నెల రోజులుగా ఇబ్బందులే..
తప్పని పెద్దనోట్ల కష్టాలు
రూ.2వేల నోట్లకు దొరకని చిల్లర
జోగిపేట : కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం నేటికి నెల రోజులు అవుతున్నా పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు తీరలేదు. 30 రోజులుగా బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతూనే ఉంది. బ్యాంకులు ఇచ్చే రూ.4 వేల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. నెల మొదటి వారంలో పాలవాడికి, పనివాడికి, ఇంటి అద్దెకు చెల్లించాల్సిన డబ్బులు చేతులో లేకపోవడంతో వచ్చే నెల ఇస్తామంటూ వారు ప్రాధేయపడుతున్నారు.
నల్లడబ్బు వెలికి తీయాలనే ఆలోచన మంచిదే అరుునా సామాన్యులకు ఇబ్బంది కాకుండా ముందస్తుగా డబ్బులను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందని పలువురు అంటున్నారు. జోగిపేట ప్రాంతంలో ఇప్పటికి కొత్త రూ.500 నోట్లు ఇంకా రాలేదు. దీంతో చిల్లర కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. బ్యాంకు వారు రూ.2 వేల నోట్లను ఇస్తుండటంతో వాటికి సరిపడా చిల్లరను మాత్రం ఏ దుకాణదారు ఇవ్వడం లేదు.
పెద్దనోట్లకు చిల్లర లేదంటూ హోటళ్లు, చిన్న చిన్న కిరాణ దుకాణాలల్లో ముందే చెప్పేస్తున్నారు. నెలసరి వేతనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు కూడా ఇబ్బంది పడక తప్పడం లేదు. ప్రభుత్వం ఉద్యోగులకు నెలసరి వేతనాల్లో నుంచి రూ.10 వేల నగదు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఆ డబ్బుల కోసం ఉద్యోగులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. మహిళా ఉద్యోగులు క్యూలో నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఆసరా పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు కూడా క్యూలో నిలబడి నిరీక్షిస్తున్నారు.
మునిపల్లి: కొత్త నోట్ల కోసం మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు, ఉద్యోగులు బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. బుధవారం మండలంలోని బుదేరా, మునిపల్లి గ్రామాల్లో గల బ్యాంకుల వద్ద ప్రజలు డబ్బుల కోసం ఉదయం 8.30 గంటలకే క్యూలో నిలబడ్డారు. క్యూలో చివర నిలబడిన వారికి డబ్బులు దొరకకపోవడంతో అధికారుల తీరుపై మండిపడ్డారు. ఉన్న డబ్బంతా బ్యాంకులో డిపాజిట్ చేసి... కూలీలకు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ప్రశ్నించారు. బ్యాంకు అధికారులు మాత్రం ఒక్కొక్కరికి కేవలం రూ.రెండు వేలు మాత్రమే ఇచ్చారు.