ఏది నలుపు? ఏది తెలుపు? | What is black money and what is white money | Sakshi
Sakshi News home page

ఏది నలుపు? ఏది తెలుపు?

Published Sun, Dec 11 2016 12:59 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

ఏది నలుపు? ఏది తెలుపు? - Sakshi

ఏది నలుపు? ఏది తెలుపు?

మన దేశంలో నల్లధనం అనేది ఒక నిల్వ కాదు.. అదొక ప్రవాహం! నిరంతరం చెలామణి అవుతూనే ఉంటుంది. ఇతర పెట్టుబడుల మాదిరే లాభాలు ఆర్జిస్తూనే ఉంటుంది. పరిమాణంలోనూ విస్తృతిలోనూ ఇంకా ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. నల్లధనాన్ని నోట్ల రూపంలో కాదు.. బంగారంలో, డాలర్ల వంటి విదేశీ మారకాలతో పాటు రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల రూపంలోకి మార్చుకోవడం.. భవన నిర్మాణ రంగం, సినిమా రంగం తదితర వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టడం జరుగుతుందన్నది జగద్విదితం. నల్లడబ్బు, అక్రమాదాయం తదితర కేసుల్లో 2015 సంవత్సరంలో ఆదాయపన్ను శాఖ దాడుల్లో బయటపడిన ఆస్తుల చిట్టాను పరిశీలిస్తే.. వారికి నగదు రూపంలో దొరికినది అతి స్వల్పం. మొత్తంగా చూస్తే.. నల్లడబ్బులో 6 శాతం కన్నా తక్కువగానే నగదు రూపంలో ఉందని.. మిగతా 94 శాతం స్థిరాస్తుల్లోనూ, కంపెనీల్లోనూ పెట్టుబడులుగా పెడుతున్నారని అర్థం చేసుకోవచ్చునని నిపుణులు చెప్తున్నారు. అసలు ఆర్థికవ్యవస్థలో నల్ల డబ్బు అంటే ఏమిటి? అదెలా పుడుతుంది? తెల్ల డబ్బు ఎలా నల్లడబ్బుగా.. నల్లడబ్బు ఎలా తెల్లడబ్బుగా మారుతుంది? నల్ల డబ్బు రీసైక్లింగ్‌ ఎలా జరుగుతుంది.. అనే అంశాలను స్థూలంగా చూద్దాం!

నల్లధనం ఎలా పుడుతుంది?
ఒక వ్యక్తి లేదా సంస్థ.. ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఎగవేయడానికి లెక్కల్లో చూపకుండా దాచేసే తన ఆదాయమే నల్లధనం. ఈ నల్లధనం.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, చట్టబద్ధ కార్యకలాపాలు రెండింటి ద్వారానూ పుడుతుంది.
► బెదిరింపు వసూళ్లు, స్మగ్లింగ్, మనుషుల విక్ర యం, మాదకద్రవ్యాల దొంగ రవాణా, అక్రమ మైనింగ్, ఆర్థిక మోసాలు వంటి నేరాలతో పాటు.. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న వారు అవినీతి కార్యకలా పాలు, లంచాల స్వీకరణ ద్వారా సంపాదించేది. ఆ లావాదేవీలు చట్టవిరుద్ధంగా జరుగుతాయి కాబట్టి లెక్కలోకి రాదు, పన్నూ ఉండదు.. అదంతా నల్లధనమే అవుతుంది.
► చట్టబద్ధంగా పనిచేసే ఒక పరిశ్రమ తన ఉత్పత్తులను తగ్గించి చూపడం ఒక విధానం. ఒక సంస్థ 100 వస్తువులను ఉత్పత్తి చేసి 70 వస్తువులు ఉత్పత్తి చేసినట్లు ప్రభుత్వానికి చెప్తుంది. మిగతా 25 వస్తువులపై వచ్చే ఆదాయాన్ని చెప్పకుండా దాచివేసి, దానిపై పన్ను కట్టకుండా ఎగవేస్తుంది. ఈ దాచేసిన ఆదాయం నల్లధనం.
► ఒక ప్రభుత్వ వైద్యుడు సర్కారు నుంచి జీతం తీసుకుంటూనే.. సొంతంగా ప్రాక్టీస్‌ చేస్తూ కూడా ఆదాయం సముపార్జిస్తుంటాడు. సర్కారు జీతం మాత్రమే ఆదాయంగా లెక్కలోకి వస్తే.. ప్రాక్టీస్‌ చేస్తూ సంపాదించేది నల్లధనం అవుతుంది. అలాగే.. న్యాయవాదులు తమ రశీదుల్లో చూపే ఫీజు కన్నా చాలా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారు. ఇలా అదనంగా ఆర్జించే మొత్తం నల్లధనం అవుతుంది.

