్మాణాలకు ఊతం: క్రెడాయ్ చౌక గృహ నిర్మాణాల విభాగం ఊపునందించడానికి తాజా ఒప్పందం చేయూత నిస్తుందని క్రెడాయ్ ప్రెసిడెంట్ జక్సాయ్ షా పేర్కొన్నారు. తక్కువ వడ్డీరేటు ప్రయోజనాన్ని డెవలపర్లు కస్టమర్లకు అందించడానికి తాజా చొరవ ఉపయుక్తంగా మారుతుందని, నిర్మాణ వ్యయాలు తగ్గడంలో ఇది కీలక అడుగని ఆయన అన్నారు. -
తిరుపతిలో క్రెడయ్ ప్రాపర్టీ షో
– 76 నిర్మాణ సంస్థల హాజరు – మూడు రోజుల పాటు ప్రత్యేక ఎగ్జిబిషన్ – నిర్మాణ రంగంలో సరికొత్త మార్పులు – తిరుపతి పరిసరాల్లో 49 కొత్త వెంచర్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నుంచి క్రెడయ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ప్రాపర్టీ షో ప్రారంభమైంది. తిరుపతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీ దుర్గాభవాని, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి, నగరంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథులుగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. క్రెడయ్ తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో ఇది రెండో ఎగ్జిబిషన్. మూడు రోజుల పాటు ఇది కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. అవగాహన కోసమే... రాష్ట్రంలోని 76 భవన నిర్మాణ సంస్థలు, కంపెనీలు ఎగ్జిబిషన్లో స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఆకాశ హార్మ్యాలాంటి నివాస భవనాల నిర్మాణంలో వస్తున్న సరికొత్త మార్పులు, డిజైన్లు, నాణ్యత వంటి అంశాలపై సరైన అవగాహన కల్పించడమే కాకుండా ఏఏ బిల్డింగ్ మెటీరియల్ ఎక్కడ, ఏఏ ధరల్లో లభ్యమవుతుందో తెలియజేసేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు వీ శ్రీనివాసులు,వెంకటేశ్‌బాబు తెలిపారు. నిర్మాణ రంగంలో విశేష అనుభవం ఉన్న నిర్మాణ సంస్థలు, వాటికి సంబంధించిన బిల్డర్లు హాజరైనట్లు తెలిపారు. ఆకట్టుకున్న స్టాళ్లు... ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వివిధ నిర్మాణ సంస్థల స్టాళ్లు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏఏ నిర్మాణ సంస్థ ఎక్కడ, ఎన్ని ఫ్లోర్లతో ఏ తరహా భవనాలను నిర్మిస్తోంది..వాటి ధరలు ఎలా ఉన్నాయి...ఎంత విస్తీర్ణం కొనుగోలుదారులకు దక్కుతుందనే వివరాలతో కూడిన బ్రోచర్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను అందుబాటులో ఉంచడంతో సందర్శకులు ఆసక్తి కనబరిచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 5 వేల మంది ఎగ్జిబిషన్‌కు హాజరయ్యారని నిర్వాహకులు వివరించారు. 11న జరిగే ముగింపు కార్యక్రమానికి క్రెడయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలా శివారెడ్డి (విజయవాడ), కార్యదర్శి ఆళ్ల శివారెడ్డి (గుంటూరు) హాజరవుతారని వెంకటేశ్‌బాబు తెలిపారు. ఎస్బీఐ డీజీఎం పవన్‌కుమార్, క్రెడయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, పలువురు నగర ప్రముఖులు, రియల్టర్లు, బిల్డర్లు హాజరయ్యారు. -
మిషన్ కాకతీయకు క్రెడాయ్ 50 లక్షల విరాళం
హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘం క్రెడాయ్ రూ.50 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు క్రెడాయ్ సీఈఓ ఎంవీ రాజేశ్వర్‌రావు, చైర్మన్ బి.సుధాకర్‌రావు, ప్రతినిధులు శేఖర్‌రెడ్డి, జగన్మోహన్, కె.రాంరెడ్డి బుధవారం నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావును కలసి తొలి విడతగా రూ.25 లక్షల చెక్కును అందజేశారు. హెచ్ఎండీఏ పరిధిలో 11 చెరువులను దత్తత తీసుకుంటామని మంత్రితో చెప్పారు.