పేదోడికి గూడు కలేనా?
భాగ్యనగరంలో గూడు దొరకని అభాగ్యులు!
హైదరాబాద్ జిల్లాలో ఇళ్లకోసం లక్షల్లో దరఖాస్తులు
పెండింగ్‌లో 1.90 లక్షలకుపైగా దరఖాస్తులు
హౌసింగ్ శాఖ చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు
ఏళ్లు గడుస్తున్నా ‘రచ్చబండ’ అర్జీలకూ కలగని మోక్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో పేదోడికి సొంతింటి కల నెరవేరదా..? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమిస్తున్నారు హౌసింగ్ అధికారులు. నగరంలో అద్దె ఇళ్లల్లో ఉంటూ, చాలీచాలని ఆదాయంతో బతుకులీడుస్తున్న పేద వర్గాలవారు ఎప్పటికైనా ఇల్లు రాకపోతుందా అన్న ఆశతో దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు. కానీ వారి ఆశ మాత్రం నెరవేరడం లేదు. ఎదురుచూపులే వారికి మిగులుతున్నాయి. 2011 ఫిబ్రవరిలో నిర్వహించిన మొదటి విడత ‘రచ్చబండ’ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల్లో 1.27 లక్షలమంది, రెండో విడత రచ్చబండలో మరో మూడున్నర వేల మందికిపైగా పేదలు ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏళ్లు గడుస్తున్నాయి కానీ ఆయా దరఖాస్తులకు మోక్షం మాత్రం కలగట్లేదు. లక్షలాది మందికి ప్రయోజనం కల్పించే ఈ విషయమై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో పేదోడికి సొంతగూడు అందనిద్రాక్షగానే మిగిలిపోతోంది.
పెండింగ్‌లో 1.90 లక్షల దరఖాస్తులు..
హైదరాబాద్ జిల్లా హౌసింగ్ విభాగానికి ఇళ్లకోసమంటూ.. దాదాపు రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి. తొలివిడత ‘రచ్చబండ’లో 1.27 ల క్షల దరఖాస్తులు రాగా, రెండో విడతలో 3,500 దరఖాస్తులొచ్చాయి. ఇవిగాక ‘సోషల్ ఎకనామిక్ సర్వే’ కింద ఇళ్లు కట్టిస్తామంటూ 20 వేల పేద కుటుంబాల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మరోవైపు రాజీవ్ గృహకల్ప పథకం కింద రూ.వెయ్యి చెల్లించినా.. ఇళ్లు రానివారు 35 వేలమందికిపైగా ఉన్నారు. జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం ‘మీకోసం’ కార్యక్రమం ద్వారా పేదలనుంచి మరో ఆరు వేలదాకా దరఖాస్తులు హౌసింగ్ విభాగానికి అం దాయి. ఏతావాతా పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 1.90 లక్షలు దాటింది. హౌసింగ్ శాఖ చుట్టూ పేదలు ప్రదక్షిణలు చేస్తున్నారు తప్పించి... ఎలాంటి ప్రయోజనమూ ఉండడం లేదు. మరోవైపు పేదలకు ఇళ్ల నిర్మాణ అంశం గురించి.. అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడంతో వారికి ఏంచేయాలో పాలు పోవట్లేదు.
ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి..
హైదరాబాద్ జిల్లాలో ఇళ్లకోసం ప్రజలనుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అయితే జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలు లేకపోవడంతో సమస్య జటిలమైంది. ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని పొరుగునున్న రంగారెడ్డి జిల్లాలో స్థలాలను ఇస్తే తప్ప పేదలకు ఇళ్లు కట్టించలేం. స్థలాలను కేటాయించాలని పలుమార్లు విన్నవించాం. ఈ విషయమై ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
-కృష్ణయ్య, హౌసింగ్ ప్రాజెక్ట్ డెరైక్టర్