న్యూఢిల్లీ: రుణ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏ) మార్చిన వారి నుండి డబ్బును రికవరీ చేయడంలో గత యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సోమవారం తీవ్రంగా విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో బ్యాంకులు మొదటిసారి డిఫాల్టర్ల నుండి డబ్బును తిరిగి రాబట్టగలుగుతున్నాయని స్పష్టం చేశారు. రుణ ఎగవేతదారులపై ప్రభుత్వ చర్యల గురించి డీఎంకేకు సభ్యుడు టీఆర్ బాలు అడిగిన ప్రశ్న ఆమె ఈ మేరకు సమాధానం చెప్పారు.
ఇంకా ఆమె ఏమన్నారంటే...వివిధ మోసపూరిత చర్యల ద్వారా చిన్న మొత్తాల పొదుపు డిపాజిటర్లను మోసం చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదుతో సహా పలు చర్యలు తీసుకోవడం జరిగింది. యాప్ ఆధారిత ఆర్థిక సంస్థల కార్యకలాపాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రుణాలను ‘‘రైట్ ఆఫ్’’ చేయడం అంటే ‘పూర్తిగా మాఫీ చేయడం‘ కాదు. బాకీ ఉన్న మొత్తాన్ని తిరిగి పొందేందుకు బ్యాంకులు తగిన ప్రతి చర్యనూ తీసుకుంటాయి. ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకుని, వారి నుంచి రుణ బకాయిల రికవరీకి ప్రభుత్వ రంగ బ్యాంకులు తగిన అన్ని చర్యలూ తీసుకుంటాయి.
ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై ఇలా...
ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు, 2017 (ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు)ను కేంద్రం 2017 ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అటు తర్వాత దానిని సమీక్షించి నివేదిక పంపాలని కోరుతూ పార్లమెంట్ జాయింట్ కమిటీకి నివేదించడం జరిగింది. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ప్రధాన లక్ష్యం ఎంపిక చేసిన ఆర్థిక రంగ సంస్థల వివాదాలకు ప్రత్యేక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. కాగా, ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును 2018 ఆగస్టులో ఉపసంహరించుకుంది. మరింత సమగ్ర పరిశీలన, అ అంశంపై పునఃపరిశీలన ఈ ఉపసంహరణ ఉద్దేశం. అయితే అటు తర్వాత ఈ అంశానికి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
డిపాజిటర్లకు రక్షణ..
డిపాజిట్ల రక్షణకు సంబంధించి ఆమె చేసిన ప్రసంగాన్ని పరిశీలిస్తే, ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఇన్సూరెన్స్ కింద బ్యాంకుల్లో డిపాజిటర్లకు బీమా కవరేజ్ పరిమితిని లక్ష రూపాయల స్థాయి నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. బ్యాంకుల్లో డిపాజిటర్లకు మరింత రక్షణ కల్పించాలన్నది ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ నిర్ణయం 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
దివాలా చర్యల పటిష్టత
దివాలా ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరక్కుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటుందని ఆర్థికమంత్రి తెలి పారు. ప్రకటన ప్రకారం, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ల ఇన్సాల్వెన్సీ, లిక్విడేషన్ ప్రొసీడింగ్స్– అడ్జుడికేటింగ్ అథారిటీకి దరఖాస్తు నిబం« దనలు, 2019ను 2019 నవంబర్ 15న ప్రభుత్వం నోటిఫై చేసింది. బ్యాంకులు కాకుండా ఇతర ప్రొవైడర్లు లిక్విడేషన్ ప్రొసీ డింగ్స్‌లో ఎటువంటి అవరోధాలూ ఎదురుకాకూడదన్నది దీని లక్ష్యం. తదనంతరం రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణం కలిగిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకూ (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) దివాలా కోడ్, 2016 వర్తించేలా నిబంధనలను 2019 నవంబర్ 18న ప్రభుత్వం నోటిఫై చేసింది.
Comments
Please login to add a commentAdd a comment