సరిహద్దులు దాటించే హవాలా!
► ‘ఎ’ అనే నేరస్తుడు దేశంలో అక్రమ కార్యకలాపాల ద్వారా రూ.100 కోట్లు నగదు సంపాదిస్తాడు. దానిని ‘హవాలా’ మార్గం ద్వారా విదేశాలకు పంపిస్తాడు. స్థానిక హవాలా నిర్వాహకుడికి ఆ డబ్బు ఇస్తాడు. సదరు నిర్వాహకుడికి అవసరమైన ‘ఫీజు’ కూడా చెల్లిస్తాడు.
► విదేశంలో ‘ఎ’ అంతకుముందే బినామీ పేరుతో స్థాపించిన ఒక షెల్‌ కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాలో ఈ డబ్బు జమ అయ్యేలా ‘హవాలా’ నిర్వాహకుడు ఏర్పాట్లు చేస్తాడు.
► విదేశంలో ఉన్న ‘ఎ’ బినామీ కంపెనీ.. తన ఖాతాలో ఉన్న డబ్బుతో దేశంలో ‘ఎ’కు చెందిన కంపెనీలో షేర్లు కొంటుంది. అది కూడా అత్యధిక రేట్లు చెల్లిస్తుంది.
► షేర్ల అమ్మకాల్లో లాభాలు వచ్చాయంటూ సదరు కంపెనీ ‘ఎ’కి అధికమొత్తం జీతాలు, డివిడెంట్లు చెల్లిస్తుంది. ఇప్పుడిక ‘ఎ’ ఈ మొత్తాన్ని తన ఆదాయంగా చూపించుకుని తెల్లధనంగా దర్జాగా ఉపయోగించుకుంటాడు.
చిన్నమొత్తాల్లో ‘స్మర్ఫింగ్‌’
► ‘ఎ’ తన అక్రమ సంపాదనను చిన్న చిన్న భాగాలుగా చాలా బ్యాంకు ఖాతాల్లో జమచేయిస్తాడు. ప్రభుత్వం రూ.10 లక్షలు, ఆ పైన లావాదేవీలపై నిఘా పెడుతుందనుకుంటే.. రూ. 9 లక్షల చొప్పున పలు ఖాతాల్లో జమచేస్తారు.
► ఈ బ్యాంకు ఖాతాలన్నిటి నుంచి డబ్బును విదేశంలో ఉన్న ఒక వ్యక్తి లేదా సంస్థ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తాడు.
► ఆ విదేశీ బ్యాంకు ఖాతా యజమానితో ‘ఎ’ ఒక రుణ ఒప్పందం చేసుకుని.. అదే డబ్బును అప్పుగా తీసుకుంటాడు. దానితో దర్జాగా ఆస్తులు కొనుక్కుంటాడు.

నల్లధనం ఎగుమతి.. దిగుమతి!
► ఒక సంస్థ ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమ తుల ధరలను వాస్తవ ధరల కన్నా ఎక్కువగా చూపు తుంది. అంటే.. రూ.1 లక్ష విలువైన వస్తువును కొం టే.. దానిని రూ. 2 లక్షలకు కొన్నట్లు చూపుతుంది.
► అదే సంస్థ తాను ఎగుమతి చేసే వస్తువుల ధరలను తక్కువగా చూపుతుంది. అంటే.. రూ. 2 లక్షల విలువైన వస్తువును ఎగుమతి చేస్తే దాని ధరను రూ.1 లక్ష అని మాత్రమే లెక్క చూపుతుంది.
► ఇలా రెండు రకాలుగా నల్లధనాన్ని దేశం దాటిస్తుంది. అదే డబ్బును షెల్‌ సంస్థల ద్వారా విదేశీ పెట్టుబడుల రూపంలో దేశానికి రాచమార్గంలో తిరిగి తెస్తుంది.
► ఇలా వచ్చిన ‘ఎఫ్‌డీఐ’ మీద ప్రత్యేక రాయితీలు, మినహాయింపులు కూడా పొందుతుంది.

