నేడు ఎస్సీ, ఎస్టీ కమిటీల మూడో భేటీ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధిపై నేడు కీలక భేటీ జరగనుంది. శుక్రవారం సర్వశిక్షా అభియాన్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్ట సవరణల కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్ష తన భేటీ కానున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, సాంఘిక సంక్షేమ మంత్రి జగదీశ్‌రెడ్డి, కమిటీ సభ్యులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, శాఖాధి పతులు ఇందులో పాల్గొననున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈ కమిటీలు సమావేశమై నిధుల వినియోగం గురించి చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నాయి.
తాజాగా జరిగే సమావేశంలో నిధుల కేటాయింపుపై సుదీర్ఘం గా చర్చించనున్నాయి. అంతేకాకుండా శాఖల వారీగా పథకాల రూపకల్పనపై సమీక్ష నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గత రెండు సమావేశాలకు కాంగ్రెస్ సభ్యులు గైర్హాజరయ్యారు. తొలి సమావేశానికి టీడీపీ సభ్యుడొకరు, వామపక్ష సభ్యుడు హాజరు కాగా.. ఆ తరువాతి సమావేశానికి మాత్రం అధికార పార్టీ సభ్యులు మినహా మిగిలిన పార్టీల సభ్యులు హాజరు కాలేదు. దీంతో నేటి సమావేశానికి విపక్ష సభ్యులు హాజరవుతారా, లేదా వేచి చూడాలి. ఈ సమావేశంలో ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆయా పథకాలకు కేటాయింపులు ఎలా చేయాలనే అంశంపై చర్చిచనున్నారు.