ఒలింపిక్ క్రీడలు తొలిసారిగా క్రీస్తుపూర్వం 776లో నాటి గ్రీకు రాజ్యంలోని ఒలింపియా నగరంలో మొదలయ్యాయి. అప్పట్లో ఒకే ఒక్క పోటీ ఉండేది. అది పరుగు పందెం. ఇందులో పాల్గొనడానికి గ్రీకు రాజ్యంలో స్వతంత్ర పౌరులుగా పుట్టిన పురుషులు మాత్రమే అర్హులు. అప్పట్లో బానిసలకు, మహిళలకు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అర్హత ఉండేది కాదు. నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడా పోటీలను నిర్వహించే పద్ధతి అప్పటి నుంచే ఉండేది.
ఒలింపిక్ క్రీడలు మొదలైన తొలి రెండు శతాబ్దాల కాలంలో ఈ పోటీలు మత ప్రాధాన్యం గల ప్రాంతీయ పోటీలుగా మాత్రమే జరిగేవి. కాలక్రమంలో ఒలింపిక్ క్రీడలు గ్రీకు రాజ్యంలో జరిగే నాలుగు ప్రధాన క్రీడోత్సవాల్లో ఒకటిగా గుర్తింపు
పొందాయి.క్రీస్తుశకం మూడో శతాబ్ది నుంచి ఒలింపిక్ క్రీడల వైభవం తగ్గుముఖం పట్టింది. రోమన్ చక్రవర్తి థియోడోసియస్ హయాంలో క్రీస్తుశకం 393లో చివరిసారిగా ఒలింపిక్ క్రీడలు జరిగినట్లు చరిత్రలో నమోదైంది. ప్రాచీన ఒలింపిక్ క్రీడలకు అదే పరిసమాప్తిగా భావించవచ్చు.
గ్రీకు రాజ్యాన్ని రోమన్లు క్రీస్తుపూర్వం 146లో స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఒలింపిక్స్ కొనసాగినా, ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. క్రీస్తుపూర్వం 86లో రోమన్ సేనాని సూలా ఒలింపియాను కొల్లగొట్టాడు. అక్కడ కొల్లగొట్టిన నిధులతో జరిపిన యుద్ధంలో విజయం సాధించి, క్రీస్తుపూర్వం 80లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాడు.
రోమన్ చక్రవర్తి నీరో హయాంలో ఒలింపిక్ క్రీడలు అభాసుపాలయ్యాయి. పిచ్చిమారాజుల్లో ఒకడిగా పేరుమోసిన నీరో రథాల పందేల్లో తొండి ఆటలాడి తనను తానే విజేతగా ప్రకటించుకునేవాడు. తనను తాను మహా సంగీత విద్వాంసుడిగా భావించే నీరో చక్రవర్తి క్రీస్తుశకం 67లో తొలిసారిగా ఒలింపిక్స్‌లో గాత్ర, వాద్య సంగీత పోటీలను కూడా
ప్రవేశపెట్టాడు.
రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ హయాంలో ఒలింపిక్స్‌కు పునర్వైభవం వచ్చింది. అగస్టస్ సీజర్ ఆంతరంగికుడైన మార్కస్ అగ్రిపా ఒలింపియాలోని జూస్ ఆలయాన్ని పునరుద్ధరించి, క్రీస్తుపూర్వం 12లో ఒలింపిక్ క్రీడలను ఘనంగా నిర్వహించాడు.
ఇవి చదవండి: యూసీసీ కింద నమోదైతే పోలీసు రక్షణ
Comments
Please login to add a commentAdd a comment