సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉచితాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మోడల్ కోడ్‌ను(ఎన్నికల ప్రవర్తనా నియమావళి) సవరించాలని ఎన్నికల సంఘం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఓటర్లకు చెప్పాలని, ఈ ప్రతిపాదనపై ఈ నెల 19వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలకు మంగళవారం లేఖ రాసింది.
మేనిఫెస్టోల్లో ప్రకటించిన ఎన్నికల వాగ్దానాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ఓటర్లకు అందజేయాలని లేఖలో స్పష్టం చేసింది. మోడల్ కోడ్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఆర్థిక వనరులు ఏమిటో కూడా ఓటర్లకు తెలియచేయాలని వెల్లడించింది. పార్టీ ఇచ్చే ఎన్నికల హామీల విషయంలో తాము కళ్లు మూసుకొని కూర్చోలేమని తేల్చిచెప్పింది.
బూటకపు వాగ్దానాలతో విపరిణామాలు
రాజకీయ పార్టీలు ఇచ్చే బూటకపు వాగ్దానాలు విపరిణామాలకు దారితీస్తాయని ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయకుండా తాము అడ్డుకోలేకపోనప్పటికీ, ఓటర్లకు సమాచారం ఇచ్చే హక్కు ఉందని పేర్కొంది. ఇకపై దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నిర్దిష్ట ఫార్మాట్‌లో పార్టీల వ్యయాల వివరాలను అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.
ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల వివరాలను ఓటర్లకు చెప్పే అంశాన్ని ఎన్నికల ప్రవర్తనా నియామావళి(ఎంసీసీ)లోని పార్ట్–8లో (ఎన్నికల మేనిఫెస్టోపై మార్గదర్శకాలు) చేరుస్తూ ఎంసీసీని సవరించాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. దీని ప్రకారం మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీల అమలుకు నిధులు సేకరించే మార్గాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది.
అదనపు పన్నులు, ఖర్చుల హేతుబద్దీకరణ, కొన్ని పథకాల్లో కోత, మరిన్ని అప్పులు తీసుకురావడం వంటి వివరాలు వెల్లడించాలి. ఓటర్లకు ఉచితాలు పంచే సంస్కృతికి రాజకీయ పార్టీలు చరమగీతం పాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే పిలుపునిచ్చారు. దీనిపై అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సైతం జరిగింది. ఉచితాలపై సర్వోన్నత న్యాయస్థానంలో సైతం ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment