న్యూఢిల్లీ: ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన ఆర్థిక వృద్ధిని గాడిలోకి తెచ్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రూ.70,000 కోట్ల విలువైన చర్యలను ప్రకటించారు. ఎగుమతి దారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే ఈ చర్యల్లో రూ.30,000 కోట్లతో దెబ్బతిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే ఫండ్ ఉంది. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన చర్యల్లో సుంకాల్ని రద్దు చేయటం, బీమా కవరేజీని పెంచటం, పోర్టుల్లో దిగుమతి సమయాన్ని తగ్గించేందుకు టెక్నాలజీని వాడకం వంటివి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రూ.20వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. దీన్లో సగ భాగాన్ని ప్రభుత్వం సమకూరుస్తుంది.
ఈ 10వేల కోట్లను మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసి మధ్యలో ఆగిన ప్రాజెక్టుల పూర్తికి వినియోగిస్తారు. అయితే ఈ ప్రాజెక్టులు ఎన్‌పీఏలుగా ప్రకటించనివి, ఎన్‌సీఎల్‌టీ మెట్లు ఎక్కనివి అయి ఉండాలి. ‘ఈ ఫండ్ మార్కెట్, బ్యాంకింగ్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ నిపుణుల ద్వారా నడుస్తుంది. తక్కువ నిధులు అవసరమయ్యే మధ్యాదాయ వర్గాలకు చెందిన ప్రాజెక్టులు, పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులను వీరు గుర్తిస్తారు. ఫలితంగా గృహాల కోసం ఇన్వెస్ట్‌చేసి, ఆ ఇళ్లు పూర్తికావడం కోసం ఎక్కువకాలం వేచిచూస్తున్న కొనుగోలుదార్ల వెతలు తీరుతాయి. ఇబ్బందుల్లో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు ఉపశమనం పొందుతాయి. మొత్తంగా 3.5 లక్షల మంది గృహ కొనుగోలుదారులు లబ్ధి పొందే అవకాశముంది’ అని మీడియాతో చెప్పారు.
మంత్రి చెప్పిన మరికొన్ని వివరాలు..
► ఎగుమతి ఉత్పత్తులపై సుంకం లేదా పన్నుల ఉపశమనం (ఆర్‌ఓడీటీఈపీ) పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. ఇది వచ్చే జనవరి 1 నుంచి ప్రస్తుత మర్చండీస్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా స్కీమ్ స్థానంలో అమల్లోకి వస్తుంది. ఈ కొత్త పథకం ద్వారా ప్రభుత్వం రూ.50,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది.
► ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) రూ.1,700 కోట్ల మేర అదనంగా ఖర్చు చేసి ఎగుమతుల కోసం వర్కింగ్ క్యాపిటల్ రుణాలిచ్చే బ్యాంకులకు అధిక బీమా సౌకర్యాన్ని కల్పించనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వడ్డీ రేటుతో సహా ఎగుమతులకు సంబంధించిన రుణాలపై భారం తగ్గుతుందన్నారు.
► నెలాఖరుకల్లా జీఎస్‌టీ రిఫండ్లను రియల్‌టైమ్‌లో ప్రాసెస్ చేయటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి ‘ఎగుమతి చేసే సమయం’ తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయాలు, ఓడరేవులలో ఎగుమతులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఇది అమలులోకి వస్తుంది.
► ఎగుమతులకు ఇచ్చే రుణాన్ని ప్రాధాన్యత రంగాలకిచ్చే రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. అంతేకాకుండా ఎగుమతులకు రుణ లభ్యత ఉండేలా అదనంగా రూ.36,000– 68,000 కోట్లను విడుదల చేస్తారు.
► అందుబాటు గృహాల ప్రాజెక్టులకు విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీలు) లభించేలా మార్గదర్శకాలను సరళీకరిస్తారు.
► వడ్డీరేట్ల బదలాయింపుపై చర్చించేందుకు ఈ నెల 19న ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో నిర్మలా సీతారామన్ ప్రత్యేక సమావేశంకానున్నారు.
రియల్టీకి ఊతం!
Published Sun, Sep 15 2019 5:43 AM | Last Updated on Sun, Sep 15 2019 10:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment