funding schemes
-
ఎన్నికల హామీలకు నిధులెలా తెస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉచితాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మోడల్ కోడ్‌ను(ఎన్నికల ప్రవర్తనా నియమావళి) సవరించాలని ఎన్నికల సంఘం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఓటర్లకు చెప్పాలని, ఈ ప్రతిపాదనపై ఈ నెల 19వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలకు మంగళవారం లేఖ రాసింది. మేనిఫెస్టోల్లో ప్రకటించిన ఎన్నికల వాగ్దానాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ఓటర్లకు అందజేయాలని లేఖలో స్పష్టం చేసింది. మోడల్ కోడ్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఆర్థిక వనరులు ఏమిటో కూడా ఓటర్లకు తెలియచేయాలని వెల్లడించింది. పార్టీ ఇచ్చే ఎన్నికల హామీల విషయంలో తాము కళ్లు మూసుకొని కూర్చోలేమని తేల్చిచెప్పింది. బూటకపు వాగ్దానాలతో విపరిణామాలు రాజకీయ పార్టీలు ఇచ్చే బూటకపు వాగ్దానాలు విపరిణామాలకు దారితీస్తాయని ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయకుండా తాము అడ్డుకోలేకపోనప్పటికీ, ఓటర్లకు సమాచారం ఇచ్చే హక్కు ఉందని పేర్కొంది. ఇకపై దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నిర్దిష్ట ఫార్మాట్లో పార్టీల వ్యయాల వివరాలను అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల వివరాలను ఓటర్లకు చెప్పే అంశాన్ని ఎన్నికల ప్రవర్తనా నియామావళి(ఎంసీసీ)లోని పార్ట్–8లో (ఎన్నికల మేనిఫెస్టోపై మార్గదర్శకాలు) చేరుస్తూ ఎంసీసీని సవరించాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. దీని ప్రకారం మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీల అమలుకు నిధులు సేకరించే మార్గాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అదనపు పన్నులు, ఖర్చుల హేతుబద్దీకరణ, కొన్ని పథకాల్లో కోత, మరిన్ని అప్పులు తీసుకురావడం వంటి వివరాలు వెల్లడించాలి. ఓటర్లకు ఉచితాలు పంచే సంస్కృతికి రాజకీయ పార్టీలు చరమగీతం పాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే పిలుపునిచ్చారు. దీనిపై అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సైతం జరిగింది. ఉచితాలపై సర్వోన్నత న్యాయస్థానంలో సైతం ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
బ్రిటన్ రాణికి కరోనా కష్టాలు!
లండన్: కరోనా మహమ్మారి ప్రభావం బ్రిటన్ రాణి ఎలిజబెత్–2పైనా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల సందర్శకుల రాక తగ్గిపోవడంతో ఎలిజబెత్ కుటుంబం 35 మిలియన్ పౌండ్ల(45 మిలియన్ డాలర్లు) ఆదాయం కోల్పోనున్నట్లు రాజకుటుంబం మనీ మేనేజర్ మైఖేల్ స్టీవెన్స్ చెప్పారు. ఎలిజబెత్ కుటుంబ వార్షిక ఆదాయ వ్యయాల వివరాలను ప్రకటించారు. బ్రిటన్‌లో రాజ కుటుంబానికి ఎన్నో ప్యాలెస్‌లను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చేవారు. వీరి ద్వారా ఫీజుల రూపంలో అందే మొత్తం ఎలిజబెత్ ఖాతాలోకే చేరేది. కరోనాతో ఈ ఆదాయానికి భారీగా గండి పడింది. మరోవైపు రాణి నివసించే ప్రఖ్యాత బకింగ్హమ్ ప్యాలెస్‌కు మరమ్మతులు చేయాల్సి ఉంది. చివరిసారిగా రెండో ప్రపంచ యుద్ధం కొన్నాళ్లకు ఈ ప్యాలెస్‌కు మరమ్మతులు చేశారు. ఇప్పుడు నిధులు లేవని మరమ్మతులు ఆపేస్తే ప్యాలెస్ శిథిలావస్థకు చేరుతుందని ఆందోళన చెందుతున్నారు. కరోనా కష్టకాలంలో నిధులు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని రాణి కోరబోరని స్టీవెన్స్ చెప్పారు. ఉన్న నిధులనే సర్దుబాటు చేసుకుంటామన్నారు. ప్యాలెస్ సిబ్బందికి ఇప్పటికే íజీతాలు చెల్లించడం నిలిపి వేశారు. గత ఆర్థిక సంవత్సరం బ్రిటన్ ప్రభుత్వం రాజ కుటుంబానికి 69.4 మిలియన్ పౌండ్లు అందజేసింది. అంతకుముందు నాటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2.4 మిలియన్ పౌండ్లు అధికం కావడం గమనార్హం. -
రియల్టీకి ఊతం!
న్యూఢిల్లీ: ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన ఆర్థిక వృద్ధిని గాడిలోకి తెచ్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రూ.70,000 కోట్ల విలువైన చర్యలను ప్రకటించారు. ఎగుమతి దారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే ఈ చర్యల్లో రూ.30,000 కోట్లతో దెబ్బతిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే ఫండ్ ఉంది. ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన చర్యల్లో సుంకాల్ని రద్దు చేయటం, బీమా కవరేజీని పెంచటం, పోర్టుల్లో దిగుమతి సమయాన్ని తగ్గించేందుకు టెక్నాలజీని వాడకం వంటివి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రూ.20వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. దీన్లో సగ భాగాన్ని ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ 10వేల కోట్లను మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసి మధ్యలో ఆగిన ప్రాజెక్టుల పూర్తికి వినియోగిస్తారు. అయితే ఈ ప్రాజెక్టులు ఎన్పీఏలుగా ప్రకటించనివి, ఎన్సీఎల్టీ మెట్లు ఎక్కనివి అయి ఉండాలి. ‘ఈ ఫండ్ మార్కెట్, బ్యాంకింగ్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ నిపుణుల ద్వారా నడుస్తుంది. తక్కువ నిధులు అవసరమయ్యే మధ్యాదాయ వర్గాలకు చెందిన ప్రాజెక్టులు, పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులను వీరు గుర్తిస్తారు. ఫలితంగా గృహాల కోసం ఇన్వెస్ట్‌చేసి, ఆ ఇళ్లు పూర్తికావడం కోసం ఎక్కువకాలం వేచిచూస్తున్న కొనుగోలుదార్ల వెతలు తీరుతాయి. ఇబ్బందుల్లో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు ఉపశమనం పొందుతాయి. మొత్తంగా 3.5 లక్షల మంది గృహ కొనుగోలుదారులు లబ్ధి పొందే అవకాశముంది’ అని మీడియాతో చెప్పారు. మంత్రి చెప్పిన మరికొన్ని వివరాలు.. ► ఎగుమతి ఉత్పత్తులపై సుంకం లేదా పన్నుల ఉపశమనం (ఆర్ఓడీటీఈపీ) పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. ఇది వచ్చే జనవరి 1 నుంచి ప్రస్తుత మర్చండీస్ ఎక్స్‌పోర్ట్స్ ఇండియా స్కీమ్ స్థానంలో అమల్లోకి వస్తుంది. ఈ కొత్త పథకం ద్వారా ప్రభుత్వం రూ.50,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. ► ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) రూ.1,700 కోట్ల మేర అదనంగా ఖర్చు చేసి ఎగుమతుల కోసం వర్కింగ్ క్యాపిటల్ రుణాలిచ్చే బ్యాంకులకు అధిక బీమా సౌకర్యాన్ని కల్పించనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వడ్డీ రేటుతో సహా ఎగుమతులకు సంబంధించిన రుణాలపై భారం తగ్గుతుందన్నారు. ► నెలాఖరుకల్లా జీఎస్టీ రిఫండ్లను రియల్‌టైమ్‌లో ప్రాసెస్ చేయటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి ‘ఎగుమతి చేసే సమయం’ తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయాలు, ఓడరేవులలో ఎగుమతులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఇది అమలులోకి వస్తుంది. ► ఎగుమతులకు ఇచ్చే రుణాన్ని ప్రాధాన్యత రంగాలకిచ్చే రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. అంతేకాకుండా ఎగుమతులకు రుణ లభ్యత ఉండేలా అదనంగా రూ.36,000– 68,000 కోట్లను విడుదల చేస్తారు. ► అందుబాటు గృహాల ప్రాజెక్టులకు విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీలు) లభించేలా మార్గదర్శకాలను సరళీకరిస్తారు. ► వడ్డీరేట్ల బదలాయింపుపై చర్చించేందుకు ఈ నెల 19న ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో నిర్మలా సీతారామన్ ప్రత్యేక సమావేశంకానున్నారు. -
పీజీఐఎం నుంచి ఓవర్‌నైట్ ఫండ్
ఓవర్‌నైట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే లక్ష్యంతో పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ (లోగడ డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా) నుంచి ఓవర్‌నైట్ ఫండ్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఈ నెల 12న ఆఫర్ ప్రారంభం కాగా, ఈ నెల 26 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఒక్క రోజు వ్యవధిలో గడువు తీరే ఓవర్‌నైట్ సెక్యూరిటీల్లో (డెట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్లు) ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. స్వల్ప కాలం కోసం నిధులను పార్క్ చేసుకోవాలనుకునే వారికి ఇది అనుకూలం. రిస్క్ తక్కువగా ఉంటుంది. అధిక లిక్విడిటీ (కోరుకున్నప్పుడు వేగంగా వెనక్కి తీసుకోగలగడం) ఇందులోని మరో సానుకూలత. అయితే, రాబడులకు హామీ ఉండదు. ప్రవేశం, వైదొలిగే సమయంలో ఎటువంటి చార్జీలు ఉండవు. ఒక రోజు నుంచి నెల రోజుల వరకు తమ నిధులపై రాబడులు కోరుకునే వారు ఈ తరహా పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
నిధులు, పథకాలు తేల్చేద్దాం!
నేడు ఎస్సీ, ఎస్టీ కమిటీల మూడో భేటీ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధిపై నేడు కీలక భేటీ జరగనుంది. శుక్రవారం సర్వశిక్షా అభియాన్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్ట సవరణల కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్ష తన భేటీ కానున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, సాంఘిక సంక్షేమ మంత్రి జగదీశ్‌రెడ్డి, కమిటీ సభ్యులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, శాఖాధి పతులు ఇందులో పాల్గొననున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈ కమిటీలు సమావేశమై నిధుల వినియోగం గురించి చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా జరిగే సమావేశంలో నిధుల కేటాయింపుపై సుదీర్ఘం గా చర్చించనున్నాయి. అంతేకాకుండా శాఖల వారీగా పథకాల రూపకల్పనపై సమీక్ష నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గత రెండు సమావేశాలకు కాంగ్రెస్ సభ్యులు గైర్హాజరయ్యారు. తొలి సమావేశానికి టీడీపీ సభ్యుడొకరు, వామపక్ష సభ్యుడు హాజరు కాగా.. ఆ తరువాతి సమావేశానికి మాత్రం అధికార పార్టీ సభ్యులు మినహా మిగిలిన పార్టీల సభ్యులు హాజరు కాలేదు. దీంతో నేటి సమావేశానికి విపక్ష సభ్యులు హాజరవుతారా, లేదా వేచి చూడాలి. ఈ సమావేశంలో ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆయా పథకాలకు కేటాయింపులు ఎలా చేయాలనే అంశంపై చర్చిచనున్నారు.