న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఒక్క కుటుంబానికే ప్రాధాన్యమిచ్చి, దేశ ఆర్థిక పరిస్థితిని దయనీయ స్థితికి దిగజార్చారంటూ కాంగ్రెస్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దుమ్మెత్తిపోశారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం, భారతీయులపై దాని ప్రభావం’ అంశంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘మోదీ ప్రభుత్వానికి దేశమే తొలి ప్రాధాన్యం. యూపీఏకు మాత్రం ఆ ఒక్క (గాం«దీ) కుటుంబమే ముఖ్యం.
2008లో దేశం ఆర్థికమాంద్యం కోరల్లో చిక్కుకుంటే జాతి ప్రయోజనాల పరిరక్షణకు యూపీఏ ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నాలు చేయకపోగా కాంగ్రెస్ చేతులెత్తేసింది. పలు స్కామ్‌లతో దేశార్థికాన్ని దీనావస్థలోకి నెట్టి 2014లో ని్రష్కమించారు. వాళ్లు అధికారంలో కొనసాగితే ఇంకెన్ని దారుణాలు జరిగేవో దేవుడికే తెలుసు. సోనియా గాంధీ సూపర్ పీఎంగా ఉండటం వల్లే యూపీఏ హయాంలో ఆర్థికవ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. వాళ్లిప్పుడు మాకు సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో నేరి్పస్తున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. కోవిడ్ సంక్షోభంలో మోదీ సర్కార్ ఎంతటి సమర్థతతో, అంకితభావంతో పనిచేసిందో, పరిస్థితిని చక్కదిద్దిందో అంతా చూశారన్నారు.
వరుస కుంభకోణాలు
‘‘బొగ్గు కుంభకోణం కారణంగా దేశం రూ.1.86 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయిందని కాగ్ ఆక్షేపించింది. సుప్రీంకోర్టు సైతం యూపీఏ ప్రభుత్వాన్ని తలంటి ఏకంగా 214 బొగ్గు బ్లాకుల లైసెన్స్‌ను రద్దుచేసింది. కోల్‌స్కామ్ ధాటికి చివరకు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. బొగ్గు కొరత ఏర్పడింది. విద్యుదుత్పత్తి తగ్గింది. మొత్తంగా పెట్టుబడులూ దెబ్బతిన్నాయి. అదే మోదీ ప్రభుత్వ పాలనలో పారదర్శకంగా బొగ్గు బ్లాకుల వేలం జరిగింది. వాళ్లు బొగ్గును బూడిదగా మార్చారు. మా మోదీ సర్కార్ లాభసాటి విధానాలతో బొగ్గును వజ్రాల వ్యాపారమంత విలువైనదిగా మార్చింది’’ అన్నారు.
నాడు పరువు పోతే నేడు ప్రతిష్ఠ పెరిగింది
‘‘యూపీఏ హయాంలో కామన్వెల్త్ క్రీడల కుంభకోణంతో దేశం పరువు పోయింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సును ఔరా అనిపించేలా నిర్వహించి దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పెంచాం. బ్యాంకింగ్ రంగమంటే మాకు గౌరవం. కానీ యూపీఏ హయంలో ప్రభుత్వ పెద్దలు తాము చెప్పిన వారికి రుణాలొచ్చేలా చేసి మొండిబకాయిలు పెరగడానికి కారకులయ్యారు. మోదీ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు 3.2 శాతానికి దిగొచ్చాయి’’ అన్నారు. యూపీఏ పాలనపై బురదజల్లుతున్నారంటూ నిర్మల ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుతగిలారు.
Comments
Please login to add a commentAdd a comment