సరిపోని ‘లెక్క’
నెల్లూరు(సెంట్రల్) : కేంద్ర ప్రభుత్వం ఏ మూహూర్తాన పెద్ద నోట్లను రద్దు చేసిందో కాని సామాన్యులు నోట్ల కోసం అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ప్రధానంగా కనీసం రద్దయిన నోట్లకు సరిపడా జిల్లాకు ఆర్‌బీఐ నుంచి నగదు రాక పోవడంతో రోజురోజుకు నోట్ల కష్టాలు ఎక్కువవుతున్నాయి. డిపాజిట్ చేసిన పాతనోట్లకు సమానంగా అయినా పంపక పోవడంతో ప్రస్తుతం కరెన్సీ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పాలకులు చెప్పినట్లు 50 రోజులలో కాస్త సర్దుకున్నా మళ్లీ నగదు కోసం సామాన్య, మధ్య, పేద తరగతి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల నుంచి జిల్లాలో దాదాపుగా 98 శాతం ఏటీఎంలు పనిచేయక పోవడంతో పాటు డబ్బులు లేక పోవడంతో బ్యాంకులకు కూడా ఆర్థిక సంక్షోభం వచ్చిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
నోట్ల రద్దు నుంచి ఇప్పటి వరకు వచ్చింది రూ.1,683 కోట్లు
గత ఏడాది నవంబరు 8వ తేదీ పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 8, 9 తేదీలలో బ్యాంకులు, ఏటీఎంలకు సెలవు ఇచ్చారు. 10వ తేదీ నుంచి బ్యాంకులలో రద్దయిన నోట్లను మార్పిడి చేస్తూ వచ్చారు. గత ఏడాది డిసెంబరు వరకు పాత నోట్లను బ్యాంకులలో తీసుకున్నారు. జిల్లాలో మొత్తం బ్యాంకులు 418 ఉండగా, వాటికి అనుబంధంగా 443 ఏటీఎం లున్నాయి. డిసెంబరు వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులలో రూ.2,687 కోట్లను డిపాజిట్ చేశారు. కాగా జిల్లాలో ఉన్న బ్యాంకులలో రోజువారీ లావాదేవీలు సర్దుబాటు చేయాలంటే కనీసం రోజుకు దాదాపుగా రూ.100 కోట్ల అవసరం ఉంటుంది. అంటే ఇప్పటికి 114 రోజులకు గాను రూ.11,400 కోట్ల అవసరం ఉంది. కాని మనకు ఇప్పటి వరకు వచ్చింది మాత్రం రూ.1,683 కోట్లు. అంటే ఇంకా రూ.9,717 కోట్లు అవసరం. కనీసం సగానికి కూడా నగదు ఇవ్వక పోవడంతో జిల్లాలోని పలువురు పేదలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తీరని నోట్ల కష్టాలు
నోట్లు రద్దయినప్పటి నుంచి జిల్లాలో చిన్నాచితాకా వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోజు కూలీ చేసుకుని జీవనం సాగించే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నవంబరు 8వ తేదీ నుంచి నోట్ల కోసం డిసెంబరు నెల వరకు బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద ప్రజలు కష్టాలను చవిచూశారు. జనవరి మొదటిలో కొంత ఊరట ఇచ్చినా.. తిరిగి మళ్ళీ నోట్ల కష్టాలు యథావిధిగా మొదటికొచ్చింది. రెండు నెలల నుంచి చాలా చోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మొన్నటి వరకు మార్చి నెల కావడంతో ఈ నోట్ల కష్టాలు మరింత ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతా లలోని వారు నిత్యం సుదూర ప్రాంతాలలో ఉన్న బ్యాంకుల వద్దకు వెళ్ళడం, నగదు లేదని చెప్పడంతో ఊసురుమంటూ వెనుతిరగడం సర్వసాధారణమైంది. నగదు సరిపడా బ్యాంకులకు ఎప్పుడు వస్తుందో బ్యాంకు ఉన్నతాధికారులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.