న్యూఢిల్లీ: ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వదిలిపెట్టిన సవాళ్లను ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో విజయవంతంగా అధిగమించింది. దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంది’’ అని కేంద్ర ప్రభుత్వం తమ శ్వేతపత్రం(వైట్ పేపర్)లో వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన 59 పేజీల ఈ శ్వేతపత్రాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
యూపీఏ సర్కారు హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన ఆర్థిక ప్రగతిని వైట్ పేపర్‌లో ప్రస్తావించారు. దీనిపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ అనంతరం మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తారు. ‘‘2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది. ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆర్థిక క్రమశిక్షణ మచ్చుకైనా లేదు.
అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. నిజంగా అదొక సంక్షోభ పరిస్థితి. యూపీఏ ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఆర్థిక వ్యవస్థ వెనక్కిపోయింది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో అప్పటి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. యూపీఏ పాలనలో భారత్ ప్రపంచంలో అత్యంత బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండేది. యూపీఏ హయాంలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయి. అప్పటి అవినీతి వ్యవహారాలు దేశ ప్రజల విశ్వాసాన్ని బలహీనపర్చాయి.
2013లో విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దానివల్ల మనం పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అప్పటి బలహీన నాయకత్వం వల్ల రక్షణ రంగం సైతం సన్నద్ధత కోల్పోయింది. 2014లో దారుణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ యూపీఏ నుంచి ఎన్డీయే ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది. ఆర్థిక వ్యవస్థను, పరిపాలనా వ్యవస్థను గాడిలో పెట్టే పనికి ఎన్డీయే ప్రభుత్వం పూనుకుంది. ఒక క్రమపద్ధతిలోకి తీసుకొచ్చింది.
ఆర్థికంగా దేశానికి మంచి జరగాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను మోదీ ప్రభుత్వం గుర్తించింది. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులను పటిష్టంగా మార్చింది. ఇప్పుడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. ప్రపంచంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్ అవతరించింది. మోదీ నాయకత్వంలో మన దేశం ప్రస్తుతం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారింది.
మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల కేవలం పదేళ్లలోనే ఈ ఘనత సాధ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిణామాలు, సవాళ్లు ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో కొనసాగుతోంది. చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. నిద్రించేలోగా చేరాల్సిన మైళ్లు, ఎక్కాల్సిన పర్వతాలు ఎన్నో ఉన్నాయి. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలి. అదే మన గమ్యం. ఇది మనందరి కర్తవ్య కాలం’’ అని శ్వేతపత్రంలో ఎన్డీయే ప్రభుత్వం పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment