మీ సేవ’ కేంద్రాల నిలువు దోపిడీ
అధిక వసూళ్లతో విద్యార్థుల అవస్థలు
కలిగిరి, న్యూస్‌లైన్:కలిగిరిలోని ‘మీ సేవ’ కేంద్రాలలో ప్రతిపనికీ విద్యార్థుల నుంచి నిర్ణీత ధరలకంటే అధిక మొత్తంలో రుసుం వసూలు చేస్తున్నారు. కలిగిరి మోడల్ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో విద్యార్థులు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ‘మీ సేవ’ కేంద్రాలకు వెళుతున్నారు. ఇదే అదనుగా కేంద్రం నిర్వాహకులు ఒక్కొక్క ధ్రువీకరణ పత్రానికి రూ. 35 తీసుకోవలసి ఉండగా రూ.40 వసూలు చేస్తున్నారు.
అంతేకాక దరఖాస్తు కోసం మరో రూ.15 వసూలు చేస్తున్నారు. ‘మీ సేవ’ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలా అదనపు రుసుం వసూలు చేస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లే కాకుండా ఇతర సేవలపై కూడా అదనంగా రూ.5 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తహశీల్దార్ కార్యాలయంలో కూడా ప్రస్తుతం సర్టిఫికెట్‌కు ఎంత వసూలు చేయాలో నిర్ణయించే బోర్డు కాకుండా, పాత చార్జీలు ఉన్న బోర్డు ఉం చటం విశేషం. దీనిపై తహశీల్దార్ ఆర్. సీతారామయ్యను వివరణ కోరగా నిర్ణీత రుసుం కంటే ఎక్కువ చెల్లించనవసరం లేదన్నారు. అధికంగా వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ‘మీ సేవ’ కేంద్రాలల్లో అధిక వసూళ్లకు పాల్పడుతుంటే 99895 20262కు సమాచారం అందించాలని కోరారు.