నలుపే తెలుపు..తెలుపే నలుపు!
► మహేశ్‌ ఒక వేతన ఉద్యోగి. అతడి యాజమా న్య సంస్థ.. అతడి నెలవారీ ఆదాయాన్ని అతడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. కాబట్టి.. అతడి ఆదాయం తెల్లధనమే.
► మహేశ్‌ ఏటీఎం నుంచి కొం త డబ్బు విత్‌డ్రా చేసుకుంటాడు. దాంతో స్థానిక పాన్‌ షాపులో కొన్ని గుట్కా ప్యాకెట్లు కొం టాడు. పాన్‌ షాపు యజమా నికి ఈ విక్రయాలపై వచ్చే ఆదాయం స్వల్పమే కాబట్టి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. అమ్మకాల డబ్బులో అధిక భాగాన్ని హోల్‌సేల్‌ వ్యాపారికి, అక్కడి నుంచి తయారీదారుకు పంపిస్తాడు.
►  గుట్కా తయారీదారు తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని లెక్క చూపకుండా దాచవచ్చు. తద్వారా గణనీయ మొత్తంలో పన్ను ఎగవేయవచ్చు. ఇప్పుడు.. మహేశ్‌ పన్ను కట్టిన తెల్ల ధనంలో కొంత భాగం ఇలా నల్లధనంగా మారుతుంది.
► గుట్కా తయారీదారు ఈ నల్ల ఆదాయంలో తన పంపిణీదారులు, రిటైల్‌ వ్యాపారులకు వాటా పంచాల్సి ఉంటుంది. రోజు వారీ వ్యాపార ఖర్చుల కోసం తన వద్ద స్వల్ప మొత్తాన్ని ఉంచుకుంటాడు.
► మిగతా నల్లధనంతో.. సదరు గుట్కా తయారీదారు ఒక ప్రభుత్వ పన్ను అధికారికి లంచం చెల్లించి.. కొంత భూమిని కొనుక్కుంటాడు. అందుకయ్యే వ్యయంలో కొంత భాగాన్ని చెక్కు రూపంలో తెల్లధనం చెల్లిస్తాడు. నల్లధనాన్ని కొంత ఉపయోగించి రైతు నుంచి పొగాకు కూడా కొంటాడు.
► అవినీతి పన్ను అధికారికి లంచం రూపంలో అందిన నగదు, భూమి విక్రేత చేతిలో ఉన్న నగదు నల్లధనం అయితే.. రైతుకు అందిన డబ్బు తెల్లధనం అవుతుంది.
► అవినీతి పన్ను అధికారి తన వద్ద ఉన్న నల్ల ధనంలో కొంత భాగంతో ఒక ఖరీదైన వాచీ కొ నుక్కుని, మిగతా మొత్తాన్ని నగదులాగా ఉంచు కుంటాడు. భూమి అమ్మిన వ్యక్తి నల్లధనంలో కొంత మొత్తంతో తన కుమార్తె పెళ్లి కోసం నగలు కొని, మిగతా మొత్తాన్ని నగదు రూపంలో దాచుకుంటాడు. రైతు తనకు వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని చికిత్స కోసం వైద్యుడికి చెల్లిస్తాడు.
► ఖరీదైన వాచీని విక్రయించిన షోరూమ్, నగలు విక్రయించిన వ్యాపారి.. తమ అమ్మకాలను లెక్కలో చూపి పన్ను కడతారు. అలా ఆ నల్లధనం మళ్లీ తెల్లధనం అవుతుంది. వైద్యుడు తన ఆదాయంలో కొంత భాగాన్ని లెక్కల్లో చూపకుండా పన్ను ఎగవేస్తాడు. అలా తెల్లధనం మళ్లీ నల్లధనం అవుతుంది.
ఇది కేవలం అతి చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి కోట్ల మంది మహేశ్‌లు, తయారీదారులు, అవినీతి అధికారులు, భూ విక్రేతలు, వైద్యులు దేశంలో ఉన్నారు. వేల రకాల వ్యాపారాలు, వ్యవహారాల్లో ఈ విధంగా ఆర్థిక లావాదేవీలు సాగుతుంటాయి.

చిట్టాపద్దుల్లో మాయాజాలం!
చాలా సంస్థలు అనుసరించే విధానమిది. ప్రభుత్వానికి సమర్పించే పద్దుల లెక్కల్లో ఆదాయాన్ని తక్కువ చేసి, వ్యయాన్ని ఎక్కువ చేసి చూపడం. దీనివల్ల రెండు వైపులా లాభిస్తుంది. ఆదాయాన్ని తక్కువగా చూపడం ద్వారా తక్కువ పన్నులు కడతారు. వ్యయాన్ని ఎక్కువగా చూపడం ద్వారా ఎక్కువ మొత్తం పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జిస్తారు. ఇక అక్రమంగా సంపాదించిన నగదును తెలుపు చేసుకోవడానికీ ఇలాంటి పద్ధతిని అనుసరిస్తాయి.
► అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని సంస్థ సక్రమ అమ్మకాల్లో కలిపేసి.. అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు చూపుతాయి. దీంతో నలుపు తెలుపవుతుంది.
► అదే సమయంలో మరో రకంగా.. (సాధారణంగా సోదర సంస్థలో) అధికంగా నష్టం వాటిల్లినట్లు చూపుతాయి. అధిక అమ్మకాల ఆదాయంపై పన్ను కట్టకుండా తప్పించుకుంటాయి.
► ఇలా నలుపును తెలుపు చేసుకుని ఆ సంస్థ యజమానులు, భాగస్వాములు ఆస్తులను కొనడానికి ఉపయోగిస్తారు.

ఎన్నికల్లో ‘నల్ల’ ప్రవాహం!
మన దేశంలో ఎన్నికల్లో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు భారీ స్థాయిలో ఖర్చు చేస్తారనేది బహిరం గ రహస్యం. ఎన్నికల ప్రచారానికే కాదు.. పార్టీ కార్యకర్తలకు డబ్బు ‘గట్రా’ చెల్లించడానికి, ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు.. రాజకీయ పార్టీలకు భారీ మొత్తంలో నగదు అవసరం. సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అధ్యయనం ప్రకారం.. 2014 లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీలూ కలసి దాదాపు రూ. 30,000 కోట్లు ఖర్చు పెట్టాయి. కానీ.. ఎన్నికల కమిషన్‌కు చూపే అధికారిక లెక్కలు మాత్రం నామమాత్రంగా ఉంటాయి. మరి మిగతా అదనపు డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చినట్లు? అదంతా వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, వ్యక్తుల నుంచి అందే నల్లడబ్బేనన్నదీ జగమెరిగిన రహస్యం! ఇలా కూడా నల్లధనం చాలా వరకూ ప్రజల్లోకి వెళ్లి తెల్లగా మారుతుంది!!

‘స్థిరాస్తి’లో ఇలా..
నల్లధనంలో అత్యధిక భాగం స్థిరాస్తి రంగంలో ఉంటుంది. అది పెట్టుబడుల రూపంలో ఉంటుంది. క్రయవిక్రయాలతో పాటు చేతులు మారుతూ ఉంటుంది. భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు వంటి స్థిరాస్తుల ధరలు నిరంతరం పెరుగుతుంటాయి. ఈ క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లపై చెల్లించాల్సిన పన్నులు భారీగా ఉంటాయి. దీంతో ఒక ఇంటి అసలు ధరను సగానికి తగ్గించి చూపుతారు. ఉదాహరణకు ఒక ఇంటి ధర రూ.2 కోట్లు అయినట్లయితే.. రిజిస్ట్రేషన్‌ సమయంలో దాన్ని రూ.1 కోటిగానే చూపుతారు. అంతమేరకే పన్ను చెల్లిస్తారు. అమ్మకందారుకు కొనుగోలుదారు మిగతా కోటి రూపాయలను నల్లధనంగా చెల్లిస్తాడు. అలా ఆ నల్లధనం స్థిరాస్తిలో పెట్టుబడిగా మారుతుంది. అమ్మకందారు ఆ నల్లధనాన్ని మళ్లీ మరొక స్థిరాస్తి లావాదేవీలో పెట్టుబడిగా పెడతాడు. ఇలా స్థిరాస్తి రంగంలో నల్లధనం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది.

►నల్లధనాన్ని తెలుపు చేసుకోవడానికి.. సమాజ సేవ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేస్తారు. అందులో తమ బంధుమిత్రులను కార్యనిర్వాహక సభ్యులుగా నియమించుకుంటారు. ఆ సంస్థకు నల్లధనాన్ని విరాళాలుగా ఇస్తారు. అది కాగితాలపై సమాజ సేవ చేస్తుంది కానీ.. వాస్తవంగా నల్లధనాన్ని తెలుపు చేస్తుంది.
► కాస్త చిన్న మొత్తాల్లో నల్లధనాన్ని తెలుపు చేసుకోవడానికి.. వ్యవసాయంపై వచ్చిన ఆదాయంగా చూపడం, నగలు, వ్యక్తిగత ఆస్తులు విక్రయించగా వచ్చిన సొమ్ముగా చూపడం, బంధువుల నుంచి కానుకలుగా చూపడం, మిత్రుల నుంచి రుణాలు తీసుకున్నట్లుగా చూపడం వంటి ఎన్నో మార్గాలు అనుసరిస్తుంటారు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement